HINDUPURAM : హిందూపురంలో బాలయ్యకి… ఈసారి దబిడి దిబిడే

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)... ఈ పేరులోనే వైబ్రేషన్ ఉందంటారు ఫ్యాన్స్‌. రీల్‌ లైఫ్‌ అయినా... రియల్‌ లైఫ్‌ అయినా... బాలయ్య క్రేజే వేరన్నట్టుగా ఉంటుంది వ్యవహారం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 4, 2024 | 10:59 AMLast Updated on: May 04, 2024 | 10:59 AM

For Balayya In Hindupuram This Time Its A Rush

 

సీమలో సమ్మర్‌ సెగలు కక్కుతుంటే.. హిందూపురంలో రాజకీయం అంతకు మించి సెగలు, పొగలు కక్కిస్తోంది. నీ ఇంటికొచ్చా.. నీ నట్టింటికొచ్చానంటూ రీల్‌ లైఫ్‌లో… ఓ రేంజ్ లో డైలాగ్స్ చెప్పే బాలయ్యకు.. హిందూపురంలో చెమటలు పట్టించబోతోందట వైసీపీ(YCP).

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)… ఈ పేరులోనే వైబ్రేషన్ ఉందంటారు ఫ్యాన్స్‌. రీల్‌ లైఫ్‌ అయినా… రియల్‌ లైఫ్‌ అయినా… బాలయ్య క్రేజే వేరన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఇక వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి… ఈ పేరు చెబితే పొలిటికల్ స్క్రీన్ మీద హైపవర్‌ వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి ఇద్దరూ… ఇప్పుడు ఒకే చోట సై అంటే సై సై అనబోతున్నారట. తొడలు కొట్టడాలు.. మీసాలు తిప్పడాల్లో బాలయ్య స్పెషలిస్ట్‌ అయితే… స్పీచ్ లు, పంచులతో ఊర మాస్ ఇమేజ్ తెచ్చుకున్నారు సీఎం జగన్‌. హోరాహోరీగా జరుగుతున్న ఏపీ ఎన్నికల (AP Elections) యుద్ధంలో ఇప్పుడు జగన్‌ చూపు బాలకృష్ణ మీద పడింది.

ఇంతకు ముందెప్పుడూ… ఏ ఎన్నికల్లో కూడా హిందూపురం (Hindupuram) వైపు చూడని జగన్‌… ఫస్ట్ టైమ్ బాలయ్య ఇలాకాలో అడుగుపెట్టబోతున్నారు. వాస్తవంగా వైసీపీ ఈసారి కొన్ని నియోజకవర్గాలను టార్గెట్ గా పెట్టుకుంది. వాటిల్లో కుప్పం, పిఠాపురం(Pithapuram), మంగళగిరి (Mangalagiri) తో పాటు హిందూపురం కూడా ఉంది. పార్టీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో టీడీపీ (TDP) కి ఓటమి అన్నదే లేదు. సాక్షాత్తూ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేసి బలమైన ముద్ర వేశారు. ఆ తర్వాత హరికృష్ణ కూడా హిందూపురం నుంచి విజయం సాధించారు. ఇప్పుడు బాలకృష్ణ సీన్‌లో ఉన్నారు. మధ్యలో పార్టీ తరపున ఇతరులు కూడా గెలిచారు. పోటీలో ఉంది నందమూరి కుటుంబమా? మరొకటా అన్నది కాదు… ఇక్కడి ఓటర్లు అసలు అభ్యర్థి ఎవరన్నది చూడరు. వాళ్ళకు తెలిసిందల్లా సైకిల్‌ గుర్తేనన్నది పొలిటికల్‌ పండిట్స్‌ చెప్పే మాట. అలాంటి పరిస్థితి మారుతున్న సమయంలో తండ్రి, సోదరుని బాటలోనే హిందూపురంలోకి ఎంటరయ్యారు బాలకృష్ణ.

2014 ఎన్నికల్లో భారీ విక్టరీ కొట్టారు. 2019 ఎన్నికల్లో కూడా బాలయ్య విజయం కంటిన్యూ అయింది. రాష్ట్రమంతటా జగన్ వేవ్ ఊపేసిన సమయంలో కూడా… గతం కంటే ఎక్కువ మెజార్టీతో హిందూపురంలో బాలకృష్ణ గెలవడంతో పొలిటికల్‌ పండిట్స్‌ సైతం ఆశ్చర్యపోయారు. దాన్నిబట్టే హిందూపురంలో టీడీపీకి ఎంత బలమైన ముద్ర ఉందో అర్థం చేసుకోవచ్చని అప్పట్లో అనుకున్నారు. ఇప్పుడు సరిగ్గా అదే పాయింట్‌ మీద ఫోకస్‌ చేయబోతున్నారట సీఎం జగన్‌. టీడీపీ కంచుకోటను ఈసారి ఎలాగైనా బద్దలు కొట్టి తీరాలన్న కసితో పావులు కదుపుతోంది వైసీపీ. అందుకే ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ… బీసీ అస్త్రాన్ని కూడా ప్రయోగించారు. బాలకృష్ణని వ్యూహాత్మకంగా దెబ్బతీసేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు.

ఇప్పటికే నియోజకవర్గంలోని దాదాపు అన్ని పంచాయతీలకు వెళ్లి అక్కడ సమస్యలపై ఫోకస్‌ పెట్టారు పెద్దిరెడ్డి. దాదాపు వారం రోజులు హిందూపురంలోనే మకాం వేశారాయన. మరోవైపు అధికార పార్టీ వ్యూహాన్ని గమనించిన బాలకృష్ణ కూడా గతం కంటే ఎక్కువగా నియోజకవర్గం మీద ఫోకస్ పెంచేశారు. బాలయ్యపై ఈసారి మహిళా అభ్యర్థి, స్థానికంగా బలమైన సామాజికవర్గానికి చెందిన కురుబ దీపిక పోటీ చేస్తుండటంతో ఎలాంటి ఛాన్స్ తీసుకోదల్చుకోవడం లేదట. కానీ అధిష్టానం బాలయ్య ఇమేజ్ ను స్టేట్ మొత్తం వాడుకోవాలని భావించింది. అందుకే అన్ని ప్రాంతాల్లో తిప్పుతూ ప్రచారం చేయిస్తోంది. దీంతో హిందూపురంపై ఫోకస్ తగ్గకూడదని తన కుటుంబ సభ్యుల్ని రంగంలోకి దించారు బాలయ్య. ఆయన భార్య వసుంధర ఇప్పటికే నియోజకవర్గమంతా విస్తృతంగా తిరిగి ప్రచారం చేస్తున్నారు.

తాజాగా ఆయన కూతుళ్లు కూడా రంగంలోకి దిగి సెగ్మెంట్‌ని చుట్టేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ కూడా ఏ మాత్రం తగ్గకుండా పావులు కదుపుతుండటంతో హిందూపురం హీట్‌ సమ్మర్‌ సెగలతో పోటీ పడుతోంది.
ఈ క్రమంలోనే సీఎం జగన్‌ టూర్‌ ఆసక్తికరంగా మారింది. ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరుగుతుంటారు జగన్‌. కానీ హిందూపురానికి మాత్రం ఇప్పటి వరకు రాలేదు. ఆ షెడ్యూల్ కూడా రావడంతో… ఇక్కడికొచ్చి ఆయన ఏం మాట్లాడతారు? టీడీపీ మీదే ఫోకస్‌ చేస్తారా? లేక సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా బాలకృష్ణని టార్గెట్‌ చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. హిందూపురంలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ.. వైసీపీ కూడా అదే స్థాయిలో పుంజుకుంది. గతంలో ఇక్కడి వైసీపీ నాయకుల్లో సఖ్యత లేక.. ప్రతిసారి ఓట్లు చీలిపోయి అది టీడీపీకి ప్లస్ అవుతోంది. బాలకృష్ణ వరుస విజయాల వెనక అది కూడా ఓ కారణమన్నది వైసీపీ అంచనా. అందుకే వర్గపోరు మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాదాపు సెట్ చేశారు. ఇంకొంతమంది కాస్త అటు ఇటుగా ఉన్నా.. జగన్ హిందూపురం వస్తే అన్నీ సెట్ అవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.