KAVITHA LIQUOR LINK : లిక్కర్ కేసుకి కవితకి లింకు ఏంటి? ఈడీ ఆధారాలతో ఎలా పట్టుకుంది?

ఢిల్లీ లిక్కర్ కేసులో అమిత్ ఆరోరాను అరెస్ట్ చేసింది సీబీఐ (CBI) . మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని విషయాన్ని గుర్తించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో మొదటిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించినట్లు సీబీఐ తేల్చింది.

 

 

 

రెండేళ్లకు పైగా కవిత చుట్టూ ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Case) తిరుగుతోంది. ఈ కేసులో ఈడీ మరో అడుగు ముందుకేసింది. కవితను అరెస్టు చేసి ఢిల్లీ తీసుకెళ్లింది. కవిత అరెస్ట్ కు కారణాలేంటి..? ఢిల్లీ లిక్కర్ కేసుకు కవితకు సంబంధం ఏంటి? తొలిసారిగా ఆమె పేరు ఎప్పుడు వినిపించింది?

ఢిల్లీ లిక్కర్ కేసులో అమిత్ ఆరోరాను అరెస్ట్ చేసింది సీబీఐ (CBI) . మద్యం పాలసీ రూపకల్పనలో ప్రైవేటు వ్యక్తులు ఉన్నారని విషయాన్ని గుర్తించింది. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో మొదటిసారిగా కవిత పేరును ప్రస్తావించింది సీబీఐ. ఆ తర్వాత ఈ కేసులోకి ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. వంద కోట్ల రూపాయల ముడుపులను సౌత్ గ్రూప్ చెల్లించినట్లు సీబీఐ తేల్చింది. సౌత్ గ్రూప్ ను నియంత్రించింది శరత్ రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట అని ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూప్ ద్వారా వంద కోట్లను విజయ్ నాయర్ కు చేర్చినట్టుగా ఈడీ తేల్చింది.

36 మంది రూ.1.38 కోట్ల విలువైన 170 మెుబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపింది ఈడీ. వీటిలో కవిత రెండు నెంబర్లు, పది మెుబైల్ ఫోన్ల్ వాటినట్టుగా పేర్కొంది. కవిత వాడిన పది ఫోన్లు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది. వంద కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చినట్టుగా ఈడీ తెలుసుకుంది. ఇదే విషయాన్ని అరోరా కూడా అంగీకరించారని తెలిపింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని పేర్కొంది. ఇందుకోసం.. ప్రత్యేకంగా ఫోన్స్ ఉపయోగించారనీ… వాటిని మార్చారని, ధ్వంసం చేశారని ప్రస్తావించింది ఈడీ . సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు చెల్లించిన వారిలో.. శరత్ రెడ్డితో పాటు కవిత పేరును ఈడీ అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సౌత్ గ్రూప్ లో కీలకంగా ఉన్నట్లు గుర్తించిన వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయిన్‌పల్లి, చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబును అదుపులోకి తీసుకుని విచారించింది ఈడీ. వీరి నుంచి కీలక సమాచారాన్ని రాబట్టింది.

ఈ కేసులో కవిత పాత్ర ఉన్నట్లు గుర్తించిన ఈడీ, సీబీఐ చాలాసార్లు నోటీసులను జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది. 2022 డిసెంబర్ లో హైదరాబాద్ లోని కవిత నివాసానికి వచ్చిన సీబీఐ అధికారులు ఆమెను దాదాపు 7 గంటలపాటు ప్రశ్నించారు. సౌత్ గ్రూప్ కంట్రోలర్ గా మీరు ఉన్నారా? ఫోన్లు మార్చారా? సౌత్ గ్రూప్ గురించి మీకు తెలుసా? అందులో మీ పాత్ర ఉందా? లాంటి అనేక ప్రశ్నలను సీబీఐ సంధించింది. ఆ తర్వాత ఈడీ నుంచి నోటీసులు వచ్చాయి. స్వయంగా ఢిల్లీలోని ఈడీ ఆఫీసులో విచారణకు కూడా హాజరయ్యారు కవిత. ఈ సమయంలోనే కవితను అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అరెస్ట్ కాలేదు.

ఇక ఈ కేసులోని నిందితులుగా ఉన్న కొందరు అప్రూవర్లుగా మారారు. దీంతో దర్యాప్తు సంస్థలకు కీలక సమాచారం అందింది. దీని ఆధారంగా దూకుడు పెంచే పనిలో పడ్డాయి సీబీఐ, ఈడీ. ఈ సమాచారం ఆధారంగానే కవితకు ఇటీవలే కూడా నోటీసులు పంపాయి. అంతేకాదు కేసులో సాక్షిగా ఉన్న కవితను నిందితురాలిగా కూడా పేర్కొంది సీబీఐ. 41 సీఆర్పీసీ కింద నోటీసులు కూడా ఇచ్చింది. కానీ సీబీఐ విచారణకు హాజరుకాలేదు కవిత.

మరోవైపు గతేడాదే ఈ కేసు విచారణకు సంబంధించి సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు కవిత. మహిళల విచారణలో సీఆర్పీసీ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఈ పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు తుది ఆదేశాలు వచ్చే వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. కొద్ది నెలలుగా వాదనలు కొనసాగుతున్నాయి. తాజాగా విచారించిన కోర్టు. కవిత పిటిషన్ పై ఈ నెల 19కి విచారణ వాయిదా పడింది. ఓవైపు విచారణ సాగుతుండగానే… కవితకు వారెంట్ ఇచ్చిన అధికారులు.. ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి అరెస్ట్ చేశారు.

2021 జనవరి 5న లిక్కర్‌ పాలసీ రూపకల్పనకు ఢిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంతో ఓ కమిటీ వేసింది. అదే ఏడాది మే 21 న ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదం తెలిపింది. జులై 20న కేంద్ర హోంశాఖకు వినయ్ కుమార్ సక్సేనా లేఖ రాశారు. ఆగస్టు 19న 15 మంది పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదైంది. 2022 ఆగస్టు 17 ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియాపై కేసు నమోదైంది. అదే ఏడాది సెప్టెంబర్‌ 21న సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేసింది. 2022 సెప్టెంబర్‌ 27న ఈ కేసులో ఆప్‌ కమ్యూనికేషన్‌ ఇన్‌చార్జి విజయ్‌నాయర్‌ను ఈడీ అరెస్టు చేసింది.ఈ స్కాంలో ఇదే మొదటి అరెస్టు. ఆ తర్వాత 28న ఇండో స్పిరిట్స్‌ యజమాని సమీర్‌ మహేంద్రు అరెస్ట్‌ అయ్యాడు. 2022 అక్టోబర్‌ 10న రాబిన్‌ డిస్టలరీస్‌ డైరెక్టర్‌ అభిషేక్‌ బోయినపల్లి అరెస్ట్ అయ్యాడు. నవంబర్‌లో పి. శరత్‌చంద్రారెడ్డి , బినోయ్‌బాబు, నవంబర్‌ 13న విజయ్‌ నాయర్‌ అరెస్ట్ అయ్యారు. 2022 నవంబర్‌ 26న ఈడీ తొలి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సమీర్‌ మహేంద్రు కంపెనీల్లో 291కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను ఇందులో ప్రస్తావించింది.
2022 నవంబర్‌ 29న అమిత్‌ అరోరాను ఈడీ అరెస్టు చేసింది. అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. అదే ఏడాది డిసెంబర్‌ 2న విచారణకు హాజరుకావాలని కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. డిసెంబర్‌ 3న ఎఫ్‌ఐఆర్‌ కాపీ కావాలని సీబీఐకి లేఖ రాసింది కవిత. డిసెంబర్‌ 11న కవితను ప్రశ్నించింది సీబీఐ. ఆ తర్వాత 2023 జనవరి 6న మొత్తం13 వేల 657 పేజీలతో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇందులో సౌత్‌గ్రూప్‌ నుంచి రూ. 100 కోట్ల ముడుపుల గురించి ప్రస్తావన వచ్చింది.

ఈ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో 17 మంది పేర్లను చేర్చింది. ఈ స్కామ్ వల్ల ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు రూ.2 వేల 873 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేసింది. 2023 ఫిబ్రవరి 2న సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రౌస్‌ అవెన్యూ కోర్టు నిందితులకు నోటీసులు జారీ చేసింది. 2023 ఫిబ్రవరి 8న గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఇదే రోజు గౌతమ్‌ మల్హోత్రాను ఈడీ అరెస్టు చేసింది. 2024 మార్చి 15న ఈడీ కవితను అరెస్టు చేసింది. మరోవైపు ఈడీ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే కేసు నమోదు నుంచి కవితను అరెస్ట్‌ చేసే వరకూ ఈడీ ఎక్కడా రూల్స్‌ బ్రేక్‌ చేయలేదు. ప్రతీ విషయంలోనూ నిబంధనలకు తగ్గట్టుగానే వ్యవహరించింది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో PMLA యాక్ట్, సెక్షన్ 19 కింద కవితను అరెస్ట్‌ చేశారు ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు. కేసులో విచారణలో భాగంగా చాలాసార్లు హాజరువ్వాలంటూ కవితకు సమన్లు ఇచ్చింది ఈడీ. ఆమె ఇంట్లో రెయిడ్‌ జరిపిన సమయంలోనూ అన్ని నిబంధనలు పాటించింది. రెయిడ్స్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ముందే ఇచ్చారు. అరెస్ట్ సంగతి ఫ్యామిలీకి వివరంగా చెప్పి… రూల్‌ ప్రకారమే అరెస్ట్‌ చేశారు.

ఇక అరెస్ట్ తర్వాత కోర్టులో హాజరుపరచడానికి 24 గంటలు సమయం ఉంటుంది. కవితకు ఉన్న ఈ హక్కును కూడా ఈడీ వివరంగానే చెప్పింది. బీఆర్ఎస్ నేతలు అంటున్నట్లు సుప్రీంకోర్టుకు అండర్‌టేకింగ్‌ ఇచ్చినా కూడా కవితను అరెస్టు చేస్తున్నారన్న వాదనలో నిజం లేదు. కవితను అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. ఈ విషయంలో ఎలాంటి మధ్యంతర ఆదేశాలు జారీ చేయలేదు. కనీసం నాట్‌ టు అరెస్ట్‌ అనలేదు. కేవలం విచారణ వాయిదా వేస్తున్నట్టు మాత్రమే తెలిపింది సుప్రీంకోర్టు. అంటే… న్యాయపరంగా కవిత అరెస్టుకు ఎలాంటి అడ్డంకులు లేవు. దీంతో రూల్స్ అనుసరించి కవితను అరెస్టు చేసింది ఈడీ. లిక్కర్‌ కేసులో మొదటి రోజు నుంచి ఈడీ ఏం చేసినా చట్ట ప్రకారమే చేసింది. తమ వ్యవహార శైలిపై ఎక్కడా విమర్శలు రాకుండా జాగ్రత్త పడింది. ప్రతి అంశంలో చట్ట ప్రకారమే నడుచుకున్నారు ఈడీ అధికారులు.