Chandrababu : పాబ్లో ఎస్కోబార్‌తో జగన్‌ను పోల్చిన చంద్రబాబు.. ఇంతకీ ఎవరితను.. అమెరికానే భయపడేంత ఏం చేశాడు?

పాబ్లో ఎస్కోబార్ గావరియా.. ఈ పేరు చెప్తే ఓ సందర్భంలో అగ్రరాజ్యం అమెరికా (America) కూడా వణికిపోయింది. అమెరికా అధ్యక్షుడికి, అధికారులకు నిద్రలేకుండా చేసిన పాబ్లో ఎస్కోబార్ పేరు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 29, 2024 | 02:59 PMLast Updated on: Jul 29, 2024 | 2:59 PM

Chandrababu Compared Jagan With Pablo Escobar What Did He Do To Make America Afraid Of Whom

 

 

పాబ్లో ఎస్కోబార్ గావరియా.. ఈ పేరు చెప్తే ఓ సందర్భంలో అగ్రరాజ్యం అమెరికా (America) కూడా వణికిపోయింది. అమెరికా అధ్యక్షుడికి, అధికారులకు నిద్రలేకుండా చేసిన పాబ్లో ఎస్కోబార్ పేరు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ అస్త్రంగా మారింది. పాబ్లో పేరు చుట్టూ ఇప్పుడు పాలిటిక్స్ మండుతున్నాయ్. వైసీపీ (YCP) అధినేత జ‌గ‌న్‌‌ (YS Jagan) ను పాబ్లో ఎస్కోబార్‌తో (Escobar) పోల్చారు ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu). కొంద‌రికి అవ‌స‌రాలు ఉంటాయ‌ని, కొంద‌రికి కోర్కెలు ఉంటాయ‌ని, కొంద‌రికి పిచ్చి ఉంటుంద‌ని.. పిచ్చి ప‌ట్టిన‌వాళ్లే ఇలాంటి దందాలు చేస్తుంటారని.. కడిగిపారేశారు. పాబ్లో ఎస్కోబార్‌లా సంపన్నుడు కావాలని జగన్ చేయకూడని పనుల చేశారంటూ.. అసెంబ్లీ సాక్షిగా ఈ డ్రగ్‌ డెన్‌ చరిత్ర చెప్పుకొచ్చారు చంద్రబాబు.

చంద్రబాబు కామెంట్స్ తర్వాత.. పాబ్లో పేరు తెలుగు రాజకీయాల్లో (Telugu politics) హాట్‌టాపిక్‌గా మారింది. ఇలా అన్నారు చంద్రబాబు అంటే.. జగన్ ఆ పేరు కూడా సరిగా పలకలేకపోయారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా పాబ్లో ఎస్కోబార్ పేరు.. జగన్ నోటి వెంట రాలేదు. చంద్రబాబు ఆయుధంగా చేసుకున్న పేరు.. జగన్ పలకలేకపోయిన పేరు.. ఇంతకీ ఎవరీ పాబ్లో ఎస్కోబార్ అనే చర్చ సోషల్‌ మీడియాను హీటెక్కిస్తోంది. పాబ్లో.. పిల్లల కోసం పాడు పనులు చేసిన ఓ తండ్రి.. కూతురుకు చలేస్తుందంటే నోట్ల కట్టలు మంటల్లో వేడి పుట్టించి కూతురు మొహంలో ఆనందం చూసిన మూర్ఖుడు.. పిల్లల తర్వాతే ఏదైనా, ఏమైనా చేస్తాను అనుకునే సున్నితమైన తండ్రి.. జాలి లేని డ్రగ్ డీలర్‌, అమెరికాను కొనేసేంత ఆస్తిపరుడు.. అనాధలా చనిపోయిన ఓ డ్రగ్ డెన్‌. తన చావును తనే రాసుకున్న రాక్షసుడు..

ఇదీ పాబ్లో గురించి నాలుగు ముక్కల్లో చెప్పాలంటే ! కొలంబియాలోని ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో పట్టాడు పాబ్లో ఎస్కబార్‌. మొత్తం ఏడుగురు సంతానంలో ఒకడు. చిన్నప్పుడు స్కూల్‌కు సరిగ్గా వెళ్లేవాడు కాదు. ఎక్కడెక్కడో తిరిగేవాడు. చెడు స్నేహాలు అప్పుడే పరిచయం అయ్యాయ్. ఖర్చులకు పేరెంట్స్ డబ్బులు ఇవ్వడం లేదని.. దొంగ లాటరీ టికెట్లు అమ్మేవాడు. దొంగచాటుగా డ్రగ్స్‌ నింపిన చుట్టలు, సిగరెట్లు అమ్మేవాడు. కారు, బైక్ కనిపిస్తే చాలు.. తన చేతివాటం చూపించేవాడు. ఇలా చిన్నతనంలోనే నేర ప్రవృత్తిని అలవాటు చేసుకున్నాడు పాబ్లో. 1970ల్లో డ్రగ్స్‌ ముఠాలో చేరిన ఎస్కోబార్ ఆ తర్వాత తనే స్వయంగా డీలర్‌గా మారాడు. 1975 నుంచి పౌడర్ కొకైన్ అమ్మడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత డ్రగ్స్ వ్యాపారంలో ఎదిగిపోయాడు. మొదట్లో కొద్దిమొత్తంలో అమెరికాకు పంపించే కొకైన్‌ను… ఏకంగా రోజుకు 15టన్నుల ఎగుమతి స్థాయికి చేర్చాడు. అందుకే తప్పు అని తెలిసినా.. అదే తప్పులు చేసేవాడు. తన వ్యాపారానికి ఎవరు అడ్డు వచ్చినా.. వాళ్లను వదిలేవాడు కాదు పాబ్లో. లొంగిపోయారా సరే.. లేదంటే కిడ్నాప్‌లు, మర్డర్‌లు. ఇలా పాబ్లో చేతిలో చనిపోయిన వారు, చంపించిన వారిలో పోలీసులు, జడ్జిలు, రాజకీయ నాయకులు ఉన్నారు. 1985లో తనపై విచారణ చేయిస్తున్నారని ఏకంగా కోర్టుపై దాడి చేయించాడు పాబ్లో. 11మంది జడ్జిలను పొట్టనబెట్టుకున్నాడు. అతనికి డబ్బు కావాలి.. డబ్బుతో వచ్చే పేరు కావాలి.

దీనికోసే కొలంబియాలో ఇళ్లు కట్టించాడు, ఆసుపత్రులు నిర్మించాడు. పిల్లలకు ఫుట్‌బాల్‌ కిట్లు, స్కూళ్లు… పెద్దోళ్లకు స్టేడియాలు, చర్చిలు, నిరుపేదలకు చేతి నిండా సొమ్ము, కడుపు నిండా తిండి.. ఇలా చాలా చేశాడు ఎస్కోబార్‌. పాబ్లోను కూడా దేవుడిలా చూసేవాళ్లు ఉన్నారు అందుకే ! 1976లో మొద‌టిసారి పాబ్లోను మొదటిసారి అరెస్టు చేశారు. జైలు నుంచే ఈ దందా నడిపించేవాడు. 1980నాటికి అతడు ప్రపంచంలోనే అత్యంత సంప‌న్నమైన డ్రగ్ కింగ్‌పిన్‌గా మారాడు. 1989లో ప్రపంచంలోనే ఏడో సంపన్నుడిగా పాబ్లో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు అతని సంపాదన. డ్రగ్స్ దందాకు ప్రత్యేకంగా ఓ దీవినే అడ్డాగా మార్చుకున్నాడు పాబ్లో. తన పలుకుబడితో, పైసలతో.. కొలంబియా అధికారులను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. మాములు పోలీసు నుంచి జడ్జిల వరకు.. అందరినీ భయపెట్టి గుప్పిట్లో పెట్టుకొని తన దందాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నాడు. సంపాదనంతా తన పిల్లల కోసమే అని చెప్పి మరీ సంపాదించాడు పాబ్లో.. చిన్న చిన్న దేశాల ప్రభుత్వాలు కూడా కూడబెట్టలేనంత.. పాబ్లో ఒక్కడు సంపాదించేవాడు అంటే.. అతని డ్రగ్స్ దందా ఎలా నడిచేదో అర్థం అవుతుంది.

రోజుకు 70 మిలియన్‌ డాలర్లు బిజినెస్ చేసేవారు. కొందరి లెక్కల ప్రకారం ఏడాదికి 21బిలియన్‌ డాలర్ల పైమాటే! కుప్పలు తెప్పలుగా వచ్చిపడే సొమ్మును కట్టకట్టేందుకు.. రబ్బర్ బ్యాండ్‌ల కోసమే వారానికి వెయ్యి డాలర్లు ఖర్చు చేశారంటే.. ఆ డబ్బు ఎంతో మీ లెక్కలకే వదిలేస్తున్నాం. పోగేసిన నోట్ల కట్టల్లో చాలావరకు ఎలుకలు కొట్టేసేవట. ఈ డబ్బులు దాచేందుకు ఏకంగా ఓ విల్లానే నిర్మించాడు పాబ్లో. ఎస్కోబార్‌కు, అతని ప్రత్యర్థులకూ మధ్య జరిగిన హత్యలతో.. కొలంబియా ప్రపంచ హత్యా రాజధానిగా మారిపోయింది. దీంతో అప్పటివరకూ చూసీ చూడనట్టు ఊరుకున్న కొలంబియా ప్రభుత్వం.. ఎస్కోబార్‌ను టార్గెట్ చేసింది. ఐతే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. కొలంబియా కంటే ఎస్కోబార్‌ చాలా పెద్దోడు. అతడి స్థాయి, శక్తి పెద్దది. అతడిని ఒంటరిగా ఓడించడం కష్టం. ఇరవై ఏళ్లలో అతడో మహావృక్షమై కూర్చున్నాడు. అందుకే అమెరికా సాయం తీసుకుంది కొలంబియా. అగ్రరాజ్యానికి కూడా.. ఎస్కోబార్‌తో తలనొప్పే. ఎంత కంట్రోల్ చేయాలనకున్నా.. తమ దేశంలోకి కొకైన్‌ను పంపుతూనే ఉండేవాడు పాల్బో. అప్పటికీ వాల్డ్‌వైడ్‌గా 80శాతం డ్రగ్స్‌ వ్యాపారం ఒక్క ఎస్కోబారే చేతిలోనే ఉండేది.

దీంతో ఇక అతన్ని వదిలేది లేదని డిసైడ్ అయింది అమెరికా. తుపాకులు ఎక్కుబెట్టింది. ఐతే అది అంత ఈజీ కాలేదు. రెండు దేశాలు కలిసి ఓ ఆపరేషన్‌ నిర్వహిస్తే.. పాబ్లోను వేసేయడానికి ఏడాది పట్టింది. రెండు దేశాల ఆపరేషన్‌లో అనాథ శవంలా మిగిలిపోయాడు పాబ్లో. అతను చనిపోవడానికి కారణం పిల్లల మీదే ప్రేమే. తన కొడుకుతో ఫోన్‌లో మాట్లాడుతూ నిఘా వర్గాలకు అడ్డంగా దొరికిపోయాడు. ఇలాంటి పాబ్లోతో ఇప్పుడు జగన్‌ను పోల్చారు చంద్రబాబు. పాబ్లోలో ఉన్న చాలా పోలికలు జగన్‌లో ఉన్నాయని.. ఎస్కోబార్ జైలు నుంచి దందా నడిపిస్తే.. జైలు నుంచి జగన్ రాజకీయం చేశారని.. తన తప్పులు కవర్ చేసుకునేందుకు పాబ్లో ఓ తీవ్రవాద ముఠాను సృష్టిస్తే.. జగన్‌ పేటీఎం బ్యాచ్ క్రియేట్ చేశాడని.. ఇలా ఎస్కోబార్‌తో జగన్‌ను కంపేర్‌ చేస్తూ.. చంద్రబాబు మాటల తర్వాత సోషల్‌ మీడియాలో యుద్ధం మొదలుపెట్టింది టీడీపీ.