పార్టీపై బాబు ఫోకస్, ఎమ్మెల్యేలకు మూడిందా…?

ఈనెల 18 నుంచి 30వ తారీఖు వరకు ఏపీ సిఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నెల 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. 20వ తేదీన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 15, 2024 | 06:21 PMLast Updated on: Oct 15, 2024 | 6:21 PM

Chandrababu Serious On Party Mlas

ఈనెల 18 నుంచి 30వ తారీఖు వరకు ఏపీ సిఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు. ఈ నెల 18న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. 20వ తేదీన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు. 2019 నుoచి 2024వరకు వున్న ఇంచార్జిలతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. టీడీపీ పార్టీ నేతలపై తప్పుడు కేసులపై సమీక్ష కూడా జరపనున్నారు చంద్రబాబు. రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ, అధ్యక్షులు, కమిటీ లపై దృష్టి పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇక చంద్రబాబు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహిస్తున్న సమావేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేల పని తీరు విషయంలో చంద్రబాబు నాయుడు ముందు నుంచి సీరియస్ గా ఉన్నారు. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేల పని తీరుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారనే వార్తలతో పాటుగా ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారు అని ఎల్లో మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీ తీసుకు రాగా దానిలో కూడా ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవడం వివాదాస్పదం అయింది. దీనిపై ఎల్లో మీడియాలో కథనాలు వచ్చాయి. దానిపై సీరియస్ అయిన చంద్రబాబు… మద్యం షాపుల ఏర్పాట్లలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. దీనితో ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు. అలాగే కొందరు మాజీ మంత్రులుగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా పాలనా వ్యవహారాల్లో పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే కథనాలు కూడా వస్తున్నాయి. ఉచిత ఇసుకలో కూడా జోక్యం చేసుకుంటున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.

ఉచితంగా ఇసుక అందించడంతో కొందరు ఎమ్మెల్యేలు ఇసుకను వ్యాపారంగా మార్చుకున్నారనే ఆరోపణ ఉంది. దీనిపై చంద్రబాబుకు ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా అందాయి. దీనిపై త్వరలోనే మరో ఇసుక పాలసీ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దానితో పాటుగా… కొందరు ఎమ్మెల్యేల బంధువులు భూ కబ్జాల విషయంలో జోక్యం చేసుకుంటున్నారని అలాగే సివిల్ తగాదాల్లో ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై ఇప్పటికే చంద్రబాబు వద్దకు పలు నివేదికలు కూడా అందాయని సమాచారం.

గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే విషయంలో దీనిపై ఆరోపణలు ఉన్నాయి. ఆమె భర్త భూ అక్రమాలు చేస్తున్న్నారని కథనాలు కూడా వచ్చాయి. మూడు సార్లు చెప్పినా తీరులో మార్పు లేదని చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. ఈ విషయంపై ఆయన బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కొందరు మంత్రుల పని తీరుపై కూడా చంద్రబాబు అసహనంగా ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడం మీడియా సమావేశాల్లో మాట్లాడకపోవడం వంటివి చంద్రబాబు సీరియస్ గా తీసుకుంటున్నారు.

అలాగే కొందరు రాయలసీమ ఎమ్మెల్యేలు కర్ణాటకలో వ్యాపారాలు కూడా చేస్తున్నారని నియోజకవర్గాలకు పెద్దగా రావడం లేదనే అసహనం కూడా చంద్రబాబులో ఉంది. దీనిపై కూడా ఆయన సీరియస్ గా ఉన్నట్టుగా సమాచారం. అలాగే విజయవాడ వరదల సమయంలో సరైన పని తీరు లేని కొందరు ఎమ్మెల్యేలపై కూడా చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు. కనీసం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడం లేదనే కోపం కూడా చంద్రబాబులో ఉంది. ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి విషయంలో కూడా చంద్రబాబు అసహనంగా ఉన్నారు. దీనిపై కూడా చంద్రబాబు ఎమ్మెల్యేతో స్వయంగా మాట్లాడనున్నారు.