Biporjoy Cyclone: అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్ తీవ్ర తుపానుగా మారింది. గుజరాత్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ నెల 15, గురువారం మధ్యాహ్నం గుజరాత్, కచ్ జిల్లా, జఖౌ వద్ద తీరాన్ని తాకుతుంది. బిపర్‌జాయ్ భారీ విధ్వంసం సృష్టించే అవకాశం ఉండటంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. దాదాపు పది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అరేబియా సముద్ర తీర ప్రాంతాలైన కచ్, పోరుబందర్, జునాగఢ్, మోర్బి, ద్వారక, జామ్ నగర్ నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు
వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బిపర్‌జాయ్ తుపాను కారణంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. 15, 16 తేదీల్లో సౌరాష్ట్ర-కచ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలోని ప్రజలకు తాత్కాలిక ఆశ్రయం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. తుపాను నేపథ్యంలో మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. పోర్టుల్లో ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తుపాన్ బాధిత ప్రజల్ని రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర సహాయక బృందాలు చర్యలు ప్రారంభించాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉండి, సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు.
ముంబైపై తీవ్ర ప్రభావం
బిపర్‌జాయ్ తుపాను ప్రభావం ముంబైపై కూడా పడింది. అధికారులు హెచ్చరికలను పట్టించుకోకుండా సముద్రంలోకి వెళ్లిన ఆరుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను అధికారులు గుర్తించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. సముద్రంలోకి ఎవరూ వెళ్లొద్దని, బీచ్‌కు కూడా రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. గుజరాత్‌లో కూడా తుపాను కారణంగా ముగ్గురు మరణించారు. ఇప్పటికే తుపాను కారణంగా బలమైన గాలులు వీస్తున్నాయి. వీటివల్ల అనేక చెట్లు నేలకూలాయి. ప్రస్తుతం బిపర్‌జాయ్ తుపాను పోరుబందర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. గురువారం మధ్యాహ్నం లేదా సాయంత్రం తీరం దాటే అవకాశం ఉంది.
రైళ్ల రద్దు.. విమానాల రాకపోకలకు అంతరాయం
బిపర్‌జాయ్ తుపాను ప్రభావంతో పశ్చిమ రైల్వే పరిధిలోని వందకుపైగా రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అధికారులు ఇప్పటివరకు 67 రైళ్లను రద్దు చేశారు. మరో 56 రైళ్ల రూట్ మార్చారు. ముంబైలో విమాన ప్రయాణాలకు కూడా ఆటంకం కలుగుతోంది. ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. షిప్పింగ్ కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. ముంబైలోనూ వర్షం కురిసే అవకాశం ఉంది. మరోవైపు ఈ పరిస్థితిపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా సమీక్ష జరిపారు. తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.