CyberAttack: నేటి ఇంటర్నెట్ యుగంలో రెండు దేశాలు యుద్ధం చేసేందుకు ఆయుధాలే అవసరం లేదు. సైబర్ స్పేస్ చాలు. ఒక దేశపు నెట్‌వర్క్, వెబ్‌సైట్స్‌పై మరో దేశానికి చెందిన సైబర్ నిపుణులు దాడి చేస్తారు. వెబ్‌సైట్స్ హ్యాక్ అయ్యేలా చేస్తారు. దీంతో అవి స్తంభించిపోతాయి. ఇలా అనేక దేశాలు ఇప్పుడు సైబర్ స్పేస్‌లో సైబర్ వార్‌కు దిగుతున్నాయి. తాజాగా ఇండియా-పాకిస్తాన్ మధ్య ఈసారి సైబర్ వార్ జరుగుతోంది. గతంలో కూడా రెండు దేశాలకు చెందిన నిపుణులు ఇలా సైబర్ వార్‌కు పాల్పడ్డారు. ఈసారి పాకిస్తాన్ ఆట మొదలెట్టింది. మనవాళ్లు ధీటుగా బదులిస్తున్నారు.
ఈసారి డీడీఓఎస్ (డిస్ట్రిబ్యూటెడ్ డినెయిల్ ఆఫ్ సర్వీస్ (DDoS)) అటాక్‌కు పాల్పడ్డారు. టీమ్ ఇన్సేన్ పీకే అనే పాకిస్తాన్ సైబర్ నిపుణుల బృందం (హ్యాక్టివిస్ట్‌లు) ఇండియన్ సైట్లపై దాడి చేశారు. ఇండియాలోని 23 పోలీస్ వెబ్‌సైట్లపై టీమ్ ఇన్సేన్ పీకే గ్రూప్ దాడి చేసింది. మన పోలీస్ సైట్లు హ్యాకయ్యేలా చేసింది. దీంతో ఇండియన్ సైబర్ నిపుణులు కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. కేరళ సైబర్ ఎక్స్‌ట్రాక్టర్స్ పేరుతో ఉన్న మన సైబర్ నిపుణులు పాకిస్తాన్ సైట్లపై దాడి మొదలెట్టారు. మొత్తం పది దేశాల్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయాలకు చెందిన వెబ్‌సైట్లపై దాడి చేసి, వాటిని స్తంభింపజేశారు. ఇండియాలోని పాక్ వెబ్‌సైట్‌తోపాటు ఫ్రాన్స్, జర్మనీ, కజకిస్తాన్ వంటి దేశాల్లోని పాక్ సైట్లపై దాడి చేశారు. ఈ దాడ కారణంగా ఆయా దేశాల్లో ఎంబసీకి చెందిన కార్యకలాపాలు నిలిచిపోయాయి. డీడీఓఎస్.. ఈ విధానంలో ఒక సర్వీస్, నెట్‌వర్క్ లేదా వెబ్ సైట్ వంటివి స్తంభించేలా చేస్తారు.
సైట్లపై ఒకేసారి ట్రాఫిక్ పెరిగేలా చేసి, చివరకు సర్వర్ క్రాష్ అయ్యేలా చూస్తారు. ఈ ట్రాఫిక్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దీంతో సైట్ పని చేయదు. ప్రస్తుతం ఇండియా, పాక్ సైబర్ నిపుణుల మధ్య ఈ పోటీ సాగుతుంది. ఇది ఆన్‌లైన్ హ్యాండ్ రెజ్లింగ్ గేమ్ లాంటిదని సైబర్ నిపుణులు అంటున్నారు. వీటిలో ఎవరు గెలుస్తారు అనే విషయం పక్కనపెడితే సామాన్య వినియోగదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతారు. ప్రభుత్వ సంస్థలపైనే ఎక్కువగా ఇలాంటి హ్యాకర్లు దాడి చేస్తుంటారు. దీంతో ప్రజలకు అనేక సర్వీసులు నిలిచిపోతాయి. కొంతకాలంగా పాక్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, సూడాన్, ఇండోనేసియా వంటి దేశాలకు చెందిన ఇస్లామిక్ హ్యాక్టివిస్టులు ఇండియన్ సైట్లపై దాడికి పాల్పడుతున్నారు. దీంతో మన దేశంలోని హ్యాక్టివిస్టులు కూడా ప్రతి దాడులకు దిగుతున్నారు. ఇండియా నుంచి కేరళ సైబర్ ఎక్స్‌ట్రాక్టర్స్, ఇండియన్ సైబర్ ఫోర్స్, టీమ్ ఎన్‌డబ్ల్యూహెచ్ సెక్యూరిటీ వంటి సైబర్ గ్రూప్స్ దీటుగా స్పందిస్తున్నాయి.