Miss World 2023:‎ ఇండియాలో ప్రపంచ సుందరి పోటీలు.. వచ్చే నవంబర్‌లోనే.. 27 ఏళ్ల తర్వాత నిర్వహణ!

27 సంవత్సరాల తర్వాత ఇండియాలో ప్రపంచ సుందరి పోటీలు జరగబోతున్నాయి. మన దేశంలో చివరగా 1996లో ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ పోటీలకు భారత్ వేదిక కానుండటం విశేషం.

  • Written By:
  • Publish Date - June 9, 2023 / 01:49 PM IST

Miss World 2023: ఈ ఏడాది జరగబోతున్న ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. 27 సంవత్సరాల తర్వాత ఇండియాలో ప్రపంచ సుందరి పోటీలు జరగబోతున్నాయి. మన దేశంలో చివరగా 1996లో ప్రపంచ సుందరి పోటీలు జరిగాయి. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ పోటీలకు భారత్ వేదిక కానుండటం విశేషం. వచ్చే నవంబర్‌లో 71వ ప్రపంచ సుందరి-2023 పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్ని ఇండియాలో నిర్వహించాలని నిర్ణయించినట్లు, దీనికి ఎంతో సంతోషిస్తున్నట్లు మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్ ఛైర్‌పర్సన్, సీఈవో జులియా మోర్లే తెలిపారు.

ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశలో ఈ వివరాల్ని ఆయన వెల్లడించారు. మోర్లే చెప్పిన వివరాల ప్రకారం.. వచ్చే నవంబర్‌లో నెల రోజులపాటు ఈ పోటీలు ఇండియాలో జరుగుతాయి. పోటీ జరిగే తేదీల వివరాలు ఇంకా ఖరారు కాలేదు. 130 దేశాల తరఫున పోటీదారులు ఇందులో పాల్గొంటారు. దీనిలో భాగంగా అనేక పోటీలు, క్రీడలు, సోషల్ సర్వీస్ వంటి ఈవెంట్స్ జరుగుతాయి. ఈ సమావేశంలో మిస్ వరల్డ్ 2022 విజేత కరోలినా బియెలావ్‌స్కా (పోలండ్‌) కూడా పాల్గొన్నారు. అద్భుత దేశమైన ఇండియాలో తన కిరీటాన్ని మరొకరికి బహూకరించబోతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. దీనికోసం ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తాను ఇండియా రావడం ఇది రెండోసారి అని చెప్పారు. ఇండియా తరఫున మిస్ వరల్డ్ 2023లో పోటీ చేయబోతున్న మిస్ ఇండియా వరల్డ్ సైనీ శెట్టి కూడా సమావేశంలో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో సంతోషంగా ఉందన్నారు.
1951 నుంచి ప్రారంభం
మిస్ వరల్డ్ పోటీలు తొలిసారిగా 1951లో అమెరికాలో ప్రారంభమయ్యాయి. 70 ఏళ్లకుపైగా ఈ పోటీలు జరుగుతున్నాయి. వీటిని ఎరిక్ మోర్లీ మొదలుపెట్టాడు. 2000లో ఆయన మరణించారు. అప్పటివరకు ఈ సంస్థకు ఆయనే ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన తర్వాత మోర్లే సతీమణి జూలియా మోర్లే ఈ సంస్థ ఛైర్‌పర్సన్, సీఈవోగా కొనసాగుతున్నారు. ఇండియా ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుండటం ఇది రెండోసారి.
ఇండియా తరఫున విజేతలు వీళ్లే..
ఇండియా తరఫున ఇప్పటివరకు ఆరుగురు మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్నారు. రీటా ఫరియా (1966), ఐశ్వర్యా రాయ్ (1994), డయానా హెడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంకా చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) ఇండియా తరఫున మిస్ వరల్డ్‌గా ఎంపికయ్యారు.