Guntur West Constituency : గుంటూరు జిల్లాలో వెస్ట్ నియోజకవర్గం ఎందుకు అంత హాట్ టాపిక్ అవుతుంది తెలుసా..?
గుంటూరు జిల్లాలో వెస్ట్ నియోజకవర్గం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్.... ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఒకరు లేడీ హీరోగా ఏపీ రాజకీయాల్లో ఉంటే... మరొకరు గృహిణిగా, ఇప్పుడిప్పుడే వ్యాపారవేత్తగా ఎదుగుతున్న మహిళ .... బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో హోరాహోరీగా తలపడుతున్నారు.
గుంటూరు జిల్లాలో వెస్ట్ నియోజకవర్గం ఇప్పుడు అత్యంత హాట్ టాపిక్…. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు ఒకరు లేడీ హీరోగా ఏపీ రాజకీయాల్లో ఉంటే… మరొకరు గృహిణిగా, ఇప్పుడిప్పుడే వ్యాపారవేత్తగా ఎదుగుతున్న మహిళ …. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలు గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో హోరాహోరీగా తలపడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ అండతో తాను గెలిచి తీరుతానని అధికార పార్టీ అభ్యర్థి రజని చెబుతున్నారు. పేద ప్రజలను సంక్షేమ ముసుగులో దోపిడీ చేసిన ప్రభుత్వ నిరంకుశ వైఖరి… తనను గెలిపిస్తుందని ప్రతిపక్ష పార్టీకి చెందిన ఉమ్మడి అభ్యర్థి మాధవి ధీమాగా ఉన్నారు. మరి ఈ నియోజకవర్గంలో గెలిచేది ఎవరు? ఓడేదెవరు! ఆ నియోజక ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు… ఉమ్మడి గుంటూరు జిల్లాలో సెగలు రేపుతున్న పవర్ ఫైట్.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో పశ్చిమ నియోజకవర్గం… చాలా కీలకం. హార్ట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్. జిల్లా రాజకీయాలు మొత్తం…ఇక్కడి నుంచే నడుస్తాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇద్దరు మహిళల మధ్య పోటీ జరుగుతోంది. అధికార పార్టీ నుంచి మంత్రి విడుదల రజిని…చిలుకలూరిపేట నుంచి పశ్చిమ నియోజకవర్గానికి షిఫ్టయ్యారు. టీడీపీ తరపున గల్లా మాధవి ఆలియాస్ పిడుగురాళ్ల మాధవి పోటీలో ఉన్నారు.
గుంటూరు పశ్చిమలో…మొత్తం 2 లక్షల 63 వేల మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు ఇక్కడ ఉంటారు. ఓవైపు క్లాస్…మరోవైపు మాస్…ఓటర్లతో ఇక్కడి రాజకీయం రంజుగా సాగుతుంది. కమ్మ, కాపు, రెడ్డి, ఎస్సీ, బ్రాహ్మణ, మైనార్టీలు, బీసీ ఓటర్లు కలగలిసిన పాలిటిక్స్ ఈ నియోజకవర్గానికి కేరాఫ్. లక్ష్మీపురం, పట్టాభిపురం, విద్యానగర్, కొరిటిపాడు లాంటి ప్రాంతాల్లో క్లాస్ ఓటర్లు ఉంటారు. శ్రీనివాసరావుపేట, కొబాల్ పేట, ఏటి అగ్రహారం, శ్యామల నగర్ ల్లో…మాస్, క్లాస్ ఓటర్లు మిక్స్‌డ్‌గా ఉంటారు. అందుకే ఇక్కడి పాలిటిక్స్ ఎప్పుడు ఒక పట్టాన అర్థం కావు.
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులు గెలిచారు. 2014లో టీడీపీ తరపున మోదుగుల వేణుగోపాల్ రెడ్డి…. వైసీపీ తరపున లేళ్ల అప్పిరెడ్డి పోటీ చేశారు. వేణుగోపాల్‌రెడ్డి…దాదాపు 18వేల ఓట్లతో గెలిచారు. మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి… టీడీపీని వీడటంతో 2019లో మద్దాలి గిరిధర్ రావుకు అవకాశం వచ్చింది. వైసీపీ ప్రభంజనంలోనూ టీడీపీ నుంచి విజయం సాధించారు. టీడీపీ ప్రతిపక్షానికే పరిమితం కావడంతో…. ఆయన కూడా అధికార పార్టీకి మారారు. ఇక్కడి ఓటర్లు ఎప్పుడు ఏకపక్షంగా తీర్పు ఇవ్వట్లేదు. ఎవరు పనులు చేస్తారో తెలుసుకొని…హామీలు తీసుకొని వారినే గెలిపిస్తారు.
గుంటూరు వెస్ట్ నియోజకవర్గం…కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నా.. అభివృద్ధి అంతంత మాత్రమే. 2014లో రాష్ట్ర రాజధాని అని ముద్రపడటంతో…అభివృద్ధి అంతా అమరావతి చుట్టూనే తిరిగింది. అమరావతిని ఆనుకుని ఉన్న గుంటూరులో అనుకున్నంత అభివృద్ధి జరగలేదు. రాజధాని పేరుతో గుంటూరు రోడ్లన్నీ తవ్విపడేశారు అధికారులు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, పాలకవర్గాలు…ఎక్కడా గుంటూరు అభివృద్ధిపై దృష్టి పెట్టలేదు. తవ్వి వదిలేసిన గుంతల రోడ్లు, ఆక్రమిత రహదారులు, గుంటూరు ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. వర్షం కురిస్తే..ఇప్పటికీ అనేక ప్రాంతాలు జలమయం అవుతాయి.
సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. గుంటూరు సిటీలో జనానికి ఆర్‌యుబీలు తీవ్ర ఇబ్బందిగా మారాయి. రైల్వే లైన్ గుంటూరు సిటీ మధ్యలో నుంచి వెళ్తుంది. రైల్వే ట్రాక్ దాటడానికి …ఇప్పటికీ సరైన వ్యవస్థ లేదు. జనానికి సరైన తాగునీరు అందట్లేదు. ఇటీవల డయేరియాతో కొందరు చనిపోగా… గతంలోనూ ఇలాంటివి జరిగాయి. కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పడినా వార్డుల్లో సరైన అభివృద్ధి జరగలేదు. అక్రమాలకు కేరాఫ్‌గా ఉందన్న ఆరోపణలు, తవ్వి వదిలేసిన రోడ్లు కూడా ఈ నియోజకవర్గంలో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి.
ఎలాంటి అంచనాల్లేకుండా టీడీపీ తరపున బరిలోకి దిగారు గల్లా మాధవి.
చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమకి తరలివచ్చిన విడుదల రజిని…తన మార్క్ రాజకీయాలతో ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో, తానేమి చేయగలనో చెబుతున్నారు. క్లాస్, మాస్ ఓటర్లు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో…మాస్ ఓటర్లు కచ్చితంగా వైసీపీ వైపే మొగ్గుచూపించే ఛాన్సుంది. క్లాస్ ఓటర్లను ప్రభావితం కావాలంటే ఆ స్థాయిలో అభివృద్ధి చూపించాలి. విడుదల రజిని ఇంటింటికీ తిరగటం, అపార్ట్‌మెంట్లలో సమావేశాలు నిర్వహణ, కుల పెద్దల్ని కలుసుకుంటూ ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను ఎక్కడి నుంచి వచ్చానన్నది కాదు… గుంటూరులో ఎంత అభివృద్ధి చేస్తానన్నదే అసలు ఎజెండా అంటున్నారు విడుదల రజిని.
టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి… మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగారు. తాను లోకల్ అని…గుంటూరులోనే పుట్టి పెరిగానని చెబుతున్నారు. ప్రజాసేవ కొత్త కాదని… పొలిటికల్ కొత్త ప్లాట్ ఫాంపై జనానికి సేవ చేయడమే లక్ష్యమని చెబుతున్నారు గల్లా మాధవి. సంక్షేమ పథకాల పేరుతో పేదలను మాయ చేస్తున్న ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ హయాంలో జరగని అభివృద్ధిని…రాబోయే రోజుల్లో తాను చేస్తానని గల్లా మాధవి ఓటర్లకు హామీ ఇస్తున్నారు. లోకల్ మహిళ గా ఉన్న తనకు మరొకసారి గుంటూరు పశ్చిమ ప్రజలు పట్టం కడతారని ఉమ్మడి అభ్యర్థి గల్లా మాధవి ప్రచారం చేసుకుంటున్నారు.