తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది ఉన్నతాధికారులపై తీవ్రస్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసింది కాంగ్రెస్ పార్టీ. రిటైర్ అయ్యాక కూడా కొందరికి ఎక్స్‌టెన్షన్ ఇచ్చి మరీ కొనసాగించడాన్ని అప్పట్లో తప్పుపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే.. పరిస్థితిని గమనించిన అలాంటి ఆఫీసర్లలో కొందరు, మరికొందరు సలహాదారులు కూడా రాజీనామాలు చేశారు. ఇంకొంతమంది మీద రేవంత్ సర్కార్ వేటేసింది. కానీ.. ఇంకా వివిధ శాఖల్లో రిటైర్డ్ ఆఫీసర్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. అలాంటి వాళ్ళ విషయంలో సర్కార్ వైఖరి ఏంటన్నదే ఇప్పుడు సెక్రటేరియెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రిటైర్డ్ అయిన వారు.. తాము కావాలనుకున్న ఉన్నతాధికారుల సేవలను ఎక్స్‌టెండ్ చేసింది బీఆర్ఎస్ సర్కార్. కన్సల్టెంట్స్, సలహాదారులంటూ వివిధ రూపాల్లో వాళ్ళని వాడుకుంది. అలా చేయడం ఖజానా మీద భారం మోపడమేనని, సర్వీస్ పొడిగింపు లభించినవారు ఎంతో కొంత పక్షపాత వైఖరితో ఉంటారని అప్పట్లో విమర్శించింది కాంగ్రెస్.
ఒక్క ఇరిగేషన్ శాఖలోనే ఇలా ఐదుగురు ఉన్నతాధికారులు వివిధ హోదాల్లో ఉన్నారట. మురళీధర్ రావు, నల్లా వెంకటేశ్వర్లుతో పాటు మరో ముగ్గురు ఈ లిస్ట్‌లో ఉన్నట్టు తెలిసింది. రోడ్లు భవనాల శాఖలో గణపతి రెడ్డి, రవీందర్ రావు కొనసాగుతున్నట్టు చెబుతున్నాయి సచివాలయ వర్గాలు. ఇటు పంచాయితీ రాజ్ శాఖలో మరో ఉన్నతాధికారి ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా కొందరు రిటైర్డ్ ఐఏఎస్‌లు కూడా వివిధ శాఖల్లో కొనసాగడం చర్చనీయాంశం అవుతోంది.
పదవీవిరమణ చేసిన ఐఏఎస్‌లు రాణి కుముదిని, ఆధర్ సిన్హా, అరవిందర్ సింగ్, ఉమర్ జలీల్, అనిల్ కుమార్ వివిధ శాఖల్లో కొనసాగుతున్నారు. వీరి విషయంలో కాంగ్రెస్ సర్కార్ చర్యలు ఎలా ఉంటాయన్న చర్చ ఇప్పుడు హాట్ హాట్‌గా మారింది. గతంలో తాము వద్దన్న వాళ్ళను ఇప్పుడు అవసరాల పేరుతో కొనసాగిస్తారా? లేక దశలవారీగా ఇంటికి పంపుతారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తం మీద గత సర్కార్ ప్రాపకంతో పదవుల్లో కొనసాగుతున్న ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఎవరి మీద వేటు పడుతుందోనన్న టెన్షన్ మాత్రం వాళ్ళల్లో పెరుగుతోందంటున్నాయి సచివాలయ వర్గాలు.