PAVAN BABU PKG : పవన్ లేకుండానే ఢిల్లీకి బాబు.. పక్కనబెట్టేశారా అంటున్న జనసైనికులు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీలు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల కోసం బాబు హస్తిన బాట పట్టారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. ఏపీకి రావాల్సిన నిధులు, విభజన హామీలు, అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధుల కోసం బాబు హస్తిన బాట పట్టారు. కానీ ఈ టూర్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ని ఎందుకు తీసుకెళ్ళలేదు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాతో సమావేశమవుతున్నారు. బాబుతో మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్ధన్ రెడ్డి వెళ్ళారు. ఏపీకి సంబంధించి చాలా కీలకమైన అంశాలపై ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చలు జరుపుతున్నారు. ఏపీకి నిధులు రాబట్టడమే ఎజెండాగా బాబు బృందం ఢిల్లీకి వెళ్ళింది. అయితే ఇంతటి కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఎందుకు తీసుకెళ్లలేదు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడల్లా… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వెంటపెట్టుకొనిపోతున్నారు. ప్రధాని, కేంద్ర మంత్రులతో జరిగే మీటింగ్స్ లో రేవంత్ తో పాటు భట్టి కూడా పాల్గొంటున్నారు. మరి పవన్ ని తీసుకెళ్లకపోవడం చూస్తే… చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనబెడుతున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జనసేన నేతలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి గెలుపులో పవన్ కల్యాణ్ రోల్ చాలా కీలకం. ఆ విషయం చంద్రబాబు కూడా తెలుసు. అందుకే పవన్ ని డిప్యూటీ సీఎం సీటులో కూర్చోబెట్టి… కోరిన శాఖలను ఎలాట్ చేశారు. తనతో సమానంగా ప్రోటోకాల్ ఇప్పించారు. కానీ తర్వాత నుంచి పవన్ కి ప్రియారిటీ తగ్గుతోందన్న జనసైనికులు అనుమానిస్తున్నారు. ఫించన్ల పంపిణీ యాడ్స్ లో పవన్ పేరు, ఫోటో పెట్టేలేదు. మంగళగిరిలో బాబు పాల్గొన్న ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో బ్యానర్ పైనా ఫోటో లేదు. ఏపీలో ఫించన్ల పంపిణీ పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతోంది. దానికి మంత్రి కూడా పవన్ కల్యాణే. అయినా ఆయనకు ప్రియారిటీ ఎందుకివ్వలేదు. ఇప్పుడు కూడా ఢిల్లీకి పవన్ ని ఎందుకు వెంట బెట్టుకొని వెళ్ళలేదని ప్రశ్నిస్తున్నారు జనసైనికులు. ఉద్దేశ్యపూర్వకంగానే పవన్ ను పక్కనబెట్టడమా… లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది బాబు, పవన్ లో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే తప్ప ఈ ఇష్యూకి ఎండ్ కార్డ్ పడే అవకాశాల్లేవు.