తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీలకు ఈనెల 29న ఎన్నికల జరగబోతోంది. ఈ రెండూ కాంగ్రెస్ కే దక్కనున్నాయి. ఎమ్మెల్యేల కోటాల జరిగే ఈ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ సీనియర్ నేతలు అద్దంకి దయాకర్ (Addanki Dayakar) , మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పేర్లను AICC ప్రకటిస్తుందని తెలుస్తోంది. ఈనెల 18లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కడియం శ్రీహరి (Kadiam Srihari) , కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) రాజీనామాలతో ఈ MLC ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఈసీ నిబంధనల ప్రకారం రెండు ఉపఎన్నికలను వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. దాంతో అసెంబ్లీలో మెజారిటీ ఉన్న కాంగ్రెస్ కే ఈ రెండూ దక్కనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత.. బీఆర్ఎస్ కు రెండు ఎమ్మెల్సీలు కోల్పోవడం మరో దెబ్బే. అందుకే హైకోర్టుకు వెళ్ళిన బీఆర్ఎస్.. రెండు ఎన్నికలను ఒకే నోటిఫికేషన్ కింద నిర్వహించాలని సవాల్ చేసింది. అలా నిర్వహిస్తే.. కాంగ్రెస్ ఒకటి, బీఆర్ఎస్ ఒకటి గెలుచుకునే ఛాన్స్ ఉండేది. కానీ ఇవి ఉపఎన్నికలు కావడంతో అలాంటి ఛాన్స్ లేదని ఎన్నికల కమిషన్ తరపున న్యాయవాది తేల్చి చెప్పారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది కాంగ్రెస్ నేతలు త్యాగాలు చేశారు. మొదటి నుంచీ పార్టీని నమ్ముకొని ఉన్న వీళ్ళకు ఎమ్మెల్సీలుగా ఇతర పదవుల్లో అవకాశం ఇస్తామని అప్పట్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అందుకే టిక్కెట్లు ఆశించి భంగపడిన అద్దంకి దయాకర్ తో పాటు మహేశ్ కుమార్ గౌడ్ కి ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వబోతున్నారు. శనివారం నాడే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలపై AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చలు జరిపారు. ఈ లిస్టులో అద్దంకి, మహేష్ తో పాటు హర్కార వేణుగోపాల్, జి.చిన్నారెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డి, బలరాం నాయక్ పేర్లు కూడా ఉన్నాయి. అయితే అద్దంకి, మహేశ్ కి ఎమ్మెల్సీలు ఇచ్చి.. చిన్నారెడ్డి, వేణుగోపాల్ ని ప్రభుత్వ పదవుల్లోకి తీసుకునే అవకాశాలను AICC పరిశీలిస్తోంది. అవసరమైతే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల MLA రేసులో చిన్నారెడ్డి దింపాలని కూడా చూస్తున్నారు. పటేల్ రమేశ్ రెడ్డి, బలరాం నాయక్.. వీళ్ళు లోక్ సభ ఎన్నికల రేసులో ఉంటారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్ ను, సియాసత్ న్యూస్ ఎడిటర్ ఆమెర్ అలీ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా విజయం సాధించలేదు. దాంతో ఎమ్మెల్సీలో ఒక్కటైనా మైనార్టీలకు ఇవ్వాలని అనుకున్నారు. షబ్బీర్ అలీ, అజారుద్దీన్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చాయి. కానీ ఎన్నికల్లో ఓడిన వారికి అవకాశం ఇవ్వవద్దన్నది కాంగ్రెస్ నిర్ణయం. అయితే ముస్లింలకు చెందిన వ్యక్తికి మంత్రిపదవి ఇవ్వాలి అనుకుంటే మాత్రం.. షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రిని చేస్తారన్న టాక్ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.