AP Politics CM Jagan : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో సీఎం జగన్ చేసిన తప్పులు ఏంటో తెలుసా..?
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ.... జనంలో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతుంది. ఈసారి ఏపీలో ఎవరి ప్రభుత్వం రాబోతుంది.
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరవుతున్న వేళ…. జనంలో రోజురోజుకీ ఆసక్తి పెరుగుతుంది. ఈసారి ఏపీలో ఎవరి ప్రభుత్వం రాబోతుంది. జగన్‌కి మళ్లీ పట్టం కడతారా… లేదంటే సర్కార్‌ని మారుస్తారా అనే చర్చ జనంలో బాగా జరుగుతోంది. దేశంలోనే ఎవ్వరు చేయనంతగా సంక్షేమ పథకాలు అమలు చేసి.. అప్పులు చేసి… జనానికి లక్షల కోట్లు డబ్బులు పంచి.. డబ్బిస్తే చాలు జనం చచ్చినట్లు ఓటేస్తారు అనే బలమైన నమ్మకంతో ఉన్న జగన్‌ను గెలిపిస్తారా, ప్రభుత్వ వ్యతిరేకతనే ఆయుధంగా పెట్టుకొని ఎన్నికలకు దిగుతున్న చంద్రబాబుని మళ్లీ సీఎంను చేస్తారా అన్నది ఆసక్తిగా మారింది. ఐతే ఐదేళ్లలో జగన్ చేసిన కొన్ని దారుణమైన తప్పిదాలు అహంకారపూరిత నిర్ణయాలు.. రేపటి ఎన్నికల్లో ఎన్నికల్లో ఆయన్ని దెబ్బతీసినా.. ఆశ్చర్యం లేదు. అసలు జగన్ చేసిన తప్పులు ఏంటంటే..
తప్పు నంబర్ వన్… పగ ప్రతీకారాల మీదే జగన్ దృష్టి
జగన్ ఐదేళ్ల పాలన పగ ప్రతీకారాలతోనే జరిగింది. తనను జైలుకు పంపడానికి సోనియా, చంద్రబాబే కారణమని బలంగా విశ్వసించే జగన్… అధికారంలోకి రాగానే వేట మొదలుపెట్టారు. చంద్రబాబు ఇంటి పక్కనే కట్టిన ప్రజా వేదికను కూల్చి పడేశారు. జనం సొమ్ముతో కట్టిన నిర్మాణమని తెలిసి కూడా.. అడ్డగోలు నిర్ణయం తీసుకుని అమలు చేశారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలను ఎక్కడెక్కడ ఆపేశారు. జనం సొమ్ము పోయినా పర్వాలేదు.. తన మాటే నెరవేరాలి అనుకున్నారు జగన్. కట్టపై ఉన్న ఇళ్లకు నోటీసులు ఇచ్చే క్రమంలో… చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడమే కాదు, దాదాపు ఆయన్ని ఇంటి నుంచి బయటికి గెంటేసేటంత పని చేశారు. చంద్రబాబు (Chandrababu) హయాంలో అమలు చేసిన అన్ని పనుల టెండర్లను రీకాల్ చేశారు.
టీడీపీ (TDP) నాయకుల్లో ఒక్కొక్కరిపై విడివిడిగా ప్రతీకార దాడులు కొనసాగాయ్. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికి చెందిన మైన్స్ మొత్తాన్ని క్లోజ్ చేయించారు. డైరీ అక్రమాల పేరుతో ధూళిపాల నరేంద్రను లోపలేశారు. అశోక గజపతి రాజు లాంటి వాడిని కూడా వదిలిపెట్టలేదు. వాళ్ల కుటుంబంలో విభేదాలు సృష్టించి.. సింహాచలం నుంచి ఆయన్ను వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. ఇక అయ్యన్నపాత్రుడినినైతే ఒక ఆట ఆడుకున్నారు. రాష్ట్రంలో చిన్న పెద్ద టీడీపీ నాయకుల్ని మొత్తం మీద ఒక వంద మందిని అరెస్ట్ చేసి లోపల వేశారు. ఎవరు నోరెత్తినా.. తన్ని లోపల వేయడమే! తన పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజును (Raghuramakrishna Raja) కూడా అరెస్ట్ చేసి చితక్కొట్టి పంపించారు.
టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Achchennaidu) ను అరెస్ట్ చేశారు. నారాయణ విద్యా సంస్థలను దాదాపు మూసేసే పరిస్థితి తీసుకొచ్చారు. నారాయణపై కూడా కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు. చివరలో చంద్రబాబును కూడా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేసి… 52రోజులు జైల్లో పెట్టారు. పగ ప్రతీకారాలు, కేసులు, జైలు.. ఇలా జగన్ పరిపాలన మొత్తం ఇవే నడిచాయి. పోలీస్ వ్యవస్థ, ఇంటిలిజెన్స్, సీఐడీ, ప్రభుత్వ న్యాయవాదులు మొత్తం రాజకీయ ప్రత్యర్థుల వేటకి ఉపయోగపడ్డారు. ఐదేళ్లు పగ ప్రతీకారాలు తప్ప మరి ఇంకా ఏ కార్యక్రమం విజయవంతంగా జరగలేదు. పోలీసులు చెలరేగిపోయారు. అమరావతి అనే దాన్ని పూర్తిగా నాశనం చేయాలనే లక్ష్యంతోనే పనిచేశారు జగన్. అక్కడ ప్రభుత్వ సేకరించిన భూమిని ఇష్టానుసారంగా చేశారు.
మంగళగిరి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలేలా చేశారు. రియల్ వ్యాపారులంతా సగం నిర్మాణాల్ని అక్కడే వదిలేసి.. హైదరాబాద్ పరారైన పరిస్థితి. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టినా.. చర్చలు జరిపినా.. కేసులు పెట్టి సిఐడి ఆఫీస్ చుట్టూ తిప్పారు. చివరికి పవన్‌లాంటి వాడు విశాఖలో సభ పెట్టుకుంటానంటే… నానా యాగి చేశారు పోలీసులు. పైన జగన్ ఏం చేశాడో… కింద ఎమ్మెల్యేలు నుంచి కార్పొరేటర్ల వరకు ఇదే అప్లయ్ చేశారు.. జిల్లాల్లో, గ్రామాల్లో తమకు నచ్చని వాడి మీద కేసులు పెట్టించడం, చితక్కొట్టించడం… ఇదే పని మీద ఉన్నారు కింది స్థాయి నాయకులు. వీళ్లకు సేవ చేయడానికి మాత్రమే ఐదేళ్లు ఏపీలో పోలీసులు పని చేశారు. ఐదేళ్లు నిత్యం ఏదో ఒక వివాదం, ఏదో ఒక రగడ నడుస్తూనే ఉన్నాయి. ఏపీలో అన్‌రెస్ట్ అనేది సాధారణం అయిపోయింది.