Bharath Kahani : భరత్ సానుభూతి డ్రామానా ? పోలీసులకు దొరికిపోయాడు
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథం తగలబెట్టిన కేసు అనూహ్యంగా బూమరాంగ్ అయింది. ఏపీలో ఎన్నికల తర్వాత టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య అక్కడక్కడా ఘర్షణలు జరిగాయి.
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రచార రథం తగలబెట్టిన కేసు అనూహ్యంగా బూమరాంగ్ అయింది. ఏపీలో ఎన్నికల తర్వాత టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య అక్కడక్కడా ఘర్షణలు జరిగాయి. అదే టైమ్ లో రాజమండ్రిలో భరత్ ప్రచార రథాన్ని కూడా ఎవరో తగలబెట్టారు. అది టీడీపీ వాళ్ళ పనే అంటూ ఆయన ఆరోపించారు. అంతేకాదు… స్వయంగా అమరావతికి వచ్చి డీజీపీకి కంప్లయింట్ కూడా చేశారు భరత్. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు షాక్ అయ్యారు. ఆ రథం తగలబెట్టింది వైసీపీ కార్యకర్తే అని తేలింది. రాజమండ్రి లోని వీఎల్ నగర్ చెందిన దంగేటి శివాజీ వైసీపీ కార్యకర్త. ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీని టార్గెట్ చేయాలని డిసైడ్ అయి ఈ ప్లాన్ చేశాడు. భరత్ కు సానుభూతి వస్తుందన్న ఆలోచనతో ప్రచార రథాన్ని తగలబెట్టాడు.
భరత్ కేసు పెట్టాక దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు… దగ్గర్లో ఓ స్కూల్ లో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని కనిపెట్టారు. శివాజీని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయం చెప్పేశాడు. నిందితుడు భరత్ తండ్రి నాగేశ్వరరావుకి ప్రధాన అనుచరుడు కూడా. యూట్యూబ్ లో వీడియోలు వెతికి ప్రచార రధానికి ఎలా నిప్పుపెట్టాలో తెలుసుకున్నట్టు వైసీపీ కార్యకర్త శివాజీ చెప్పాడు. దోమల కాయల్, పెట్రోల్ కవర్ తో ప్రచార రథాన్ని ఎలా దగ్ధం చేయొచ్చో చూసి… అలాగే ప్లాన్ చేసి నిప్పు పెట్టినట్టు చెప్పాడు. ప్రచార రథం కాల్చిన తర్వాత భరత్ తండ్రికి కాల్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. దాంతో ఈ కేసులో మాజీ ఎంపీ భరత్, అతని తండ్రి నాగేశ్వరరావుపై కొత్త డౌట్స్ మొదలయ్యాయి. సానుభూతి కోసం వాళ్ళే ఈ పని చేయించారని టీడీపీ లీడర్లు ఆరోపిస్తున్నారు.
ఏపీలో జగన్ కి అత్యంత సన్నిహితుల్లో ఒకడైన భరత్… గతంలో సినిమాల్లో నటించాలని అనుకున్నాడు. ఆ తర్వాత పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చి… ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎంపీ అయ్యాడు. మొన్న రాజమండ్రి అర్భన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. జగన్ మీద ఈగ వాలనీయకుండా ప్రత్యర్థుల మీద విరుచుకుపడేవాడు భరత్. పవన్ అంటే చాలు ఒంటి కాలు మీద లేచేవాడు. ఎంపీగా గెలిచినా… ఎమ్మెల్యేగా ఓడిపోవడాన్ని భరత్ తట్టుకోలేకపోయాడు. ప్రజల్లో సానుభూతి, టీడీపీపై వ్యతిరేకత తీసుకురావడానికే ఈ పని చేశాడన్న ఆరోపణలు వస్తున్నాయి. భరత్ మాత్రం తాను సానుభూతి కోసం ఆ పనిచేయలేదనీ… కావాలంటే దేవుడి ముందు ప్రమాణానికి కూడా సిద్ధమంటున్నాడు. ఎవరూ బహిరంగ ఆరోపణలు చేయకుండానే… భరత్ వీడియో రిలీజ్ చేయడంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుమ్మడి కాయ దొంగ తరహాలో భరత్ వ్యవహారం ఉందని ట్రోల్ చేస్తున్నారు.