BrahMos Missile: భారత అమ్ములపొదిలో బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్.. పరీక్ష విజయవంతం

ఇది క్షిపణి విధ్వంసక మిస్సైల్. శతృవులు మన దేశంపైకి ప్రయోగించే క్షిపణుల్ని గాలిలోనే ధ్వంసం చేయగలదు. నిర్దిష్ట లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా చేధించిందని నావికాదళం ప్రయోగించింది. అయితే, ఎక్కడి నుంచి ప్రయోగించిందో మాత్రం వెల్లడించలేదు.

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 07:19 PM IST

BrahMos Missile: భారత రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది. ఐఎన్ఎస్ మోర్ముగావ్ నౌక నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్ష విజయవంతమైంది. ఇది క్షిపణి విధ్వంసక మిస్సైల్. శతృవులు మన దేశంపైకి ప్రయోగించే క్షిపణుల్ని గాలిలోనే ధ్వంసం చేయగలదు. నిర్దిష్ట లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా చేధించిందని నావికాదళం ప్రయోగించింది. అయితే, ఎక్కడి నుంచి ప్రయోగించిందో మాత్రం వెల్లడించలేదు.

భారత్-రష్యా సంయుక్తంగా ఏర్పాటు చేసిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఈ క్షిపణుల్ని పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారు చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి వీటిని రూపొందించారు. ఐఎన్ఎస్ మోర్ముగావ్ నౌకను కూడా దేశీయంగానే తయారు చేశారు. దీన్ని ఇండియన్ నేవీలోని వార్‌షిప్ డిజైన్ బ్యూరోలో డిజైన్ చేయించి, మజగావ్ డాక్ షిప్‌లో తయారు చేయించారు. గోవాలోని మోర్ముగావ్ నౌకాశ్రయం అనే పేరును దీనికి పెట్టారు. దేశీయంగా రూపొందిన ఈ నౌక నుంచి దేశీయంగా తయారు చేసిన బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించినట్లు భారత నావికా దళం ప్రకటించింది. ఈ క్షిపణులు నావికా దళానికి అదనపు శక్తిని అందిస్తాయని అధికారులు తెలిపారు. ఈ క్షిపణుల్ని సబ్ మెరైన్లు, నౌకలు, విమానాల నుంచే కాకుండా నేల మీద నుంచి కూడా ప్రయోగించే వీలుంది.

ఈ క్షిపణులు శబ్ద వేగానికంటే మూడు రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తాయి. ఈ క్షిపణుల తయారీలో ఇండియా-రష్యాల భాగస్వామ్యం ఉంది. అందుకే ఇండియాలోని బ్రహ్మపుత్ర నది పేరులోని బ్రహ్మ అనే పదాన్ని, రష్యాలోని మోస్క్వా అనే నది పేరులోని మోస్క్వా అనే పదాన్ని కలిపి వీటికి బ్రహ్మోస్ అనే పేరు పెట్టారు. ఐఎన్ఎస్ మోర్ముగావ్ డిస్ట్రాయర్ నౌక. వీటి ద్వారా క్షిపణుల్ని ధ్వంసం చేయవచ్చు. ఈ నౌక ద్వారా జలాంతర్గాములపై కూడా దాడి చేయవచ్చు. దీనిలో అత్యాధునిక రాడార్లు ఉంటాయి. శతృ దేశాల నౌకలు, విమానాలు, జలాంతర్గాములను గుర్తించగలదు. గతేడాది డిసెంబర్ 18న ఇలాంటి రెండు నౌకలను జల ప్రవేశం చేయించారు. అందులో ఇది రెండో నౌక.