Chandrababu Skill Case : బాబు కేసులో సుప్రీం ఇవాళ తుది తీర్పు…ఎన్నికల ముందు టీడీపీలో టెన్షన్ !
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ తుది తీర్పు రాబోతోంది. 17A చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీం తీర్పు ఇస్తేనే బాబుకు ఊరట కలుగుతుంది. లేకపోతే బెయిల్ రద్దయి మళ్ళీ జైల్ కు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించి ఇవాళ కీలక తీర్పు సుప్రీంకోర్టులో రాబోతోంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు తర్వాత బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే ఏపీ సీఐడీ అధికారులు అక్రమంగా కేసు బనాయించారంటూ చంద్రబాబు పెట్టుకున్న క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో తుది తీర్పు వెల్లడి కానుంది. FIR రద్దు కోసం చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సెక్షన్ 409 కింద స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారు. సెక్షన్ 17A ప్రకారం అరెస్టు అక్రమమంటూ బాబు పిటిషన్ వేశారు. 17A ప్రకారం అరెస్ట్ కు ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే సెక్షన్ 17A బాబు కేసుకు వర్తించదని ఏపీ సీఐడీ వాదనలు వినిపించింది. కేసు కొట్టేయాలని మొదట ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు చంద్రబాబు. తర్వాత అప్పీల్ చేసుకుంటూ సుప్రీంకోర్టు వరకూ క్వాష్ పిటిషన్ చేరుకుంది.
జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ముందు వాదనలు పూర్తయ్యాయి. 2023 అక్టోబర్ 20నే తుది విచారణ జరిగింది. తీర్పును జనవరి 16కు వాయిదా వేసింది ధర్మాసనం. ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపై ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏపీ ఎన్నికల ముందు సుప్రీం తీర్పుపై టీడీపీ నేతల్లో టెన్షన్ కనిపిస్తోంది. మరోవైపు ఈ తీర్పు కోసం జాతీయస్థాయిలో రాజకీయ కక్ష బాధితులంతా ఎదురుచూస్తున్నారు.