Cyclone Biparjoy: దేశంలో వర్షాలకు ఆధారమైన నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది. దీంతో వర్షాలు మరింత ఆలస్యంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా రుతు పవనాలు ఆలస్యమవుతున్నాయి. ఆగ్నేయ అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్ తుపాను మరింత తీవ్ర తుపానుగా మారింది. ఈ కారణంగా రుతు పవనాల రాక ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా.
ఇప్పటికే రుతు పవనాలు దేశాన్ని తాకి ఉండాలి. గత ఏడాది జూన్ 1నే రుతు పవనాలు వచ్చాయి. ఇప్పుడు జూన్ ప్రారంభమై వారం అవుతున్నా.. ఇంకా వీటి జాడ లేదు. ఇప్పటికి కనీసం శ్రీలంకను కూడా తాకలేదు. బిపర్‌జాయ్ తుపాను కారణంగా రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరో రెండు, మూడు రోజులు పట్టొచ్చు. నిజానికి వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతు పనవాలు ఆలస్యంగానే వస్తాయని గతంలోనే వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని ప్రకారం.. ఈ నెల 4 నాటికి కేరళ తీరాన్ని తాకొచ్చని అంచనా వేసింది. అయితే, ఏడో తేదీ వచ్చినా ఇంకా ఈ జాడ కనిపించడం లేదు. ప్రస్తుతం బిపర్‌జాయ్ తుపాను వల్ల రుతు పవనాల కదలికలు నెమ్మదిగా సాగుతున్నాయి. దీంతో ఆలస్యంగా రుతు పవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి.
ఫలితంగా వర్షాలు కూడా ఆలస్యంగానే మొదలవుతాయి. ఈ కారణంగా దేశంలో సగటున ఐదు శాతం వరకు వర్షపాతం తగ్గొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు బిపర్‌జాయ్ తుపాను మరింత వేగంగా బలపడుతోంది. అయితే, దీని కారణంగా అరేబియా తీర ప్రాంతాలకు ఎలాంటి ముప్పూ లేదని వాతావరణ శాఖ తెలిపింది. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. చేపల వేటకు, సముద్రంలోకి ఎవరూ వెళ్లొద్దని హెచ్చరించారు.