వెంకన్ననే బోనులో నిలబెడతారా…? మీ రాజకీయం తగలెయ్య…!

వెంకన్నా.. మమ్మల్ని క్షమించవయ్యా.... మా అపరాధాన్ని మన్నించు... నిన్ను బోనులో నిలబెట్టి నీ ప్రసాదానికి రాజకీయ రంగు పులిమి, నీ ప్రతిష్ఠను రోడ్డుకు లాగిన వారిని భరిస్తున్న మమ్మల్ని క్షమించు స్వామి...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 26, 2024 | 11:54 AMLast Updated on: Sep 26, 2024 | 11:57 AM

Cheap Politics On Lord Balaji In Andhrapradesh

వెంకన్నా.. మమ్మల్ని క్షమించవయ్యా…. మా అపరాధాన్ని మన్నించు… నిన్ను బోనులో నిలబెట్టి నీ ప్రసాదానికి రాజకీయ రంగు పులిమి, నీ ప్రతిష్ఠను రోడ్డుకు లాగిన వారిని భరిస్తున్న మమ్మల్ని క్షమించు స్వామి… రాజకీయ చదరంగంలో నిన్నే పావుగా మార్చిన వారిని నువ్వెలా మన్నిస్తున్నావో కానీ నీ భక్తులు మాత్రం సహించలేకపోతున్నారు.

తిరుమల లడ్డు… ఇప్పుడిది జాతీయస్థాయి వివాదం… నెయ్యిలో కల్తీపై చంద్రబాబు అనాలోచితంగానో లేక వ్యూహాత్మకంగానో చేసిన కామెంట్ దేశవ్యాప్తంగా పెను వివాదమై కూర్చుంది. అది చల్లారకుండా అగ్నికి ఆజ్యం… అదేనండి ఆ వివాదంలో స్వచ్ఛమైన నెయ్యి పోసి మరీ రోజూ రగులుస్తున్నారు. అసలు ఇంతకీ తప్పు చేసిందెవరు…? శిక్ష ఎవరికి వేస్తున్నారు…? ఆ దేవదేవుడే తప్పుచేశాడా…? లేక భక్తులు తప్పుచేశారా…? తప్పు చేసింది మీరు.. రాజకీయం చేసింది మీరు… కానీ శిక్ష మాత్రం మాత్రం దేవుడికీ భక్తులకా…?

సంప్రోక్షణ, ప్రాయశ్చితం, ప్రమాణం అంటూ నేతలు పండిస్తున్న సెంటిమెంట్ చూస్తుంటే వీళ్లకు ఒకటి కాదు ఒక్కొక్కరికి వంద ఆస్కార్‌లు ఇవ్వాలనిపిస్తోంది. మన నేతలకు రాజకీయం నేర్పడం అంటే తాతకు దగ్గులు నేర్పడమే… కానీ అంతో ఇంతో దేవుడంటే మాత్రం కాస్తో కూస్తో భయం ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా కలియుగ ప్రత్యక్ష దైవంతో ఆటలు మొదలుపెట్టారు. ఏడుకొండలవాడి ప్రసాదాన్నే పొలిటికల్ బుల్లెట్ గా వాడారు. ఇది రాజకీయ లబ్ది కోసం జరిగిన ప్రయత్నమని అందరికీ తెలుసు… ఓ ఆలయంలో జరిగిన తప్పు ఇప్పుడు జాతీయ స్థాయి అంశమైపోయింది. అలా అయ్యేలా చేశారు. భక్తుల మనోభావాలతో ముడిపడ్డ అంశం కావడంతో దావానలంలా పాకిపోయింది. ఆవునెయ్యి కంటే పందికొవ్వు రేటెక్కువ అంటూ కొవ్వు పట్టిన మాటలు మాట్లాడటం కూడా వివాదం చల్లారకుండా బతికిస్తోంది.

ఆలయ సంప్రోక్షణ అంటారొకరు.. ప్రాయశ్చిత దీక్ష అంటారు మరొకరు… నేను ప్రమాణం చేస్తా ఏ తప్పూ జరగలేదని అంటారు మరొకరు.. కోర్టును ఆశ్రయిస్తారు మరొకరు… ఎవరు చెబుతున్నది రైటో, ఎవరిది రాంగో ఎవరికీ తెలియదు, భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారో లేదో తెలియదు… కలిపినా ఇప్పుడు దాన్ని నిరూపించడం కష్టం… అనుమానాలు రేకెత్తించడం మినహా మరేం చేయలేం… ఈ సంగతి పార్టీలకూ తెలుసు. కానీ జనంలో మాత్రం అనుమానం రేపారు. ఓ పార్టీకి ఇది రాజకీయ అస్త్రం… మరో పార్టీ రాజకీయ భవిష్యత్తుకి ఇది జీవన్మరణం… అందుకే రెండు పార్టీలు శాయశక్తులూ ఒడ్డుతూ స్వామి వారిని యథాశక్తి రాజకీయంగా వాడేస్తున్నారు, అనవసరంగా వివాదంలో తననెందుకు లాగారో ఆ దేవదేవుడికి కూడా అర్థం కావడం లేదు.

సంప్రోక్షణ దేనికి…? తప్పు చేసిందెవరు…? ప్రజలు తప్పు చేశారా…? లేక దేవుడే తప్పు చేశాడా…? ఏమిటీ డ్రామా…? నిజానికి లడ్డూ కల్తీ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. ల్యాబ్ రిపోర్టులు ఆధారంగా చూపుతోంది. అయితే ఆ ఆవునెయ్యి మీ హయాంలోనే వచ్చింది కాబట్టి మాకేం సంబంధం అంటోంది వైసీపీ. ఇప్పుడు వచ్చిన నెయ్యిలో కల్తీ జరిగింది కాబట్టి మేమేం తప్పుచేయేలదన్నది ఆ పార్టీ వాదన. మా టైమ్ లో అంతా సరిగ్గానే జరిగిందంటోంది. వైసీపీది తప్పని నిరూపించడానికి ఇప్పుడు ఆధారాలు దొరకవని టీడీపీకి తెలుసు. నిజంగా ఆధారాలు ఉంటే ఈపాటికీ అరెస్టులు జరిగి ఉండేవి. కానీ రాజకీయంగా అస్త్రంగా పనికి వస్తుంది కాబట్టి దాన్ని వాడుకుంది. కిలో నెయ్యి 310రూపాయలకే ఇస్తానంటే ఎలా నమ్మారని టీడీపీ అడిగిన ప్రశ్న… జనంలోకి వెళ్లిపోయింది. వైసీపీకి కూడా తమది తప్పని ప్రభుత్వం నిరూపించలేదని తెలుసు. కానీ టీడీపీ సంధించిన ఈ బాణం ఏం మాత్రం తేడా వచ్చినా తనను రాజకీయంగా సమాధి చేస్తుందని భయం. అందుకే తమ తప్పేం లేదని నిరూపించుకోవడానికి తంటాలు పడుతోంది. పైగా వైసీపీ హయాంలో లడ్డూ క్వాలిటీ పడిపోయిందన్నది వాళ్లూ కూడా కాదనలేని వాస్తవం. గుమగుమలాడే లడ్డు రెండ్రోజులకే పాచిపోయిన లడ్డులా మారిపోయింది. రంగు, రుచి, వాసన ఏమీ లేదు. అందుకే టీడీపీ చేస్తున్న ఆరోపణలు నిజమని స్పష్టంగా తెలియకపోయినా జనం మనస్సులో ఏదో అనుమానం, అందుకే వైసీపీ అంత భయపడుతోంది. ఈ వివాదం త్వరగా తేలదు… తేల్చరు… తేల్చనివ్వరు కూడా… మరో కొత్త అంశం దొరికే వరకూ ఈ వివాదం వారికి లడ్డూ లాంటిదే…

ఇంతకీ లడ్డూలో కల్తీ ఎవరు చేశారు…? జనం చేశారా…? అసలు సనాతన ధర్మం ఎక్కడ దారి తప్పింది…? నిజం చెప్పాలంటే జనం బాగానే ఉన్నారు. దేవుడ్ని నమ్మారు.. నమ్ముతున్నారు… నమ్ముతూనే ఉంటారు. లడ్డూలో ఏదో కలిసిందన్నా అయ్యో అన్నారు తప్ప దాన్ని దూరంగా ఉంచలేదు. ఇంకా చెప్పాలంటూ లడ్డూ అమ్మకాలు పెరిగాయి. కొందరు వ్యక్తులు చేసిన తప్పుతో సనాతన ధర్మం దారి తప్పిందనడం తప్పు. అది మన సంస్కృతితో ముడిపడ్డ అంశం. దాన్ని ఇలాంటి రాజకీయ వివాదాలు ఏమీ చేయలేవు. ఒక్క వివాదానికే మన సనాతన ధర్మం దారి తప్పిందని చెప్పడమంటే మన ఆత్మ మనలో లేదని చెప్పడమే.

ఇక్కడ చెప్పాల్సిన విషయం దేవుడితో ఆడుకున్నది భక్తులు కాదు.. కొందరు వ్యక్తులు..అది ఎవరైనా సరే… కానీ శిక్ష అనుభవిస్తోంది మాత్రం భక్తులు. దేవదేవుడ్నే బోనులో నిలబెట్టడాన్ని భరించలేకపోతున్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారు తమ రాజకీయ పబ్బం గడుపుకున్న వారు బాగానే ఉన్నారు. మరో రాజకీయ అంశం దొరికితే దీన్ని వదిలేసి దానివైపు వెళ్లిపోతారు, మళ్లీ ఏ ఎన్నికల నాటికో మళ్లీ ఈ అంశాన్ని బయటకు తీస్తారు.

తప్పు జరిగితే దాన్ని నిరూపించాలి. నేరస్తులను శిక్షించాలి. కానీ అలా కాకుండా అనవసరంగా తనతో ఆటలు ఆడితే మాత్రం ఆ గోవిందుడు వదలడు. ఆయన భక్తులకు మాత్రమే కొంగు బంగారం… అక్రమార్కులకు కాదు…