Ashok Gajapati Raju Simplicity : అశోక గజపతి రాజు సింప్లిసిటీ చూడండి… !
అశోక్ గజపతి రాజు... పుట్టుకతోనే ధనవంతులు... సుదీర్ఘకాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయినా సరే... ఓ సామాన్యుడిలాగా రైల్వే ప్లాట్ ఫామ్ పై కూర్చొన్నారు. రైలు కోసం ఎదురు చూస్తున్న ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నారు. అశోక్ గజపతిరాజు సంప్లిసిటీని చూసి జనం ఆశ్చర్యపోతున్నారు.

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో ప్లాట్ ఫామ్ మీద కూర్చున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సికింద్రాబాద్ నుంచి విజయనగరంలోని ఆయన స్వస్థలానికి వెళ్ళేందుకు కుటుంబసభ్యులతో కలసి వచ్చారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫామ్ అరుగు మీద కూర్చున్నారాయన. గతంలో అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా 13 యేళ్ళ పాటు మంత్రిగా పనిచేశారు. పైగా రాజకుటుంబానికి చెందిన సంపన్నుడు. కానీ ఆయన సామాన్య ప్రయాణీకుడిలా రైల్వే స్టేషన్ లో కనిపించడంతో జనం ఆశ్యర్యపోయారు. అశోక్ గజపతిరాజు అడిగితే రైల్వే అధికారులు వచ్చి… ఆయన్న VIP గదిలో కూర్చోబెట్టే అవకాశముంది. ప్రత్యేక విమానంలో కూడా ప్రయాణించవచ్చు. కానీ అశోక్ గజపతి రాజు మొదటి నుంచీ అలాంటి ఆడంబరాలు ఏవీ కోరుకోరు. ఒక సామాన్యుడిలాగే ఉండటానికి ప్రయత్నిస్తారు.
అశోక్ గజపతి రాజు ఏపీలో రాష్ట్ర మంత్రిగా పనిచేసినప్పుడు కూడా ప్రభుత్వం కేటాయించిన వాహనంలో కాకుండా… తన సొంత కారులోనే సెక్రటరియేట్ కు వస్తుండేవారు. 13యేళ్ళ పాటు ఆయన ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేశారు. అశోక్ గజపతి రాజుది రాజకుటుంబం కావడంతో… తాతలు, తండ్రుల నుంచి వచ్చిన ఆస్తిలో వేల ఎకరాలను సమాజం అభివృద్ధి కోసం పంచిపెట్టారు. ఆయన ఓ సామాన్యుడిలా రైల్వేస్టేషన్ లో కూర్చున్న ఫోటోని టీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది అశోక్ గజపతిరాజు నిజాయతీ, పరిపూర్ణతకు నిదర్శనమని అభిప్రాయపడింది. జనానికి ఏది ఉత్తమమో అదే చేస్తుంటారని ప్రశంసించింది టీడీపీ. అధికారం ఎప్పుడు ఆయన్ని తప్పుదోవ పట్టించలేదనీ… తెలుగుదేశం పార్టీ అంటే ఇదేనని కామెంట్ చేసింది. ఈ పోస్టుపై కొందరు అశోక్ గజపతిరాజు సింప్లిసిటీని పొగుడుతున్నారు. కానీ టీడీపీలో ఆయన ఒక్కరే ఉన్నారు… ఇంకా ఎవరైనా ఉంటే చూపించండి అని మరికొందరు నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.