Vijayamma, JC Prabhakar : విజయమ్మ, జేసీ భేటీ వెనక.. అసలు సంగతి ఇదా..
ఏపీలో కూటమి (AP alliance) అధికారంలోకి రావడం.. జగన్ (YS Jagan) కు కనీసం ప్రతిపక్ష హోదా దక్కపోవడం.. జగన్‌కు చెల్లి ఎదురు తిరగడం.. ఇలాంటి పరిణామాల మధ్య ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయ్.
ఏపీలో కూటమి (AP alliance) అధికారంలోకి రావడం.. జగన్ (YS Jagan) కు కనీసం ప్రతిపక్ష హోదా దక్కపోవడం.. జగన్‌కు చెల్లి ఎదురు తిరగడం.. ఇలాంటి పరిణామాల మధ్య ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయ్. ఉప్పు నిప్పు కలుస్తున్నాయ్. నిప్పు, నీరు భేటీ అవుతున్నాయ్. ఏం జరిగినా అన్నింటికి టార్గెట్ మాత్రం జగనే అవుతున్నారు. అలాంటి సంఘటనే జరిగిందిప్పుడు! శత్రువు తల్లితో జేసీ ప్రభాకర్ రెడ్డి సమావేశం అయ్యారు. ఇది ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. వైఎస్ భార్య, జగన్ తల్లి విజయమ్మతో.. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది.
జగన్ పేరు చెప్తే కారాలు మిరియాలు నూరే ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy).. విజయమ్మను ఎందుకు కలిశారనే విషయం ఇప్పుడు సస్పెన్స్ క్రియేట్ చేస్తోంది. జగన్ అంటే.. జేసీ కుటుంబానికి ఎక్కడలేని కోపం.. వైసీపీ హయాంలో తమను ఆర్థికంగా అణగదొక్కేందుకు జగన్ ప్రయత్నించారని జేసీ చాలాసార్లు మీడియా ముందు విమర్శలు గుప్పించారు. కొన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారు కూడా ! 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. అనంతపురం సాక్షి కార్యాలయం ముందు జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్షకు దిగారు. జగన్‌తో పాటు అతని తల్లి విజమ్మను కూడా తీవ్రంగా దూషించారు. అప్పట్లో ఈ ఘటన రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. 2019లో జగన్ ప్రభుత్వం (Jagan Govt) రాగానే.. ఆయన వాహనాలకు సంబంధించి కేసును ఎదుర్కొన్నారు. ఆ తర్వాత కొంతకాలం జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కొడుకు ప్రస్తుత తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి కడప సెంట్రల్ జైల్లో ఉన్నారు.
ఇప్పుడు సర్కార్ మారింది. ఐతే విజయమ్మను జేసీ కలవడంపై రకరకాల చర్చ జరుగుతోంది. విజయమ్మ పూర్తిగా.. షర్మిలకు రాజకీయంగా సపోర్ట్ ఇస్తున్నారు. జగన్‌తో సరైన సంబంధాలు లేవన్నది ఓపెన్ సీక్రెట్. ఈ ఎన్నికల ముందు రోజు కూడా.. షర్మిలను గెలిపించాలని విజయమ్మ వీడియో రిలీజ్ చేశారు. ఇలా ఫ్యామిలీలో విభేదాలు కనిపిస్తున్న సమయంలో.. విజయమ్మను జేసీ కలవడం ఏంటా అనే ఆసక్తి రేపుతోంది. ఐతే ఇద్దరి భేటీ వెనక ఎలాంటి రాజకీయం లేదని తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రికి.. మెడికల్ టెస్టులకు వెళ్లినప్పుడు ఇద్దరు ఎదురుపడ్డారని.. ఆ సమయంలోనే కాసేపు సరదాగా మాట్లాడుకున్నారని తెలుస్తోంది. రాజకీయాలు కూడా చర్చకు వచ్చినట్లు టాక్. ఏమైనా విజయమ్మను జేసీ కలవడం రచ్చ రేపుతోంది.