తెలంగాణ (Telangana Government) ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పోలీస్ శాఖతో పాటు CMO, సెక్రటరియేట్ (Secretariat) లో ఉన్న BRS పార్టీ కోవర్టులను ఏరివేసే పనిలో ఉన్నారు. మొన్నటికి మొన్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒకేసారి 85 మందిని బదిలీ చేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా అదే. కానీ ఇప్పుడు నీటిపారుదల శాఖ (Irrigation Department) లో ఉన్న కట్టప్పలను గుర్తించలేక ఇరుకున పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో బాగా లంచాలు మెక్కి కోట్లు కూడబెట్టుకున్న కొందరు నీటిపారుదల అధికారులు… స్వామి భక్తి చూపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వానికి, మంత్రులకు సమాచారం ఇవ్వకముందే… మాజీ మంత్రికి చేరవేస్తున్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram project) లో వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ సర్కార్ (Congress Govt) భావిస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి సీఎం పదవి చేపట్టగానే… ఆ శాఖపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రతి ప్రాజెక్టులో అవినీతిని వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలను కూడా రిలీజ్ చేశారు. కానీ నీటిపారుదల శాఖలోని కొందరు అధికారుల తీరుతో ప్రస్తుత ప్రభుత్వం ఇరకాటంలో పడుతోంది. కొందరు అధికారులు సరిగా విధులకు హాజరు కాకపోవడం… ఇంకొందరు మంత్రుల మీటింగ్స్ లో సమాచారాన్ని మాజీ మంత్రికి చేరవేస్తుండటం ఇబ్బందికరంగా మారింది. మేడిగడ్డ దగ్గర జరిగిన సమావేశంలో కొందరు అధికారులు మంత్రులకు తప్పుడు లెక్కలు సమర్పించారన్న ఆరోపణలు వచ్చాయి.
కృష్ణా బోర్డుకి ప్రాజెక్టుల అప్పగింతపైనా కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారానికి కూడా ఆ అధికారులే కారణమని అంటున్నారు. జనవరి 17న కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై సమావేశం ఉంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు ఈ అప్పగింత వల్ల జరిగే అన్యాయంపై రిపోర్టులు తయారు చేయాలని అంతకు ముందే అధికారులను ఆదేశించారు మంత్రులు. కానీ ఏ ఒక్క అధికారి కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ తయారు చేయలేదు. ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించలేమని రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా చెప్పినా ఆ సమాచారాన్ని కూడా కేంద్ర జలశక్తి శాఖ అధికారులకు ఇవ్వలేదు.
సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో జరుగుతున్న సమావేశాల సారాంశాన్ని మాజీ మంత్రికి ఎప్పటికప్పుడు చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఏయే పాయింట్స్ పై ఇరుకున పెట్టవచ్చో కూడా ఆ కట్టప్పలే ప్రతిపక్షాలకు వివరిస్తున్నట్టు చెబుతున్నారు. దాంతో ఆ సమాచారాన్ని ఆధారం చేసుకొని… ప్రభుత్వంపై BRS ఎదురు దాడి చేస్తున్నట్టు అర్థమవుతోంది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించడంలోనూ ఈ కట్టప్పలే కీలకంగా వ్యవహరించారనీ… అవన్నీ బయటపడతాయన్న ఉద్దేశ్యంతో ఇప్పుడు కూడా చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. కానీ ఇప్పటికైనా ఈ అవినీతి అధికారులను కంట్రోల్ చేయకపోతే చాలా నష్టపోతామని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. వాళ్ళపై ఎలా చర్యలు తీసుకోవాలన్న దానిపై ఆలోచన చేస్తున్నారు.