TDP VS YCP : ఏపీలో ఫర్నీచర్ రాజకీయం
ఏపీ రాజకీయం కుర్చీలు బల్లలు చుట్టూ తిరుగుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య ఫర్నిచర్ వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయంలో మినీ సైజ్ మాటల యుద్ధం నడుస్తోంది.
ఏపీ రాజకీయం కుర్చీలు బల్లలు చుట్టూ తిరుగుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య ఫర్నిచర్ వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఈ విషయంలో మినీ సైజ్ మాటల యుద్ధం నడుస్తోంది. క్యాంప్ ఆఫీసుని జగన్ పార్టీ ఆఫీసుగా మార్చేశారని, అందులో సర్కార్ ఫర్నిచర్‌ని వాడేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. ఈ ఆరోపణల్ని ఖండించిన వైసీపీ.. ఫర్నిచర్‌కు విలువ కడితే ఎంతో చెల్లిస్తామని ఇప్పటికే అధికారులకు చెప్పామని అంటోంది. జగన్ సీఎంగా వున్నప్పుడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ ఖర్చుతో ఫర్నిచర్‌ను జగన్ సెటప్ చేసుకున్నారు.
ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత కూడా జగన్ అదే ఫర్నీచర్‌ను వాడటాన్ని టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. ప్రభుత్వానికి ఫర్నిచర్‌ను తిరిగిచ్చేయ్యాల్సింది పోయి.. పార్టీ సమావేశాలకు వినియోగించుకుంటున్నారని విమర్శించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేష్ సైతం నాడు, నేడు ఫోటోలను షేర్ చేశారు. అప్పుడు కోడెలపై పెట్టిన కేసును.. ఇప్పుడు జగన్‌పై ఎందుకు పెట్టకూడదని కోడెల శివరాం ప్రశ్నించారు. అయితే, టీడీపీ ఆరోపణలను వైసీపీ ఖండించింది. నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది.
సీఎం హోదాలో ఎవరున్నా.. క్యాంప్ కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేసుకోవడం సర్వసాధారణ విషయమన్న వైసీపీ.. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే ఇచ్చామని వెల్లడించింది. వెసులుబాటు ఇస్తే… ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌కు విలువకట్టి.. ఎంత తిరిగి చెల్లించాలో చెప్తే.. అంతా చెల్లిస్తామని అధికారులకు చెప్పామని స్పష్టం చేసింది. మరోవైపు సీఎం హోదాలో జగన్ క్యాంప్ ఆఫీస్ నిమిత్తం ఎంత ఖర్చు పెట్టామనే అంశంపై నాటి జీవోలను అధికారులు వెలికితీస్తున్నారు. ఒక్క ఫెన్సింగ్ కోసమే 20 కోట్లు ఖర్చు పెట్టారని గుర్తించారు. ఈ విషయంలో నిబంధనలు అతిక్రమిస్తే నోటీసులు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.