Chandrababu Silent : ఎక్కడో తేడా కొడుతోంది ! చంద్రబాబు మౌనం అందుకేనా ?

ఏపీ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు? ఆయన మౌనం దేనికి సంకేతం? పోలింగ్‌ ముగిసి ఇన్ని రోజులైనా.... తన సహజ శైలికి భిన్నంగా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు. మనం గెలుస్తున్నామన్న నమ్మకమా? లేక ఎక్కడో తేడా కొడుతోందన్న భయమా? అసలు చంద్రబాబు మౌనం వెనుక ఏముంది

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 22, 2024 | 12:11 PMLast Updated on: May 22, 2024 | 12:12 PM

Chandrababu Silent

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చావో రేవో అన్నట్టుగా పోరాడాయి ప్రధాన పార్టీలు. పార్టీలు ఎంత సీరియస్‌గా ప్రచారం చేశాయో…. అంతకంటే ఉధృతంగా నమోదైంది పోలింగ్‌ శాతం. ఏపీ పోల్‌ పర్సంటేజ్‌ ఇప్పటిదాకా దేశం మొత్తం మీదే హయ్యెస్ట్‌ అంటేనే.. మేటర్‌ అర్ధం చేసుకోవచ్చు. అందుకే గెలుపు మీద ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఇక సీఎం జగన్‌ అయితే.. ఓ అడుగు ముందుకేసి ఇప్పుడున్న 151 సీట్ల కంటే అదనంగా వస్తాయంటూ ధీమాగా చెప్పేశారు. దీంతో వైసీపీ నేతల్లో మరింత ఉత్సాహం పెరిగింది. తమ అధినేత రెండోసారి సీఎంగా ప్రమాణం చేస్తారని ప్రకటించేస్తున్నారు ఆ పార్టీ లీడర్స్‌. బొత్స లాంటి నేతలైతే.. ఏకంగా ముహూర్తం ఫిక్సయింది, విశాఖలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయన్న రేంజ్‌లో మాట్లాడుతున్నారు. అదే సమయంలో టీడీపీ నేతల్లో ధీమాగా కనిపిస్తున్నా… పెద్ద నాయకులెవరూ ఆ స్థాయిలో మాట్లాడటం లేదు. ఇటు వైసీపీ హడావుడి, టీడీపీ సైలెన్స్‌పై ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. గెలుపుపై వైసీపీ తెగ హడావిడి చేస్తుంటే.. టీడీపీ మాత్రం ఎందుకంత సైలెంటుగా ఉందన్న లాజిక్‌ లాగుతున్నారట కొందరు.

విజయంపై టీడీపీలో అనుమానాలు ఉన్నాయా..? లేక ఇంకా వారి లెక్కలు ఓ కొలిక్కి రాలేదా..? అనే చర్చ మొదలైంది. మామూలుగా అయితే…. ఎన్నికలవగానే చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి.. ఏదోకటి మాట్లాడేస్తారు. మేం ఇలా, అలా అని సుదీర్ఘంగా విశ్లేషిస్తారు. కానీ.. ఈసారి మాత్రం పోలింగ్‌ ముగిసిన తర్వాత చంద్రబాబు ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉండడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు. ఆయన అలా ఉండటం బహుశా ఇదే తొలిసారి అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. తాను గెలిచిన 2014 ఎన్నికల్లో కావచ్చు.. ఓడిన 2019 ఎన్నికల్లో కావచ్చు.. పోలింగ్‌ అయిన వెంటనే గెలుస్తామనే ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. అలాగే గెలిచినా.. ఓడినా.. మీడియా ముందుకు వచ్చి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం… టీడీపీ అధినేతకు అలవాటైన వ్యవహారం. అలాంటిది ఇప్పుడు ఆయన సైలెన్స్‌ దేనికి సంకేతం అంటుూ చర్చిస్తున్నాయి రాజకీయ వర్గాలు. గెలుపుపై అంత ధీమా ఉంటే చంద్రబాబు ఎందుకు మాట్లాడ్డం లేదనే విమర్శలు సైతం వస్తున్నాయి. అయితే తమ అధినేత ప్రధాని నామినేషన్‌ వేస్తున్న సందర్భంగా వారణాసి వెళ్లినప్పుడు మాట్లాడరని, అది అంతగా రిజిస్టర్‌ కాలేదని అంటున్నారు కొందరు టీడీపీ నాయకులు. ఇక ఆ తర్వాత కూడా ప్రత్యేకంగా మాట్లాడ్డానికి ఏముందని అంటున్నాయి పార్టీ వర్గాలు. కౌంటింగ్‌ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు.. పోలింగ్‌ సరళిని విశ్లేషించుకునే పనిలో చంద్రబాబు కొన్నాళ్లపాటు బిజీగా ఉన్నారని.. ఆ తర్వాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. రెండున్నరేళ్ల నుంచి చంద్రబాబు అదే పనిగా వివిధ కార్యక్రమాలు పెట్టుకుని అలుపన్నదే లేకుండా పర్యటిస్తూనే ఉన్నారని.. అందుకే ఇప్పుడు కొన్నాళ్ల పాటు రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లారని అంటున్నారు. అయినా పోలింగ్‌ ముగిశాక ప్రత్యేకంగా ఆయన మాట్లాడాల్సిన పని లేదని అంటున్నారు పార్టీ నేతలు.

టీడీపీ గెలుపు ఖాయమని ఎవ్వరిని అడిగినా చెబుతున్నారని.. సట్టా బజార్‌ పందేలు సైతం ఆ విషయాన్నే చెబుతున్నాయని అంటున్నారు. వైసీపీ మీద పందాలు కట్టేవారు చాలా తక్కువ కన్పిస్తున్నారని విశ్లేషిస్తున్నాయి ఎన్టీఆర్‌ భవన్‌ వర్గాలు. వైసీపీ గెలుపుపై రూపాయికి.. రూపాయిన్నర.. కొన్ని చోట్ల రెండు రూపాయలు కూడా ఇస్తామనే వారు ముందుకు వస్తున్నారంటూ బెట్టింగ్‌ మార్కెట్‌ను విశ్లేషిస్తున్నారు కొందరు తెలుగుదేశం నేతలు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యేకించి గెలుపు కోసం మాట్లాడాల్సిన అవసరం లేదని అంటున్నారట. అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు మౌనం అనేక అనుమానాలకు తావిస్తోందనే వారూ లేకపోలేదు. సహజంగా ఆయన మీడియాతో మాట్లాడే విషయంలో వెనక్కు తగ్గరని.. వెనక్కు తగ్గారంటే.. ఫలితాల్లో కూడా వెనక్కు వెళ్లారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. గతంతో పోల్చుకుంటే చంద్రబాబు తన స్టైల్‌ మార్చారని.. ఎప్పుడు పడితే అప్పుడు మీడియా ముందుకు రావాల్సిన అవసరం లేదని ఆయన భావిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఏది ఏమైనా.. ఫలితాలు ఎలా ఉన్నా.. టీడీపీ మౌనం.. చంద్రబాబు సంయమనం మాత్రం ఏపీలో చర్చనీయాంశం అయ్యాయి. ఏపీలో ఎవరి చర్చలు ఎలా ఉన్నా వీటితో నాకేం సంబంధం లేదు అన్నట్లు… చంద్రబాబు ఫ్యామిలీ తో రిలాక్స్ అవుతున్నారు