NEGGEDEVARU – GUDIVADA : గుడివాడలో కొడాలి నానికి తిరుగులేదా ? రాము ఈసారి టఫ్ ఫైట్ ఇచ్చారా?

టీడీపీ (TDP) ఖచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టుకున్న నియోజకవర్గాల్లో గుడివాడ ముందు వరుసలో ఉంది. 2004లో టీడీపీ తరపున మొదటిసారి పోటీ చేసి... గెలిచారు కొడాలి నాని. 2009లో కూడా రెండోసారి టీడీపీ తరపున గెలిచినా... తర్వాత వైసీపీ (YSRCP) లో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారు. గుడివాడ నుంచి వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగన్ మంత్రి వర్గంలో మూడేళ్ళు మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం, చంద్రబాబుపై దూకుడుగా వ్యవహరించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 27, 2024 | 04:45 PMLast Updated on: May 27, 2024 | 4:45 PM

Did Not Kodali Turn To Me In Gudivada Ramu Gave A Tough Fight This Time

 

 

నాలుగు సార్లు గెలిచిన మాజీ మంత్రి కొడాలి (Kodali) నానిని మట్టి కరిపించడమే టీడీపీ లక్ష్యమా? తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కి గుడివాడ టార్గెట్‌ కావడానికి కారణాలేంటి ? ఇవే చివరి ఎన్నికలంటున్న వైసీపీ (YCP) నేత నాని…నియోజకవర్గంలో మరోసారి పట్టు నిలబెట్టుకుంటారా ? సంక్షేమ పథకాలు అధికార పార్టీకి కలిసి వస్తాయా? భారీగా బెట్టింగ్‌ జరుగుతున్న నియోజకవర్గాల్లో…టాప్‌ లిస్టులో ఉన్న గుడివాడలో నెగ్గేదెవరు ?

టీడీపీ (TDP) ఖచ్చితంగా గెలవాలని టార్గెట్ పెట్టుకున్న నియోజకవర్గాల్లో గుడివాడ ముందు వరుసలో ఉంది. 2004లో టీడీపీ తరపున మొదటిసారి పోటీ చేసి… గెలిచారు కొడాలి నాని. 2009లో కూడా రెండోసారి టీడీపీ తరపున గెలిచినా… తర్వాత వైసీపీ (YSRCP) లో చేరారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున విజయం సాధించారు. గుడివాడ నుంచి వరుసగా నాలుగు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. జగన్ మంత్రి వర్గంలో మూడేళ్ళు మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష తెలుగుదేశం, చంద్రబాబుపై దూకుడుగా వ్యవహరించారు. తూటాల్లాంటి మాటలతో ప్రత్యర్థులను ఊచకోత కోశారు. టీడీపీని ఇరుకున పెడుతున్న వైసీపీ నేతల్లో కొడాలి నాని మొదటి వరుసలో ఉన్నారు. దీంతో టీడీపీ మోస్ట్ వాంటెడ్ లిస్టులో గుడివాడ ఉంది. ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేయటం ద్వారా కొడాలికి ఓటమి అంటే చూపించాలని …టీడీపీ అధిష్టానం తహతహలాడుతోంది. అందులో భాగంగా ఆర్థిక, కుల సమీకరణలు లెక్కలు వేసుకున్న తర్వాత వెనిగండ్ల రామును బరిలోకి దింపింది.

2019 ఎన్నికలతో పోల్చితే 2024 ఎన్నికల్లో గుడివాడలో పోలింగ్ భారీగా నమోదైంది. 2019లో 79 శాతం పోలింగ్ జరిగితే… ఈసారి 82.51 శాతం నమోదైంది. 2019లో 2 లక్షల 8 వేల మంది ఓటర్లు ఉంటే… లక్షా 64 వేల ఓట్లు పోలయ్యాయి. 11.8 ఎక్కువ ఓట్లు పోలవటంతో కొడాలి నాని విజయం సాధించారు. 2024లో 2 లక్షల 4 వేల మంది ఓటర్లు ఉంటే… 1 లక్షా 68 వేల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మగవాళ్ళ కంటే మహిళలే పెద్ద సంఖ్యలో ఓట్లేశారు. ఓట్ల శాతం కూడా గతంలో కంటే ఎక్కువగా నమోదైంది. మహిళల ఓట్లు పెరగటం తమకు కలిసొస్తుందని వైసీపీ, ఓట్ల శాతం పెరగటం తమకు బెనిఫిట్ అని టీడీపీ అంచనాలు వేస్తున్నాయి. ఈసారి గుడివాడలో గెలవటం…అటు టీడీపీకి ఇటు వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపుతో రాజకీయాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని కొడాలి నాని భావిస్తుంటే…ఆయన్ను ఓడించాలనే టీడీపీ చిరకాల కల అలానే మిగిలిపోతుందని ఆ పార్టీ భావిస్తోంది.

కొడాలి నాని 2004 నుంచి 2009 వరకు టీడీపీలో, 2014 , 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసినా గుడివాడలో ఫలితం మాత్రం మారలేదు. అన్నిసార్లు కొడాలి నాని గెలవటమే కామన్ గా వచ్చిన రిజల్ట్. ఒక దశలో కొడాలి నానిని ఓడించగలమా అనే డైలమాలోకి టీడీపీ వచ్చేసిందనే టాక్ కూడా నడిచింది. ప్రతి ఎన్నికల్లో నాని ప్రత్యర్థి మారటమే ఆయనకు కలిసొచ్చే ప్రధాన అంశం. కొత్త వాళ్లు వచ్చి ఎన్నికలకు సిద్ధమయ్యే లోపుగానే ఎన్నికలు పూర్తవటంతో కొడాలి నాని గెలుపు నల్లేరు మీద నడకగా మారింది. 2024లో టీడీపీ గుడివాడలో ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలనే ఉద్దేశంతో వెనిగండ్ల రామును…రెండేళ్ళ ముందుగానే నియోజకవర్గానికి పంపింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాము, ఎస్సీ వర్గానికి చెందిన మహిళను పెళ్ళి చేసుకున్నారు. దీంతో ఇది కొంత వరకు రాముకు కలిసొచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ లెక్కలు వేస్తోంది. వెనిగండ్ల ట్రస్ట్ పేరిట రాము…నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తర్వాత టీడీపీ కార్యక్రమాలను కూడా నియోజకవర్గంలోని జనంలోకి తీసుకు వెళ్ళేలా చేశారు. కొడాలి నాని మంత్రిగా పనిచేసినా నియోజకవర్గాన్ని అభివృధ్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి.

వెనిగండ్ల రాము… చర్చిలు, మసీదులకు విరాళాలు ఇస్తూ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నించారు. నానిపై విమర్శల చేయటం కంటే నియోజకవర్గంలో…తాను ఎలా బలపడాలన్న దానిపైనే ఫోకస్ చేశారు. మంత్రిగా కొడాలి నాని గుడివాడకు ఏం చేయలేదనే అంశం చుట్టూ రాజకీయం నడిపించారు. కొడాలి నానినే గుడివాడ బ్రాండ్. గుడివాడ పేరు చెబితే గుర్తొచ్చేది కొడాలి నానినే. ప్రతి ఎన్నికల్లో ఎవరో ఒకరిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేయించి కోట్లు కుమ్మరిస్తారనేది నాని వర్గం చెప్పే మాట. మంత్రిగా నాని గుడివాడలో చేపట్టిన ఇళ్ళు, ఇళ్ళ స్థలాలు, వాటర్ ట్యాంకు, రోడ్ల నిర్మాణం గురించి గుడివాడ వాసులకు తెలుసంటారు ఆయన వర్గీయులు. నాలుగుసార్లు గెలవటమే కాదు స్థానిక ప్రజలకు తల్లో నాలుకగా ఉండే నానికి పోల్ మేనేజ్ మెంట్ పై గట్టి పట్టుంది. ఇక సంక్షేమ ఫథకాల లబ్దిదారులంతా వైసీపీకే ఓటేస్తారనీ… నాని గెలుపుపై నల్లేరు మీద నడకేనని అంటున్నారు. ఐదోసారి పోటీ చేస్తున్న కొడాలి నాని…ఈ ఎన్నికల తర్వాత రిటైర్ అవుతానన్న వ్యాఖ్యలు గెలుపునకు దోహదపడతాయని ఆయన వర్గం చెబుతోంది.

పోలింగ్ ముందు వరకు కొడాలి నాని, వెనిగండ్ల రాము వర్గాల మధ్య ప్రతి విషయంలోనూ నిశిత పరిశీలన కొనసాగింది. చివరికి కొడాలి నాని నామినేషన్ సరిగా లేదని ఫిర్యాదులు… వెనిగండ్ల రాము ఓటర్లకు ప్రత్యేక స్లిప్పులను పంపిణీ చేస్తున్నారనే రచ్చ నడిచింది. గుడివాడ నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపోటములను…డిసైడ్ చేసే వారిలో కాపులు కీ ఫ్యాక్టర్‌. దీంతో నియోజకవర్గంలో ఉన్న కాపు వర్గం ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారనేది కీలకంగా మారింది. పవన్ కళ్యాణ్ గుడివాడలో రోడ్‌ నిర్వహించారు. పెద్ద ఎత్తున ఉన్న యాదవ ఓట్ల కోసం సమావేశాలను గుడివాడలో నిర్వహించారు. వరుసగా నాలుగు ఎన్నికల్లో గెలిచిన కొడాలి నానికి… ప్రతిసారి మెజార్టీలో మార్పులు వచ్చాయే తప్ప గెలుపు మాత్రం ఆయన్నే వరించింది. కొడాలి నాని స్థానికుడు కావటం ఆయనకు కలిసొచ్చే అంశంగా ఉంది. ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము…ఎన్నికల కోసం మాత్రమే వచ్చాడని ఎన్నికల తర్వాత అందుబాటులో ఉండరనే విషయాన్ని వైసీపీ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము వర్గాల మధ్య కుదరని దోస్తీ కూడా..కొడాలి నానికి కలిసి రావొచ్చు. తొలిసారి పోటీకి దిగిన వెనిగండ్ల రాము… ప్రభుత్వ వ్యతిరేక ఓటు, నాని మంత్రిగా విఫలమయ్యారనే అంశాలపై ఆధారపడ్డారు. ఇక పోల్ మేనేజ్ మెంట్ లో ఇద్దరూ బాగానే చేశారనేది లోకల్ టాక్. దీంతో గుడివాడ ఫలితంపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.