Delhi Police: ప్రధాని మోదీపై పాకిస్తాన్ యువతి చేసిన అతికి ఢిల్లీ పోలీసులు ధీటైన జవాబిచ్చారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో హింస, సంక్షోభం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అసలే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్‌లో ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రభుత్వం అరెస్టు చేయడంతో దేశవ్యాప్తంగా ఆందోళన, హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. అయితే, ఈ ఘటనలకు ఇండియా, మోదీనే కారణమంటూ పాక్ యువతి ఒక ట్వీట్ చేసింది.
సెహర్ షిన్వారి అనే యువతి తన ట్విట్టర్‌లో ”ఢిల్లీ పోలీసుల ఆన్‌లైన్ లింక్ ఎవరికైనా తెలుసా? భారత ప్రధాని మోదీ, భారత ఇంటెలిజెన్స్ సంస్థ ‘రా’పై ఫిర్యాదు చేయాలి. వాళ్లు మా దేశంలో తీవ్రవాదాన్ని, ఆందోళనల్ని ప్రోత్సహిస్తున్నారు. భారత దేశంలోని కోర్టులు తాము స్వేచ్ఛగా పని చేస్తున్నామని చెప్పుకొనేది నిజమే అయితే.. సుప్రీం కోర్టు ద్వారా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. దీనికి ఢిల్లీ పోలీసులు సరైన జవాబిచ్చారు. ‘మాకు ఇంకా పాకిస్తాన్‌లో బాధ్యతలు చేపట్టే అవకాశం లేనందుకు విచారిస్తున్నాం. కానీ, మీ దేశంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయినప్పటికీ మీరు ఎలా ట్వీట్ చేశారో మాత్రం తెలుసుకోవాలి అనుకుంటున్నాం’ అంటూ ఢిల్లీ పోలీసులు బదులిచ్చారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఆమెకు సరైన జవాబిచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సెహర్ ట్వీట్ చేసిన దాంట్లో కొంచెమైనా నిజం లేదని, ట్వీట్ చేసే ముందు కొంచెం తెలివి పెంచుకోమని ఆమెకు ఇండియన్స్ రిప్లై ఇస్తున్నారు.
ఎందుకంటే పాకిస్తాన్ తీవ్రవాదానికి పుట్టినిల్లులాంటిది. అనేక అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు అక్కడి నుంచే పనిచేస్తుంటాయి. ఇక పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం అనేదే కనిపించదు. ఎప్పుడూ ఏదో ఒక సంక్షోభం దేశాన్ని వెంటాడుతూనే ఉంటుంది. రాజకీయాలు స్థిరంగా ఉండవు. ప్రస్తుతం దేశంలో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. దీంతో హింస చెలరేగుతోంది. ఒక పక్క ప్రజలు ఆహారం, ఉపాధి, ఆదాయం లేక అల్లాడుతుంటే ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన పాలకులు రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారు. దీనంతటికి అక్కడి నేతలే కారణం.. కానీ, సెహర్ మాత్రం భారత ప్రధాని మోదీ, రా సంస్థ కారణం అంటూ ట్వీట్ చేయడం మనవాళ్లకు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఇండియన్స్ ఆమెకు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు.