ఈ మాటలే ఇప్పుడు మంటలు రేపుతున్నాయ్. రేవంత్.. నువ్ మారవా అని ప్రత్యర్థి ప్రశ్నించేలా చేస్తున్నాయ్. రాజకీయంగా కేసీఆర్ (KCR) ను రేవంత్ తిట్టడం కొత్తేం కాదు. ఐతే ఇప్పుడు ఆయన సీఎం హోదాలో ఉన్నారు. అది మర్చిపోయి.. నోటికి వచ్చినట్లు మాట్లాడితే.. ఇష్టం వచ్చినట్లు బండ బూతులు తిడితే ఎలా సార్ అంటూ ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియాలో జనాలు. తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల పంపకం విషయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో కేసీఆర్ గురించి.. సీఎం రేవంత్ రెడ్డి ఘాటు కామెంట్లు చేశారు. రాజకీయాల్లో ఒకరిని ఒకరు తిట్టుకోవడం కామన్. కానీ ప్రభుత్వంలో ఉండి.. అదీ సీఎం హోదాలో ఉండి.. ఇలాంటి కామెంట్స్ చేయడం ఇప్పుడు రేవంత్‌ను టార్గెట్ అయ్యేలా చేస్తున్నాయ్. సీఎం కుర్చీలో కూర్చుని ఇలా మాట్లాడేది అంటూ ప్రతీ ఒక్కరూ రేవంత్‌ను క్వశ్చన్ చేస్తున్నారు.
రేవంత్ సీఎం (CM Revanth Reddy) అయినప్పటి నుంచీ బీఆర్ఎస్ (BRS) నేతలు చేస్తున్న విమర్శ ఒకటే. ఆ కుర్చీకి ఉన్న విలువను రేవంత్ దిగజారుస్తున్నారు అని! ఆయన మాట్లాడే విధానం సీఎంలా లేదని.. ఓ రౌడీ మాట్లాడినట్టు మాట్లాడుతున్నారంటూ.. కేటీఆర్(KTR), హరీష్‌రావు మాత్రమే కాదు సామాన్య బీఆర్ఎస్ నేత కూడా కామెంట్ చేస్తున్నాడు. ఇలాంటి సమయంలో మళ్లీ కావాలని మీడియా ముందు ఇలా రండ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం.. రేవంత్ మీద విమర్శలకు తావిచ్చినట్లు అవుతోంది. సీఎంగా ఉన్నప్పుడు ప్రొఫెషనల్‌గా బిహేవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఐతే రేవంత్ మాత్రం దిగజారి మాట్లాడుతున్నారని.. నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఆయన పొలిటికల్ పార్టీకి లీడర్‌గా ఎన్నైనా మాట్లాడొచ్చు.. ఎలా అయినా మాట్లాడొచ్చు.. ఐతే ఓ ముఖ్యమంత్రిగా మాటల్లో పొదుపు ఉండాలి.. మాట మీద అదుపు ఉండాలి అంటూ సోషల్ మీడియాలో రేవంత్‌కు సలహాలు ఇస్తున్నారు చాలామంది.
ముఖ్యమంత్రిగా ఎవరు మాట్లాడినా.. అది రాష్ట్ర జనం అందరి మాటగా.. ప్రొజెక్ట్ అవుతుంది. అందుకే సీఎంగా బాధ్యతలు మోస్తున్నప్పుడు.. చాలా కంట్రోల్డ్‌గా ఉండాలనే చర్చ జరుగుతోంది. గతంలో వైఎస్‌లాంటి వాళ్లే.. కోపం అనే నరం కట్ చేసుకున్నా అంటూ.. మీడియాతో, జనాలతో.. మీడియా ముందు, జనాల ముందు సరదాగా మాట్లాడేవారు. పొరపాటున ఓ మాట దొర్లినా.. బహిరంగంగా క్షమాపణ చెప్పేవారు. అలాంటిది ఇప్పుడు.. ఇలాంటి మాటలు జారడం కరెక్ట్ కాదు సార్ అంటూ.. రేవంత్ మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు జనాలు. కేసీఆర్‌ను ఇలా తిడతారా అన్నది కాదు ఇక్కడ మ్యాటర్.. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడాతారా అని మాత్రమే అంటూ.. చర్చ మొదలుపెట్టారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు తీసుకున్న తర్వాత.. సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. ఎవరు చేయించారు.. దాని వెనక ఎవరు ఉన్నారన్నది పక్కనపెడితే.. అలాంటి వాళ్లకు మరో ఆయుధంగా రేవంత్ మాటలు మారుతున్నాయనే చర్చ జరుగుతోంది.