Canada Wildfires: పొరుగు దేశమైన కెనడాలో మొదలైన దావానలం ప్రభావం అమెరికాపై పడింది. ఇప్పటికే న్యూయార్క్ నగరాన్ని కమ్మేసిన పొగ.. ఇప్పుడు వాషింగ్టన్‌ను కూడా ముంచేసింది. దీంతో న్యూయార్క్‌తోపాటు వాషింగ్టన్‌లోనూ జనజీవనం స్తంభించింది. అట్లాంటిక్ తీర ప్రాంతంలోనూ పొగ ప్రభావం ఉంది. గురువారం వాషింగ్టన్‌లో పొగ ప్రభావం ఎక్కువగా కనిపించింది. రోడ్లపై ట్రాఫిక్ చాలా తక్కువగా కనిపించింది. పొగ ప్రభావం వల్ల ఉద్యోగులు ఇంటి నుంచి బయటకు రాకుండా వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశించింది. చాలా వరకు ప్రభుత్వ సేవల్ని కూడా నిలిపివేశారు. అత్యవసర సేవలు మినహా ఇతర ప్రభుత్వ, మున్సిపల్ సర్వీసులు నిలిచిపోయాయి. పార్కులు, రిక్రియేషన్ సెంటర్లు మూసేశారు. రోడ్డు నిర్మాణ పనులు, వ్యర్థాల నిర్వహణ వంటి వాటిని నిలిపేశారు. ఈశాన్య అమెరికాలో ఈ స్థాయిలో పొగ మంచు కమ్మడం ఇరవై ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు. ఒహియో, మిచిగాన్, ఇండియానా, సౌత్ కరోలినా వంటి రాష్ట్రాల్లో ఎయిర్ క్వాలిటీని అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
అధ్యక్షుడు బైడెన్ నిర్వహించాల్సిన అనేక అధికారిక కార్యక్రమాలు రద్దు చేశారు. ప్రైడ్ మంత్ ఈవెంట్ కూడా రద్దైంది. ప్రస్తుతం వాషింగ్టన్‌లో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని, ముఖ్యంగా శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న వాళ్లు మరింత జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించింది. అక్కడి స్కూళ్లలో కూడా గేమ్స్, ఇతర ఔట్ డోర్ యాక్టివిటీస్ రద్దు చేశారు. చాలా స్కూళ్లకు రిమోట్ లెర్నింగ్ సిస్టమ్ అమలు చేస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. మరోవైపు పొగ కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. న్యూయార్క్, ఫిలడెల్ఫియా, న్యూజెర్సీ, ఓహియో వంటి ఎయిర్ పోర్టుల నుంచి విమాన సర్వీసులకు అంతరాయం కలుగుతోంది. కొన్ని విమాన సర్వీసులు రద్దుకాగా.. ఇంకొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. జంతువుల సంరక్షణ కోసం ముందు జాగ్రత్త చర్యగా జూలను కూడా మూసేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
అమెరికాలో అనేక రాష్ట్రాల్లో ఆకాశమంత పొగ పర్చుకుని కనిపిస్తోంది. ఇప్పటికే వాయు కాలుష్యం ప్రమాదకర మెరూన్ కోడ్ స్థాయికి చేరువలో ఉందని అధికారులు చెప్పారు. కోడ్ మెరూన్‌ను వాయు కాలుష్యానికి సంబంధించి తీవ్ర ప్రమాద హెచ్చరికగా సూచిస్తారు. చైనాసహా అనేక దక్షిణాసియా దేశాల్లోని చాలా నగరాల్లో వాయు కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడు అమెరికా వీటన్నింటినీ దాటిపోయింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అమెరికాలోని నగరాల్లో ఇప్పుడప్పుడే వాయు కాలుష్యం తగ్గే సూచనలు కనిపించడం లేదు. కెనడా వల్ల అమెరికా ఇబ్బందులకు గురవుతోంది. 111 మిలియన్ల అమెరికన్లు ఈ ప్రభావానికి గురవుతున్నారు.
కెనడాకు సాయం
దావానలంతో సతమతమవుతున్న కెనడాకు సాయం అందించేందుకు ఇతర దేశాలు ముందుకొస్తున్నాయి. కెనడాలో సాధారణంగా ఈ సీజన్‌లో దావానలం ఎక్కువగా వ్యాపిస్తుంటుంది. ఈసారి ప్రారంభంలోనే దావానలం భారీ స్థాయిలో వ్యాపించింది. వందల సంఖ్యలో దావానలం అంటుకుంది. క్రమంగా ఇతర ప్రాంతాలకూ విస్తరిస్తోంది. గత నెలలోనే దావానలం ప్రభావంతో వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఇప్పటికే 4.3 మిలియన్ హెక్టార్ల (10.6 మిలియన్ ఎకరాల) అడవి దగ్ధమైంది. ఇది గత పదేళ్ల సగటుకంటే 15 రెట్లు ఎక్కువ కావడం విశేషం. ఈ కారణంగా రాబోయే కొన్ని నెలల్లో కెనడాలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మంటలు ఆర్పడంలో సాయం అందిస్తామని ఇతర దేశాలు ప్రకటించాయి. సహాయక చర్యల కోసం అమెరికా వందల మంది సైన్యం, సిబ్బందిని పంపింది.