హైడ్రాకు సవాలుగా మారిన త్రిష సిల్క్‌ ఏంటి వీళ్ల బ్యాగ్రౌండ్‌!

  • Written By:
  • Publish Date - August 26, 2024 / 12:40 PM IST

హైదరాబాద్‌లోని ఆక్రమణదారుల్లో హైడ్రా రైళ్లు పరిగెట్టిస్తోంది. నిర్మాణం అక్రమమని తెలిస్తే చాలా దయా దాక్షిన్యాలు లేకుండా కూల్చివేస్తోంది. ఊరు బయట చెరువులు, కుంటలు, కాలువల సంగతి సరే! నగరం నడిబొడ్డున నిర్మాణాల పరిస్థితి ఏంటి. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆ మాటకొస్తే దేశంలోనే ఖరీదైన రహదారుల్లో ఒకటైన జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో నాలాను ఆక్రమించి, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భారీ వ్యాపార సముదాయం జిహెచ్ఎంసికి, హైడ్రాకు సవాలుగా నిలుస్తోంది. గత కొన్నేళ్ళుగా జిహెచ్ఎంసి అధికారులను జో కొట్టిన త్రిష సిల్క్స్ భవనం ఆక్రమణదారుల ఆగడాలకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆ భవనాన్ని నిర్మించి ఏళ్ళు గడుస్తున్నా, అక్రమ నిర్మాణానికి సంబంధించి ఫిర్యాదులు అందుతున్నా ఇన్నాళ్లూ జిహెచ్ఎంసి, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు మొద్దు నిద్రపోతున్నారు. ప్రస్తుతం త్రిష సిల్క్స్ నడుస్తున్న ఆ అక్రమ వాణిజ్య భవనాన్ని రియల్టర్లు అంత సునాయాసంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఎలా నిర్మించగలిగారు? దానికి సహకరించిన అధికారులు ఎవరు ? గత కొన్నేళ్ళుగా ఫిర్యాదులు అందుతున్నా ఆ అక్రమ నిర్మాణం జోలికి జిహెచ్ఎంసి కానీ, ఇతర అధికారులు గానీ ఎందుకు వెళ్ళలేకపోయారు ? ఫిర్యాదులు అందిన తర్వాత అయినా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నాయి ? 50 అడుగుల నాలాను పది అడుగులకు కుదిరిస్తే కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వర్షపు నీరు, మురుగు నీరు ఆ పదడుగుల కాలువ గుండా సకాలంలో ఎలా కిందికి ప్రవహిస్తుంది ? అక్కడక్కడ విసిరేసినట్టు గృహాలు ఉండే కాలంలో 50 అడుగులు మేర ఉన్న మురుగు కాలువ ఇప్పుడు వేలాది అపార్ట్మెంట్లు, భారీ వాణిజ్య సముదాయాలు పుట్టగొడుగుల పుట్టుకొచ్చినప్పుడు ఎలా భరించగలుగుతుంది? మురుగునీరు, వరద నీరు వందరెట్లు పెరిగితే పది అడుగులకు కుచించుకుపోయిన ఆ కాలువ తట్టుకోగలుగుతుందా ? అటు ట్రాఫిక్, ఇటు పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా నిర్మించిన త్రిష సిల్క్స్ భవనాన్ని జిహెచ్ఎంసి అధికారులు కాని, హైడ్రా అధికారులు గానీ ఎందుకు కూల్చి వేయలేకపోతున్నారు ? మిశ్రాతో పాటు సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అనే బడా రియల్టర్ ఈ భవనంతో సంబంధాలు కలిగి ఉన్నందుకే అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడలేకపోతున్నారా ? పదంతస్తుల భారీ భవనాలతో పాటు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కుప్పకూల్చగలిన హైడ్రాకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో ధగధగ మెరిసిపోతున్న త్రిష సిల్క్స్ భవనం భవనాన్ని నేలమట్టం చేయడం ఎంతసేపు ? త్రిష శిల్క్స్ బిల్డింగ్ కూల్చివేతలను అడ్డుకునేందుకు ముందస్తుగానే దాని యజమానులు ప్రయత్నాలు ప్రారంభించారని తెలుస్తోంది. రాజకీయంగా ఒత్తిడి తెచ్చి కూల్చివేయకుండా కాపాడుకోవడానికి సిద్ధం అయ్యారు. నిబద్ధత కలిగిన అధికారిగా రంగనాథ్ ఇలాంటి ఒత్తిళ్లకు లొంగిపోతారా ? లేక బుల్డోజర్‌తో తొక్కించేస్తారా అనేది చూడాలి.