Common Stock Market Scams స్టాక్ మార్కెట్ మోసాలు

  • Written By:
  • Publish Date - February 7, 2023 / 07:04 AM IST

షేర్ కొనడం అంటే కంపెనీలో వాటాదారులం అవడమే… కంపెనీకి లాభాలొస్తే మనకు డివిడెండ్ వస్తుంది. షేరు విలువ పెరుగుతుంది. కంపెనీ పనితీరు బాగోలేకపోతే విలువ పడిపోతుంది. పెట్టుబడి ఆవిరైపోతుంది.

* కృత్రిమంగా కంపెనీల విలువను పెంచడం… ప్రారంభంలోనే కంపెనీల షేర్ ధరను ఎక్కువగా చూపించడం… ఎక్కువ వాల్యుయేషన్ చేయడం… పేటీఎం విషయంలో అదే జరిగింది… షేరు ధరను 2వేలకు పైగా చూపించారు. కానీ ఇప్పుడు ఆ షేరు ధర 550-600 మధ్య ఉంది. కంపెనీ విలువను అధికంగా లెక్కగట్టారు. ఫలితంగా షేరు ధర పెరిగింది. ఇష్యూలో షేర్లు కొన్నవారు మునిగిపోయారు. దాదాపు పావువంతు మాత్రమే ఇప్పుడు ధర ఉంది. ఇష్యూ ధరను ఏనాడు టచ్ చేయలేదు… అప్పట్లో రిలయన్స్ పవర్ కూడా అలాగే జరిగింది. ఓవర్ హైప్ ఇచ్చారు. సాధారణ మదుపరులు ఏం ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టారు. మునిగిపోయారు.

* వాస్తవ విలువకంటే అధిక ధర… కంపెనీల విలువ అమాంతం పెరగడం… అదానీ కంపెనీల షేర్లు ఇలాగే పెరిగాయి. చెట్టు పేరు చెప్పి కాయలమ్మినట్లు… కంపెనీకి సంబంధించిన ప్రతి వార్తా మార్కెట్ లో వైరల్ అవుతుంది. ఫలితంగా షేర్ల ధరలు పెరిగిపోతాయి. రెండేళ్ల క్రితం వందల్లో ఉన్న అదానీ ఎంటర్‌ ప్రైజెస్ ధర ఓ దశలో నాలుగు వేలు దాటింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత ఓ దశలో వేయి రూపాయలకు పడిపోయింది. హైవాల్యూలో షేర్లు కొన్న చిన్న మదుపరులు మునిగిపోతారు.

* షేర్ల తాకట్టు… కంపెనీల విలువ అధికంగా ఉన్నప్పుడు కంపెనీలు ఆ షేర్లను తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటాయి. అదాని విషయంలోనూ అదే జరిగింది. ఒకవేళ విలువ పడిపోతే తాకట్టు పెట్టుకున్న కంపెనీలు మునిగిపోతాయి.

* ఇన్‌సైడ్ ట్రేడింగ్… కంపెనీలు ముందుగానే దానికి సంబంధించిన వివరాలు తమకు కావాల్సిన వారికి అందిస్తాయి. వారితో షేర్లు కొనిపించడం లేదా అమ్మించడం లాంటివి చేస్తాయి…. షేర్ల విలువను పెంచడానికి మార్కెట్‌ లో కృత్రిమ డిమాండ్ సృష్టిస్తాయి. అవసరమైతే తామే కొంటాయి. విలువ పెరగ్గానే అమ్మేస్తాయి. దీనిపై సెబీ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నా కొన్ని సంస్థలు మాత్రం రకరకాల మోసాలకు పాల్పడుతుంటాయి.

* కంపెనీ ఆర్థిక వ్యవహారాలను మార్చి చూపించడం… లాభాలు లేకున్నా ఉన్నాయని నమ్మించడం… ఫలితంగా కంపెనీ షేరు పెరుగుతుంది. వ్యవహారం బయటకు వచ్చేసరికే ప్రమోటర్లు బయటపడతారు. కానీ ఇన్వెస్టర్లు మునిగిపోతారు. సత్యం విషయంలో ఇదే జరిగింది. ఏళ్ల పాటు లాభాలను ఎక్కువ చేసి చూపించారు. విషయం బయటపడేసరికి కోలుకోలేని నష్టం జరిగిపోయింది.

* కొన్ని కంపెనీలు ఇన్వెస్టర్ల తరపున షేర్ల లావాదేవీలు నిర్వహిస్తాయి. ఇన్వెస్టర్ల ఖాతాలను మేనేజ్ చేస్తాయి. అయితే అవి వారికి తెలియకుండా ఆ ఈక్విటీలను దారి మళ్లిస్తుంటాయి. తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటుంటాయి. వాటితో వ్యాపారాలు చేస్తుంటాయి. లాభం వస్తే ఓకే లేకపోతే మాత్రం మునిగిపోవడమే… కార్వి విషయంలో అదే జరిగింది.

* కొన్నిచోట్ల ప్రమోటర్లు షెల్ కంపెనీలను సృష్టించి వాటికి నిధులు మళ్లిస్తుంటారు. మాతృసంస్థను ముంచేస్తుంటారు.

సాధారణ మదుపరికి ఇవేమీ తెలియదు… కంపెనీ గురించిన పూర్తి అవగాహన ఉండదు. ఎవరో చెప్పిందో లేక మార్కెట్ లో ఉన్న ప్రచారాన్ని చూసో నమ్ముతారు. దాంతో మునిగిపోతారు. సరైన అవహాహన లేకుండా పెట్టుబడులు పెడితే మర్కెట్ లో మునిగిపోవడమే… ఇలా నష్టపోయి ప్రాణాలు తీసుకున్న వారెందరో…

ఈ మధ్య ఇంకో రకం స్కామ్‌లు వెలుగులోకి వస్తున్నాయి… మీకు మార్కెట్ టిప్స్ ఇస్తాం… నెలకింత కట్టండి అంటూ వెంటబడుతున్నారు. వేలల్లోను కుదిరితే లక్షల్లోనూ వసూళ్లు చేస్తున్నారు. వీటి నుంచి భారీ లాభాలు ఆశించడం అత్యాశే… పైగా ఇవి డెరివేటివ్స్ లో పెట్టుబడులు పెట్టిస్తాయి. ఇందులో వొలటాలిటీ ఎక్కువ. సెకన్ల వ్యవధిలోనే మన పెట్టుబడి మాయమైపోతుంది. 50వేల పెట్టుబడి సెకన్లలోనే 20వేలకు పడిపోవచ్చు… సున్నాకు కూడా చేరొచ్చు.. లేదా లక్ష కూడా కావొచ్చు… కానీ మోసపోవడానికే అవకాశం ఎక్కువ. ఇలాంటి వాటి విషయంలోనూ జాగ్రత్తలు ఉండాల్సిందే.