Adikesavulu Family : ఆదికేశవులు కుటుంబం ఏ పార్టీలో ఉంది ?
డీకే ఆదికేశవులు నాయుడు... అటు వ్యాపారపరంగా, ఇటు రాజకీయంగా బతికున్న రోజుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనదైన ముద్ర వేయగలిగారు. 2004లో టిడిపి తరపున చిత్తూరు ఎంపీగా గెలిచిన ఆదికేశవులు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ గూటికి చేరి TTD ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2013లో అనారోగ్యంతో చనిపోయిన తర్వాత చాన్నాళ్ళ పాటు సైలెంట్ గా ఉన్న ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడు తలో ఒక పార్టీలో చేరిపోతున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియడం లేదు.
డీకే ఆదికేశవులు నాయుడు… అటు వ్యాపారపరంగా, ఇటు రాజకీయంగా బతికున్న రోజుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తనదైన ముద్ర వేయగలిగారు. 2004లో టిడిపి తరపున చిత్తూరు ఎంపీగా గెలిచిన ఆదికేశవులు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ గూటికి చేరి TTD ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. 2013లో అనారోగ్యంతో చనిపోయారాయన. ఆదికేశవులు రాజకీయాల్లో ఉన్నప్పుడే ఆయన కొడుకు డీకే శ్రీనివాసులు రాజకీయ రంగప్రవేశం చేశారు..2009లో ప్రజారాజ్యం తరపున రాజంపేట పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత టీడీపీకి దగ్గరైందా ఫ్యామిలీ. 2014లో ఆదికేశవులు భార్య సత్యప్రభ చిత్తూరు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019లో రాజంపేట ఎంపీగా టీడీపీ టిక్కెట్ మీద పోటీ చేసి ఓడిపోయారామె. 2020 నవంబర్‌లో చనిపోయారు డీకే సత్యప్రభ. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంది డీకే ఫ్యామిలీ. అయితే… ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో అందరికీ షాక్ ఇస్తూ కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ప్రత్యక్షం అవుతున్నారు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదా లేక ఇదో వ్యూహమా అన్న చర్చ సైతం జరుగుతోంది చిత్తూరు రాజకీయవర్గాల్లో.
మొదట ఆదికేశవులు మనవరాలు చైతన్య జనసేనలో చేరి చిత్తూరు జనసేన టిక్కెట్ నాదేనని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. తర్వాత ఆమె తల్లి, ఆదికేశవులు కుమార్తె తేజస్విని జీడీ నెల్లూరులో జరిగిన రా కదలిరా సభలో కనిపించి జిల్లా టీడీపీ నేతలకు షాకిచ్చారు. తేజస్విని కూడా చిత్తూరు టికెట్ ఆశించే చంద్రబాబును కలిశారన్న ప్రచారం జరుగుతోంది. తల్లీ కూతుళ్ళు ఇద్దరూ ఒకే టిక్కెట్‌ని చెరో పార్టీ నుంచి ఆశించడం, అదీ కూడా పొత్తులో ఉన్న పార్టీల నుంచి ఆశించడం వెనక వ్యూహం ఏంటన్న చర్చ జరుగుతోంది జిల్లా వర్గాల్లో. ఎవరి దారి వారిదేనా? లేక వేరే ఎవరూ పోటీకి రాకుండా… తిరగలి ఎటు తిరిగినా… పిండి మనవైపే పడాలన్న వ్యూహమా అన్నది క్వశ్చన్. ఇక డీకే ఆదికేశవులు కొడుకు శ్రీనివాస్… గత జనవరి ఫస్ట్‌న అనుచరులందరికీ విందు ఇచ్చి ఈసారి తాను ఎన్నికల బరిలో ఉంటానని చెప్పారట. అంతవరకు బాగానే ఉన్నా… ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోవడంతో డైలమాలో ఉన్నారట ఆ పార్టీకి వెళ్ళినవాళ్ళంతా. ఇక వాళ్ళ చిన్నాన్న బద్రినారాయణ టీడీపీ కార్యక్రమాల్లో రెగ్యులర్‌గా పాల్గొనడంతో శ్రీనివాస్ టీడీపీ- జన సేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ… ఆయన సడన్‌గా వైసీపీ కార్యక్రమాల్లోనూ కనిపించారు. వైసిపి అభ్యర్ధి విజయనంద రెడ్డిని కలిశారు కూడా. ఆయనకు రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరిగినా చివరికి అంతా ఉత్తుత్తిదేనని తేలిపోయింది. ఇలా ఆ ఫ్యామిలీ ఫ్యామిలీ కన్య్యూజన్‌లో ఉండి జనాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా? పిచ్చోళ్ళని అనుకుంటున్నారా అన్న మాటలు కూడా జిల్లా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే అలా తలోదారిన ఉండటానికి కుటుంబంలో ఉన్న విభేదాలే కారణమన్న టాక్ ఉంది. చిత్తూరు సీటును ఇప్పటికే వైసిపి విజయనందా రెడ్డికి ఇస్తే… టిడిపి మాత్రం ఎటూ తేల్చలేదు. ఈ పరిస్థితుల్లో డీకే ఫ్యామిలీ నుంచి ఎవరైనా ఉంటారా లేక మరో నేత బరిలో దిగుతారా అన్నది సస్పెన్స్‌గా మారింది. ఆ ఫ్యామిలీ వ్యవహారాన్ని గమనిస్తున్న వారు మాత్రం ఆళ్ళేంటో…. ఆళ్ళ ఇదాయకమేంటో…. అని కామెంట్ చేస్తున్నారు.