Andhra Pradesh Surveys : ఎవడి సర్వే వాడిదే ! పొంతన లేని టైమ్స్ నౌ ఇండియా టుడే సర్వేలు

ఒక పేపరు, ఒక ఛానల్ ఉంటే మనకు నోటికొచ్చింది రాసుకోవచ్చు. ఇష్టమైంది చెప్పొచ్చు. నిజాన్ని అబద్ధం చేయాలని  ప్రయత్నించొచ్చు. అబద్దాన్ని... నిజం చేయడం కోసం నానా తంటాలు పడొచ్చు. ఇప్పుడు రెండు జాతీయ చానల్స్ . ఏపీ రాజకీయాలపై చేసిన సర్వే అలాగే ఉంది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 9, 2024 | 09:49 AMLast Updated on: Feb 09, 2024 | 9:49 AM

Andhra Pradesh Surveys

ఒక పేపరు, ఒక ఛానల్ ఉంటే మనకు నోటికొచ్చింది రాసుకోవచ్చు. ఇష్టమైంది చెప్పొచ్చు. నిజాన్ని అబద్ధం చేయాలని  ప్రయత్నించొచ్చు. అబద్దాన్ని… నిజం చేయడం కోసం నానా తంటాలు పడొచ్చు. ఇప్పుడు రెండు జాతీయ చానల్స్ . ఏపీ రాజకీయాలపై చేసిన సర్వే అలాగే ఉంది. టైమ్స్ నౌ ఛానల్ (Times now survey)… ఏపీలో ప్రస్తుత పరిస్థితిపై సర్వే చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే YSR సీపీకి 19 ఎంపీ సీట్లు, తెలుగుదేశం కూటమికి 6 MPసీట్లు వస్తాయని బల్లగుద్ది మరీ చెప్పింది. ఇదే టైమ్స్ నౌ కొన్ని నెలల క్రితం YSRCPకి 24 ఎంపీ సీట్లు, తెలుగుదేశంకి ఒక్క ఎంపీ సీటు మాత్రమే వస్తుందని చెప్పింది. ఎందుకో ఇప్పుడు కాస్త దయ తలచి… టీడీపీకి 6 MP సీట్లు ఇచ్చింది.

వైసిపి… ఆ పార్టీ అనుబంధ చానల్స్, పత్రికలు ఈ సర్వేని పట్టుకొని దండోరా మొదలెట్టాయి. ఏపీలో మరోసారి జగన్ సర్కార్ అంటూ చర్చలు వాదోపవాదాలు, టీవీ డిబేట్లు దంచి కొట్టాయి. వైసీపీ జర్నలిస్టులు, ఆ పార్టీ అనలిస్టులు ఏ రకంగా జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు… ఎలా మళ్లీ అధికారంలోకి వస్తున్నాడు అనే విషయాన్ని తమదైన స్టైల్లో రకాల సమీకరణలేసి విశ్లేషించేశారు. టైమ్స్ లో సర్వే వచ్చిన 24 గంటల్లో ఇండియా టుడే సర్వే (India Today Survey )దిగింది. ఇండియా టుడే తన సర్వేలో టైమ్స్ నౌ కి పూర్తి భిన్నంగా… ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ కూటమి కి 17 సీట్లు, వైసీపీకి 8 MP సీట్లు వస్తాయని ప్రకటించింది. ఇండియా టుడే సర్వేతో ఒక్కసారిగా తెలుగుదేశం వర్గాల్లో చలనం వచ్చేసింది. ఆ పార్టీ జర్నలిస్టులు, అనలిస్టులు జూలు విదిల్చి రంగంలోకి దిగారు. ఏపీలో మరోసారి టిడిపి రాజ్యం రాబోతుందనీ… జగన్ సర్కార్ అరాచకాలు అంతరించిపోయే రోజులు వచ్చాయని తమదైన శైలిలో డిబేట్లు, విశ్లేషణలు చేస్తున్నారు. ఈ రెండు సర్వేలు చూసిన జనానికి పిచ్చెక్కుతోంది. జాతీయస్థాయి చానల్స్ ఒక పద్ధతి పాడూ లేకుండా ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సర్వేలు చేసి… తమ క్రెడిబిలిటీని దెబ్బ తీసుకుంటున్నాయని జనం మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ చానల్స్ చేసిన సర్వే ప్రామాణికత ఏంటో ఎవడికీ తెలియదు.

సర్వేలో అన్నిటికన్నా ముఖ్యమైనది శాంపిల్ సైజ్. ఒక కోటి మంది జనానికి కనీసం రెండు శాతం అంటే రెండు లక్షల మందిని ప్రశ్నిస్తే… ఆ కోటి మంది జనంలో వివిధ అభిప్రాయాలు ఏంటో తెలుస్తాయి. నేషనల్ చానల్స్ టెలిఫోన్ కాల్ ద్వారా ఒక  5 వందల మందినో వెయ్యి మందినో ప్రశ్నించి… నాలుగు కోట్ల మంది ప్రజల తీర్పుని వీళ్లే తెలుసుకున్నట్లుగా చెప్పేస్తారు. వెయ్యి మందితో ఫోన్లో మాట్లాడితే… నాలుగు కోట్ల మంది అభిప్రాయం తెలుస్తుందా.? వెయ్యి మంది చెప్పిందే నాలుగు కోట్ల మంది అభిప్రాయం అవుతుందా? ఎన్నికల్లో టైమ్స్ నౌ సర్వే లేదా ఇండియా టుడే సర్వే ఏదో ఒకటే నిజం అవుతుంది. కానీ జాతీయస్థాయిలో కోట్ల మందికి చేరువయ్యే మీడియా సంస్థలు ఎలా పడితే అలా నెంబర్ లేసి మేము సర్వే చేశాం అని ప్రకటిస్తే చూసిన జనం నవ్వుకుంటారు కదా. టైమ్స్ నౌ సంస్థకి ఏపీలో జగన్ సర్కార్ మూడేళ్ల క్రితం భారీగా కోట్ల రూపాయల్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది. అప్పటినుంచి టైమ్స్ నౌ వైసీపీకి బాకా ఊదుతూనే ఉంది. ఇటీవలే ఇండియా టుడే ఎడ్యుకేషన్ కాంక్లేవ్ కి కూడా జగన్ ప్రభుత్వం నాలుగు కోట్లు చెల్లించింది. అంతేకాదు ఏడాది మొత్తం భారీగా ప్రకటనలు ఇస్తూనే ఉంది. కానీ ఇండియా టుడే సర్వే వైసీపీని నిరుత్సాహపరిచింది . ఏపీలో రెండు ప్రధాన పార్టీలు ఈ సర్వేలను పట్టుకొని వచ్చే ఎన్నికల్లో మేం గెలుస్తామంటే మేం గెలుస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నాయి.