King Charles Coronation: నేడే కింగ్‌ చార్లెస్‌-3 పట్టాభిషేకం.. బ్రిటన్‌ పీఠంపై తొలిసారి రాజు!

లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజ కుటుంబీకులు, విదేశీ ప్రతినిధుల సమక్షంలో కింగ్‌ చార్లెస్‌-3కి రాజుగా పట్టాభిషేకం జరగనుంది. ఈ వేడుకల్లో ఛార్లెస్‌తో పాటు ఆయన భార్య రాణి కెమిల్లాకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేస్తారు.

  • Written By:
  • Publish Date - May 6, 2023 / 12:41 PM IST

King Charles Coronation: బ్రిటన్‌ కింగ్‌ చార్లెస్‌-3 పట్టాభిషేకానికి అంతా రెడీ అయ్యింది. లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ అబేలో 2 వేల మందికి పైగా అతిథులు, రాజ కుటుంబీకులు, విదేశీ ప్రతినిధుల సమక్షంలో కింగ్‌ చార్లెస్‌-3కి రాజుగా పట్టాభిషేకం జరగనుంది. ఈ వేడుకల్లో ఛార్లెస్‌తో పాటు ఆయన భార్య రాణి కెమిల్లాకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేస్తారు. ఇందుకోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు లండన్‌కు చేరుకుంటున్నారు.

భారతదేశం తరఫున ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ ధన్‌ఖడ్‌ లండన్‌కు చేరుకున్నారు. సుమారు 100 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇండియా నుంచి కూడా పలువురు ప్రతినిధులు ఈ వేడుకకు హజరు కానున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్‌, సినీ నటి సోనమ్ కపూర్‌, పుణెకు చెందిన ఫేమస్‌ అర్కిటెక్ట్‌ పౌరభ్‌ పడ్కే, ప్రిన్స్‌ ట్రస్ట్‌ గ్లోబల్‌ అవార్డ్‌ అందుకున్న గుల్ఫ్‌ షా, ‘ప్రిన్స్ ట్రస్ట్ కెనడా’ అందించే కెనడాస్ యూత్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రాం పూర్తి చేసిన జై పటేల్‌, ముంబైలో ఫేమస్‌ డబ్బా వాలాల తరుఫున వాళ్ల ప్రతినిధి ఈ వేడుకకు హాజరు కానున్నారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత బ్రిటన్‌లో జరుగుతున్న తొలి పట్టాభిషేకంగా ఇది రికార్డుకెక్కబోతోంది. ఇప్పటివరకు బ్రిటన్‌ను రాణులు పాలించగా.. తొలిసారిగా ఒక రాజు నాయకత్వం వహించబోతున్నారు.

ఈ కార్యక్రమానికి 203 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు 12 వేల మంది పోలీసులు, 10 వేల మంది సైనికులను మోహరించారు. ఈ వేడుకను బ్రిటిష్‌ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రతీసారి ఈ కార్యక్రమంలో బ్రిటన్‌ ప్రధానితో పాటు అధికారులు బైబిల్‌ చదువుతారు. ఇది ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం. ఇప్పుడు ప్రధానిగా ఉన్న రిషి సునక్‌ కూడా బైబిల్‌లో ఎంపిక చేసిన కొన్ని వ్యాఖ్యాలను చదివి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. భారతీయ మూలాలున్న రిషి సునక్‌ హిందూ మతస్థుడు. కానీ బ్రిటన్‌ పాటిస్తున్న రూల్స్‌ కారణంగా ఈ వేడుకలో ఆయన బైబిల్‌ చదవబోతుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వందల ఏళ్లు గడిచినా ఇంకా పట్టాభిషేకంలో ఇదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది బ్రిటన్‌ రాజ కుటుంబం.