Diesel Vehicles: సమీప భవిష్యత్తులో డీజిల్ వాహనాలు రోడ్లపై తిరగకపోవచ్చు. ఎందుకంటే వీటిపై త్వరగా నిషేధం విధించాలని ప్రభుత్వ కమిటీ సూచించింది. కాలుష్య నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలపై కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ ఆధ్వర్యంలో ఎనర్జీ ట్రాన్సిషన్ అడ్వైజరీ కమిటీ (ఈటీఏసీ)ని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ ద గ్రీన్ షిఫ్ట్ పేరుతో ప్రభుత్వానికి ఇటీవల ఒక నివేదిక సమర్పించింది. 2027కల్లా దేశంలోని ప్రధాన నగరాల్లో అన్ని రకాల డీజిల్ వాహనాలను నిషేధించాలని సూచించింది. కమిటీ నివేదిక ప్రకారం.. పది లక్షలు, ఆపై జనాభా కలిగిన అన్ని నగరాల్లో 2027కల్లా డీజిల్ వాహనాల్ని పూర్తిగా నిషేధించాలి. ఇతర వాహనాలు వాడేలా ప్రోత్సహించాలి. వినియోగదారులు బయోఫ్యూయెల్, హైడ్రోజెన్, న్యూక్లియర్, జియోథర్మల్ ఎనర్జీని వాడేలా ప్రోత్సహించాలి. ప్యాసింజర్ కార్స్, ట్యాక్సీలు వంటివి కూడా ఎలక్ట్రిక్ వాహనాలవైపు మళ్లించాలి. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడేలా చూడాలి. రాబోయే 10-15 ఏళ్లలో సీఎన్‌జీ కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ మోడల్ వాహనాలు వాడేలా చూడాలి. టూ వీలర్స్, 3 వీలర్స్ కూడా ఎలక్ట్రిక్ వాహనాలే వాడేలా ప్రోత్సహించాలి. బ్యాటరీ స్వాపింగ్ అమలు చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
2035కల్లా పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలే ఉండాలనే లక్ష్యంతో పనిచేయాలి. నగరాల్లో కూడా సిటీ బస్సుల్ని ఎలక్ట్రిక్‌వే వాడాలి. ఇకపై డీజిల్ వాహనాలు కొనుగోలు చేయకూడదు. రాబోయే పదేళ్లలో పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలు వంటి క్లీన్ ఎనర్జీ వాహనాలనే నగరాల్లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కింద వినియోగించాలి. ప్రభుత్వాలు వీలైనన్ని ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలి. 2070 వరకల్లా దేశంలో వాహనాల నుంచి ఎలాంటి కర్బన ఉద్గారాలు విడుదల కాకూడదు. ఈ లక్ష్యానికి అనుగుణంగా ఉన్న అనేక ప్రతిపాదనల్ని ఈటీఏసీ ప్రభుత్వానికి సమర్పించింది. అయితే, ఈ ప్రతిపాదనల్ని ప్రభుత్వం ఎంతవరకు అమలు చేస్తుందో చూడాలి.