వైసీపీ అంతానికి.. చంద్రబాబు పంతానికి ఏడాది.. అరెస్ట్‌కు ముందు తర్వాత ఏం జరిగింది?

రాజకీయం మలుపు తీసుకోబోతోందని.. ఓ పార్టీ అంతానికి.. మరో పార్టీ పంతానికి.. సాక్ష్యం కాబోతుందని.. ఆ రోజు కూడా ఊహించలేదు అనుకుంటా ! ఒక్క అరెస్ట్‌.. ఒక్క పరిణామం.. ఒక్క నినాదం.. ఏపీ రాజకీయాలను మార్చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2024 | 04:58 PMLast Updated on: Sep 09, 2024 | 5:09 PM

Before And After Arrest Of Chandrababu Naidu

రాజకీయం మలుపు తీసుకోబోతోందని.. ఓ పార్టీ అంతానికి.. మరో పార్టీ పంతానికి.. సాక్ష్యం కాబోతుందని.. ఆ రోజు కూడా ఊహించలేదు అనుకుంటా ! ఒక్క అరెస్ట్‌.. ఒక్క పరిణామం.. ఒక్క నినాదం.. ఏపీ రాజకీయాలను మార్చేసింది. పొత్తులు కుదిరేలా చేసింది. ఫలితాలను తారుమారు చేసింది. ఓ పార్టీని నిరాశలోకి నెట్టేసింది. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌కు సరిగ్గా ఏడాది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆయన అరెస్ట్ అయి.. ఏడాది పూర్తయింది. ప్రతిపక్ష నేతగా నంద్యాల పర్యటనలో ఉన్న చంద్రబాబు శిబిరం దగ్గరకు చేరుకున్న సీఐడీ పోలీసులు… ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

బస్సులో చంద్రబాబు నిద్రపోతుండగా… ఉదయం ఆరు గంటలకే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయన్ను బయటకు పిలిచి అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారని.. చంద్రబాబుతో పాటు ఆయన లాయర్లు పోలీసులను ప్రశ్నించారు. ఆ తర్వాత అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయ్. పోలీసులపై తనకు నమ్మకం లేదని.. ఎన్ఎస్‌జీ పర్యవేక్షణలోనే వస్తానని చంద్రబాబు పట్టినపట్టు వీడకపోవడంతో.. పోలీసులు అంగీకరించి.. నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14రోజుల రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల తర్వాత ఆయనను… రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. పెళ్లి రోజునే చంద్రబాబును జైలుకు తరలించడంతో ఆయన భార్య భువనేశ్వరి, కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అరెస్ట్ తర్వాత చంద్రబాబు రెండుమూడు రోజుల్లోనే బయటకు వచ్చేస్తారని అంతా అనుకున్నారు. ఐతే 53రోజుల వరకు చంద్రబాబు జైలులోనే ఉండాల్సి వచ్చింది.

చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే.. పవన్ కల్యాణ్‌ వెళ్లి పరామర్శించారు. జైలు నుంచి బయటకు వచ్చి పొత్తుల ప్రకటన చేశారు. అక్కడే రాజకీయం మలుపు తిరిగింది. అధినేత జైలులో ఉన్నా.,. టీడీపీ శ్రేణులు, నారా, నందమూరి కుటుంబ సభ్యులు జనాల్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అని నినదించారు. రాజకీయ కుట్రలో భాగంగానే అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఎన్నడూ బయటకు రాని భువనేశ్వరి కూడా.. జనాల్లోకి వెళ్లారు. చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. బాబు అరెస్ట్‌పై జనాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 53వ రోజున అంటే… 31 అక్టోబర్ 2023న చంద్రబాబు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యాక చంద్రబాబు జనాల్లోకి వెళ్లి విస్తృతంగా పర్యటించారు. ఎన్నికల సమయంలో ఎండనక, వాననక అన్ని జిల్లాలను చుట్టేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ కనీవినీ ఎరుగని ఘన విజయం సాధించింది. ఐతే ఈ గెలుపునకు చంద్రబాబు అరెస్ట్ కూడా కలిసి వచ్చిందన్నది రాజకీయవర్గాల మాట. జైలులో చంద్రబాబును కలిసి వచ్చిన తర్వాత జనసేనాని పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేయడం, ఎన్నికలకు ముందు బీజేపీతో జతకట్టి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లడం కూడా కలిసివచ్చిందని చెప్తున్నారు.