JANASENA SEATS : చివరకు మిగిలింది 21
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలుండగా.. 144 అసెంబ్లీ, 17లోక్ సభ స్థానాల్లో టిడీపీ పోటీ చేయనుంది. బీజేపీ, జనసేనకు 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించింది టీడీపీ. ఇందులో 10 అసెంబ్లీ 6 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. జనసేన 21 అసెంబ్లీ , 2లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది.
ఏపీలో బీజేపీ (BJP), టీడీపీ(TDP), జనసేన (Janasena) సర్దుబాటు పంచాయితీలో మరో ట్విస్ట్. ఇప్పటికే తక్కువ సీట్లని క్యాడర్ నెత్తీ నోరూ బాదుకుంటుంటే.. పొత్తు ధర్మం అంటూ మరో త్యాగం చేశారు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). బీజేపీకి మూడు స్థానాలు ఇచ్చి… 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లకు పరిమితం అయ్యారు. అటు టీడీపీ కూడా బీజేపీ కోసం ఒక సీటు వదులుకోవాల్సి వచ్చింది. ఏపీలో కార్పొరేటర్ ని కూడా గెలిపించుకోలేని బీజేపీకి 6 ఎంపీ సీట్లు…10 ఎమ్మెల్యే స్థానాలు అప్పనంగా వచ్చాయి.
ఏపీలో వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్న టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సీట్ల విషయంలో అవగాహన కుదిరింది. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలని విషయంపై క్లారిటీ వచ్చేసింది. కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండాల, చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య.. సీట్ల సర్దుబాటు, కేటాయింపుపై దాదాపు ఎనిమిదిన్నర గంటల చర్చ జరిగింది.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలుండగా.. 144 అసెంబ్లీ, 17లోక్ సభ స్థానాల్లో టిడీపీ పోటీ చేయనుంది. బీజేపీ, జనసేనకు 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలను కేటాయించింది టీడీపీ. ఇందులో 10 అసెంబ్లీ 6 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది. జనసేన 21 అసెంబ్లీ , 2లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడిగా తొలి జాబితా ప్రకటించిన సమయంలో.. జనసేన 24 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లలో పోటీ చేస్తారని స్పష్టం చేశారు. ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన చర్చల్లో బీజేపీకి ఆరు అసెంబ్లీ, ఆరు లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. కానీ.. సోమవారం చంద్రబాబు నివాసంలో మూడు పార్టీలకు చెందిన కీలక నేతలు సీట్ల సర్దుబాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. తమకున్న ఓటు బ్యాంక్ ప్రకారం సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల నేతలు ఓ అంగీకారానికి వచ్చారు. బీజేపీకి అదనంగా మరో నాలుగు అసెంబ్లీ సీట్లు పెరిగాయి. ఈ నాలుగింటిలో మూడు జనసేన.. ఒకటి టీడీపీ వదులుకుంటున్నాయి. దీంతో.. జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీకి పరిమితమైంది. ఫస్ట్ లిస్ట్ టైమ్‌లో జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే.. ఇంత తక్కువా అని క్యాడర్ పెదవి విరిచారు. ఇప్పుడ మరో మూడు సీట్లు జనసేనాని త్యాగం చేయడంతో పార్టీ శ్రేణుల రియాక్షన్ ఎలా ఉంటుందన్న ఉత్కంఠ కలుగుతోంది.
మూడు పార్టీల మధ్య సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో.. సీట్ల సర్దుబాటు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇదే సమయంలో.. అసెంబ్లీ సీట్లలో డబుల్ డిజిట్ కావాలని బీజేపీ పట్టుబట్టింది. తమ వైపు నుంచి ఆశావహులు ఎక్కువగా ఉన్నారని.. అందుకే ఎక్కువ సీట్లు కావాలని బీజేపీ డిమాండ్ చేసింది. సర్దుబాటు తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా సీట్ల సర్దుబాటు జరిగిందని వివరించాయి. ఏయే పార్టీలు ఎక్కడి నుంచి పోటీ చేస్తాయన్నది త్వరలోనే ప్రకటించనున్నట్టు తెలిపారు. మొత్తంగా బీజేపీ కోసం టీడీపీ, జనసేన నాలుగు సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది.