Mysterious Sounds: భూమి నుంచి భారీ శబ్దాలు.. వణికిపోతున్న గ్రామం.. అసలు రహస్యం ఏంటి?

కేరళలోని ఒక గ్రామ పరిధిలో వింత సంఘటన చోటు చేసుకుంది. కేరళ, కొట్టాయం జిల్లా, చెన్నపాడి అనే చిన్న గ్రామంలో కొద్ది రోజులుగా భూమి నుంచి భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. వరుసగా ఇలాంటి వింత శబ్దాలు వినిపిస్తుండటంతో గ్రామ ప్రజల్లో భయాందోళన మొదలైంది.

  • Written By:
  • Publish Date - June 2, 2023 / 04:30 PM IST

Mysterious Sounds: భూమిపై అప్పుడప్పుడూ అసాధారణ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వాటిని శాస్త్రవేత్తలు పరిశీలించి నిగ్గు తేలుస్తుంటారు. తాజాగా కేరళలోని ఒక గ్రామ పరిధిలో వింత సంఘటన చోటు చేసుకుంది. కేరళ, కొట్టాయం జిల్లా, చెన్నపాడి అనే చిన్న గ్రామంలో కొద్ది రోజులుగా భూమి నుంచి భారీ శబ్దాలు వినిపిస్తున్నాయి. వరుసగా ఇలాంటి వింత శబ్దాలు వినిపిస్తుండటంతో గ్రామ ప్రజల్లో భయాందోళన మొదలైంది.

రోజుల తరబడి ఇదే పరిస్థితి ఉండటంతో విషయాన్ని అధికారులకు చేరవేశారు. దీంతో స్పందించిన అధికారులు ఈ శబ్దాల సంగతేంటో తేల్చడానికి నిపుణులను రంగంలోకి దించారు. చెన్నపాడి గ్రామంలో, చుట్టు పక్కల ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుఝామున రెండుసార్లు చెవులు పగిలిపోయేలా భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో స్థానికులు బెంబేలెత్తిపోయారు. ఈ వారం మొదట్లో కూడా చెన్నపాడితోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి వింత శబ్దాలు వినిపించాయి. వారం రోజుల నుంచి శబ్దాలు వినిపిస్తుండటంతో స్థానికులు భయపడుతున్నారు. అయితే, భారీ శబ్దాలు వినపడటం మినహా ఇతరత్రా ఎలాంటి మార్పులు కనిపించడం లేదు. ఇంకేరకమైన ప్రభావం స్థానికుల మీద లేదు.

వాతావరణంలో ఏ మార్పులు లేవు. అయినప్పటికీ శబ్దాలు స్థానికుల్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీంతో అధికారులు స్పందించారు. కేరళకు చెందిన భూగర్భ, గనుల శాఖ అధికారులు ఇక్కడికొచ్చి పరిశోధనలు జరిపి వెళ్లారు. అప్పట్లో శబ్దాలకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవని అధికారులు తెలిపారు. ఇప్పుడు మళ్లీ శబ్దాలు వినిపిస్తున్నట్లు చెప్పడంతో మరో బృందం, ఇక్కడికి రానుందని అధికారులు తెలిపారు. సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్‌కు సంబంధించిన నిపుణుల బృందం ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తుందని అధికారులు చెప్పారు. ఈ బృందం పరిశీలన తర్వాత దీనికి సంబంధించిన అసలు విషయాలు తెలుస్తాయని అంటున్నారు. శబ్దాలు ఎక్కడి నుంచి, ఎందుకు వస్తున్నాయో తెలుస్తుందన్నారు.

గతంలో అనేక చోట్ల ఇలాంటి వింత శబ్దాలు వినిపించాయి. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా పరిధిలోని కొన్ని గ్రామాల్లో భూ గర్భం నుంచి ఇలాంటి వింత శబ్దాలే వినిపించాయి. అప్పట్లో నిపుణుల బృందం దీనిపై అధ్యయనం చేసినప్పటికీ ఏ విషయమూ తేల్చలేకపోయారు. ఆ శబ్దాలు ఎందుకొచ్చాయో కనుక్కోలేకపోయారు. అయితే, ఈ శబ్దాల విషయంలో ఆందోళన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.