తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ రిలీజ్ అవుతోంది. ఈనెల 18 వరకూ నామినేషన్ల స్వీకరిస్తారు. ఈనెల 29న పోలింగ్, అదే రోజు సాయంత్రం ఫలితాలు విడుదల చేస్తారు. ఎమ్మెల్యేల కోటాలో ఈ ఎమ్మెల్సీల ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు సీట్లకు విడి విడిగా నోటిఫికేషన్లను జారీచేయనున్నారు. బీఆర్ఎస్ కు చెందిన కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నిక అవడంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాలు చేశారు. దాంతో EC ఈ ఉపఎన్నికలను నిర్వహిస్తోంది. రెండు సీట్లకు విడివిడిగా నోటిఫికేషన్లు జారీ అవగా.. రెండింటికీ వేర్వేరుగా పోలింగ్ జరుగుతోంది. దాంతో అసెంబ్లీలో మెజార్టీ ఉన్న కాంగ్రెస్ పార్టీకే ఈ రెండు ఎమ్మెల్సీలు దక్కనున్నాయి. మొదట రెండు వేర్వేరుగా జరుగుతాయి… అప్పుడు కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ ఒకటి గెలుచుకుంటాయని అంతా అనుకున్నారు. కానీ ఇవి ఉప ఎన్నికలు కావడంతో విడిగానే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ వివరణ ఇచ్చింది. దాంతో ఎన్నికల కమిషన్ నిబంధనలు కాంగ్రెస్ కు కలిసొచ్చాయి. అసెంబ్లీలో ఉన్న మెజారిటీతో కాంగ్రెస్ 2ఎమ్మెల్సీలను గెలుచుకోబోతోంది. అయితే ఎలాగూ ఓడిపోయే అవకాశం ఉన్నందున బీఆర్ఎస్ పోటీ చేస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటిదాకా గులాబీ పార్టీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటే మాత్రం ఏకగ్రీవ ఎన్నిక అవుతుందని అంటున్నారు. అయితే కాంగ్రెస్ లో ఎవరికి ఈ ఛాన్స్ దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్సీ పదవుల కోసం కాంగ్రెస్ నేతలు భారీగా పోటీ పడుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థులపై కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన చేసే అవకాశం ఉంది. అటు గవర్నర్ కోటాలో రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో ఒకటి టీజేఎస్ అధినేత కోదండరామ్ కి కేటాయించనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. మరో స్థానాన్ని మైనారిటీకి చెందిన అభ్యర్థిని ప్రకటించే ఛాన్సుంది. ఈ రేసులో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, విద్యావేత్త జాఫర్ జావెద్ పేరును పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు.