Kodali Nani : కొడాలి నానికి బ్యాడ్ డేస్.. కేసులతో మడపెట్టేస్తున్నారుగా
వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి కొడాలి నానికి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి.
వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి కొడాలి నానికి ఇప్పుడు బ్యాడ్ డేస్ నడుస్తున్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనపై వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తే… ఆయన కాలి బూట్లు తుడుస్తానని అప్పట్లో సవాల్ చేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్… ఈ ముగ్గుర్నీ బండ బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. ఆఖరికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మెగాస్టార్ చిరంజీవిపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారు. నానిని గుడివాడ ప్రజలు ఓడించి… మాజీగా కూర్చోబెట్టారు. దాంతో ఈ మధ్య కొంచెం డౌన్ అయ్యారు.
కానీ వైసీపీ హయాంలో గుడివాడలో నాని అనుచరులు చేసిన ఆగడాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొడాలి నాని ఆయన అనుచరులు ఆక్రమించుకున్న 7ఎకరాల 66 గుంటల భూమిని ఈమధ్యే ఆ స్థలం యజమానులు ధైర్యంగా పోలీసుల సాయంతో తిరిగి స్వాధీనం చేసుకున్నారు. నాని మాటలు నమ్మి… వాలంటీర్ ఉద్యోగానికి రిజైన్ చేశామంటూ… కొందరు కేసు పెట్టారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాడలో టిడ్కో ఇళ్ళ నిర్మాణం ప్రారంభోత్సవంలో మరో అవినీతి బయటకు వచ్చింది. ఓపెనింగ్ రోజున నిమ్మకాయ నీళ్ల పేరుతో… ఏకంగా 28 లక్షల ఖర్చు చూపించడంపై విమర్శలు వస్తున్నాయి. గుడివాడలో గడ్డం గ్యాంగ్ దారుణాలు అంటూ మంత్రి లోకేశ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టారు. టిడ్కో ఇళ్ళల్లో కొన్నింటిని నాని అనుచరులు అమ్ముకొని ఏకంగా 50 కోట్లు దిగమింగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. దానిపై ఎంక్వైరీ నడుస్తోంది. ఇప్పుడు కొడాలి నానిపై గుడివాడ టూ టౌన్ లో మరో కేసు ఫైల్ అయింది. నాని వల్లే తన తల్లి చనిపోయిందంటూ దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, కొడాలి నానితో పాటు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవి లతారెడ్డిపై కేసు పెట్టారు పోలీసులు.
2011లో టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరుతో లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందాడు ప్రభాకర్. 2019లో వైసీపీ వచ్చాక ఆ లైసెన్స్ ను పద్మారెడ్డికి ఇవ్వమని ఒత్తిడి చేశారు. కొడాలి నాని, అనుచరులు తనను బెదిరించారని ప్రభాకర్ ఆరోపిస్తున్నాడు. గోడౌన్ లో లిక్కర్ కేసులు పగలగొట్టి విధ్వంసం చేసి… వాటిని తగలబెట్టారని ఫిర్యాదు చేశాడు. అప్పట్లో పోలీసులకు కంప్లయింట్ ఇచ్చినా పట్టించుకోలేదంటున్నాడు ప్రభాకర్. ఈ సంఘటనతో తన తల్లి మనస్థాపంతో మంచం పట్టి చనిపోయారు బాధితుడు ఆరోపిచారు. పోలీస్ స్టేషన్లలో వరుసగా ఫిర్యాదులు నమోదు అవుతుండటంతో… నాని ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.