Karimnagar Campaign: ఆ ఎంపీ సీటుకు కాంగ్రెస్ అభ్యర్థే లేరు !

పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) దగ్గర పడుతుండటంతో కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రత్యర్ధులు ప్రచారం ప్రారంభించారు. అయినా అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం ఆలోచనల దశ దాటలేదు. అది కాంగ్రెస్‌ కల్చరే అనుకున్నా... అవతల బలమైన ప్రత్యర్థులు కంగారు పెడుతున్నారట.

 

పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections) దగ్గర పడుతుండటంతో కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రత్యర్ధులు ప్రచారం ప్రారంభించారు. అయినా అధికార పార్టీ కాంగ్రెస్ మాత్రం ఆలోచనల దశ దాటలేదు. అది కాంగ్రెస్‌ కల్చరే అనుకున్నా… అవతల బలమైన ప్రత్యర్థులు కంగారు పెడుతున్నారట. రాష్ట్రంలో పార్టీకి పాజిటివ్‌ వేవ్ ఉన్నా… అక్కడ మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవట. సమర్ధుడైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ నేతలు.

కరీంనగర్ లోక్‌సభ స్థానం…ఇక్కడ పది సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం (Congress Party Victory) సాధించింది… అలాంటి చోట 2009లోనే ఆ పార్టీకి ఆఖరు విజయం. ఇప్పుడు పునర్వైభవం సాధించేందుకు అన్ని ప్రయత్నాలు ప్రారంభించారు కాంగ్రెస్ నేతలు… ఈ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లలో నాలుగింటిని గెలుచుకుంది హస్తం పార్టీ… గత మూడున్నర దశాబ్దాల్లో హస్తం పార్టీకి ఈ రేంజ్ లో సీట్లు ఎప్పుడూ దక్కలేదు.. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కరీంనగర్ లోక్‌సభ ఇంచార్జ్‌ బాధ్యతలను అప్పగించారు. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) కాంగ్రెస్ పార్టీకి 5 లక్షలకు పైగా ఓట్లు రావడంతో, పార్లమెంట్‌పై ధీమాగా ఉన్నారట నేతలు. అయితే అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు తయారైందట ఆ పార్టీ పరిస్థితి.. నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే రేంజ్ లీడర్ అభ్యర్థిగా లేకపోవడం మైనస్‌ గా మారిందంటున్నారు.

ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి దాదాపు ప్రచారాన్ని ప్రారంభించినా… కాంగ్రెస్‌కు ఇంకా క్లారిటీ రాకపోవడం మైనస్సే అన్న చర్చలు సాగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ (MLC Santosh Kumar), హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, పీసీసీ అధికార ప్రతినిధి రోహిత్ రావు ఆసక్తిగా ఉన్నారట. ఆశావహుల్లో… ఉన్న కొందరు మొదట పోటీ చేసేందుకు అనాసక్తిగా ఉన్నప్పటికీ మారిన పరిస్థితుల్లో బరిలో ఉండాలని భావిస్తున్నారట.

ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్‌గా ఉన్న జీవన్‌… కరీంనగర్‌పైనా కన్నేశారట… రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో కరీంనగర్‌, నిజామాబాద్‌ నియోజకవర్గాల్లో ఎక్కడ అవకాశం కల్పించినా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పార్టీ నాయకత్వానికి తెలిపినట్టు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్‌ టికెట్‌ ఆశించిన అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అప్పుడు నిరాశే ఎదురైంది. ఆ స్థానంలో పార్టీ అధిష్టానవర్గం పొన్నం ప్రభాకర్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సమయంలో ప్రవీణ్‌రెడ్డికి కొన్ని హామీలిచ్చారట హైకమాండ్ పెద్దలు… పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పిస్తామని లేదా ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తామని హామీ ఇచ్చి బుజ్జగించారట… ఇప్పుడు ఆయన కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అభ్యర్థి ఎంపిక ఆసక్తిగా మారింది.

మొదట పోటీ చేసేందుకు ఆసక్తి చూపని వారు మారిన రాజకీయ పరిస్థితులు, క్షేత్ర స్థాయి పరిస్థితులను గమనించి పార్లమెంట్ సీట్‌ కోసం ప్రయత్నాలు ప్రారంభించడం ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి వినోద్‌, బీజేపీ నుంచి బలమైన నేత బండి సంజయ్‌ బరిలో ఉండటంతో వారిని ఢీకొట్టే కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనేది క్యూరియాసిటీగా మారింది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎవరు ఖరారవుతారు…? అభ్యర్థి ఎంపిక విషయంలో ఏయే సమీకరణాలు ప్రామాణికం అవుతాయి…? అనే అంశాలపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది నియోజకవర్గంలో. ఫైనల్‌గా ఎవరి పేరు బయటికి వస్తుందో చూడాలి.