Visakhapatnam Politics : విశాఖ ఒన్ టౌన్ లో కులాల పంచాయతీ
విశాఖ (Visakha) వన్ టౌన్... పేరుకి పాత నగరమే కానీ ఇక్కడ రాజకీయం మాత్రం రంగుల రాట్నం. ఎప్పటికప్పుడు మారిపోయే ఈక్వేషన్లు ఎవరికి ఎందుకు సెట్ అవుతాయో... ఎవరికి ఫిట్టింగ్ పెడతాయో అంచనా వేయడం కష్టం. పునర్విభజన తర్వాత విశాఖ దక్షిణంగా పేరు మార్చుకున్న ఈ నియోజకవర్గం గ్రేటర్ వైజాగ్‌కే ఆయువు పట్టు. సాంప్రదాయ రాజకీయాలు కనిపించినా... ఓటర్ల తీర్పు విలక్షణంగా వుంటుంది.
విశాఖ (Visakha) వన్ టౌన్… పేరుకి పాత నగరమే కానీ ఇక్కడ రాజకీయం మాత్రం రంగుల రాట్నం. ఎప్పటికప్పుడు మారిపోయే ఈక్వేషన్లు ఎవరికి ఎందుకు సెట్ అవుతాయో… ఎవరికి ఫిట్టింగ్ పెడతాయో అంచనా వేయడం కష్టం. పునర్విభజన తర్వాత విశాఖ దక్షిణంగా పేరు మార్చుకున్న ఈ నియోజకవర్గం గ్రేటర్ వైజాగ్‌కే ఆయువు పట్టు. సాంప్రదాయ రాజకీయాలు కనిపించినా… ఓటర్ల తీర్పు విలక్షణంగా వుంటుంది. కాంగ్రెస్ (Congress) నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్, సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాత్రమే ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలవగలిగారు. 2014, 2019ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి రెండోసారి విజయం సాధించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్… తర్వాత వైసీపీలో చేరారు.
సౌత్ పొలిటికల్ (South Political) స్క్రీన్ పై ఇదంతా ఫస్ట్ హాఫ్ అయితే ఇప్పుడు సెకండ్ హాఫ్ రసవత్తరంగా మారుతోంది. సామాజిక వర్గ సమీకరణాల ఆధారంగా ఇక్కడ టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడా లేనంత గందరగోళం ఇక్కడ పెరుగుతోంది. కొత్తగా ఎవరి బలం ఎంతన్న లెక్కలు బయటికి వస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో నాలుగు కులాలు కీలకం. ఎస్సీ, మత్స్యకార సామాజిక వర్గం ఓటు బ్యాంక్ ఎక్కువ. బ్రాహ్మణ.. ముస్లిం మైనారిటీ, బీసీలది తర్వాత స్థానం. దీంతో ఈసారి బ్రాహ్మణ సామాజిక వర్గం గట్టిగా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది. విశాఖ ఎంపీ అభ్యర్ధిగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు GVL నరసింహారావు (GVL Narasimha Rao) కు అవకాశం కల్పించింది ఆ పార్టీ. సామాజిక కోణం కంటే విస్తృత రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన్ను పోటీకి సిద్ధం చేస్తోందనేది క్లియర్. కానీ… ఈ పాయింట్‌నే ఆధారం చేసుకుని వైసీపీ(YCP), టీడీపీ (TDP) పై ఒత్తిడి పెరుగుతోందట. ఎంపీ కాకున్నా… సౌత్ ఎమ్మెల్యే టిక్కెట్ అయినా ఇవ్వాలన్నది ఆ డిమాండ్.
ఆ మధ్య జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని సంతృప్తి పరిచే ప్రయత్నం చేసింది అధికారపార్టీ. బ్రాహ్మణ కార్పోరేషన్ మాజీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ కు టిక్కెట్ ఇచ్చింది. ఆయన ఓడిపోవడం వేరే స్టోరీ. ఆ తర్వాత దక్షిణలో టిక్కెట్ కోసం సీతంరాజు ప్రయత్నించడం… దాన్ని వాసుపల్లి అడ్డుకోవడం….అదంతా పెద్ద రచ్చరంబోలా ఎపిసోడ్. వర్గపోరుతో విసిగిపోయిన సీతంరాజు వైసీపీకి రాజీనామా చేసి తటస్థ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ హామీ లభిస్తే టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఆయన వర్గం సమాచారం.
ఇక, దక్షిణ సీటును ఆశించి వైసీపీలో పావులు కదుపుతోంది మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు ఫ్యామిలీ. సిట్టింగ్ సీటులో ఒకసారి చాన్స్ ఇవ్వాలని, ద్రోణంరాజు కుటుంబంపై ఉన్న సింపథీ, విస్త్రత పరిచయాలతో గెలిచి వస్తామని కోరుతోందట. వాసుపల్లిని మార్చడం అనే ఆలోచన కానీ చేస్తే… ఇక్కడ సెకండ్ అల్టర్నేటివ్ ద్రోణంరాజు ఫ్యామిలీ అనేది క్లియర్ అని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక, పొత్తుల వ్యవహారం తేలక ముందే బీజేపీ (BJP) తరపున సీటు ఆశించి రంగంలోకి దిగారు డీవీ శర్వాణి. ఆమె హైకోర్టు రిటైర్డ్ జడ్జి సోమయాజులు భార్య. అంతకు మించి విశాఖ అభివృద్ధిని కీలక మలుపు తిప్పిన మొదటి మేయర్. వీళ్ళందరి కుటుంబ నేపథాలు వేరైనా… సామాజికవర్గం మాత్రం బ్రాహ్మణులే. ఆ పాయింట్ మీదే టిక్కెట్ కోరుతున్నారట.
ఈనెల 4న విశాఖలో విప్రోత్సవం పేరుతో బ్రాహ్మణులు అంతా ఏకమై భారీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు లక్ష్యం ఎన్నికల్లో సీట్లు కోరడమే. విశాఖ ఎంపీ, సౌత్ అసెంబ్లీ సీటులో చాన్స్ ఇచ్చే పార్టీకే మద్దతు ఇవ్వాలనేది తీర్మానం. పార్లమెంట్ పరిధిలో ఆ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ లక్షన్నర పైగా వుంటుందనేది ఓ లెక్క. ఏపీ వ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారం చూస్తే కనీసం ఆరు సీట్లు గరిష్టంగా పది సీట్లు అయినా బ్రాహ్మణులకు ఇవ్వాలని అడుగుతోంది. విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ప్రాతినిధ్యం లేదనీ… పోటీకి అవకాశం వున్న సౌత్ సీటును తమకు ఖరారు చేయాలనే అభ్యర్ధనను బలంగా పార్టీల ముందు పెడుతోంది బ్రాహ్మణ సామాజికవర్గం. ఆ దిశగా లాబీయింగ్ విస్తృతం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ డిమాండ్‌ను ఏయే పార్టీలు ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటాయో చూడాలి.