Janasena party : జనసేన పార్టీకి మరో పదవి.. జనసేనకు డిప్యూటీ స్పీకర్ అవకాశం..
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఏపీ సీఎంగా నారా చంద్రబాబు నాయుడు నాలుగో సారి ముఖ్యంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఏపీ డిప్యూటి సీఎంగా నటుడు, జనసేన పార్టీ (Jana Sena Party) అధినేత పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా కూటమిలో భాగంగా మూడు పార్టీలకు మంత్రి పదవులు దక్కాయి. అందులో జనసేన పార్టీకి మొత్తం 10 శాఖలు కేటాయించారు. దీంతో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వద్దే ఏకంగా 6 శాఖలు నిర్వహిస్తున్నారు. మరో నాలుగు శాఖలు జనసేన పార్టీలోని ఇద్దరు నేతలు స్వీకరించారు. కాగా జనసేన పార్టీకి మరో పదవి దక్కుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
జనసేనకు డిప్యూటీ స్పీకర్ పదవి?
జనసేన (Jana Sena) డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని ఎన్డీయే సర్కార్ (NDA Govt) నిర్ణయించింది. ఎవరికి ఇవ్వాలనేదానిపై టీడీపీ, జనసేన అధినేతలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ చీఫ్ విప్‌గా పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేరును చంద్రబాబు ఖరారు చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 19న ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశంలో శాసన సభకు గెలిచిన ఎమ్మెల్యేలంతా ఆరోజునా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా సభలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ఆ తర్వాత అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లను సభ ఎన్నుకోనుంది. కాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేసినట్లు టీడీపీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం డీప్యూటీ స్పీకర్ పదవిని జనసేన పార్టికి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా జనసేన పార్టీలో డిప్యూటీ స్పీకర్ పదవికి అర్హులు ఎవరు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎతికే పనిలో పడ్డల్లు తెలుస్తుంది.