NEGGEDEVARU PRATTIPADU : తాతతో మనుమరాలు సై.. ప్రత్తిపాడులో ఒకే కుటుంబంలో పోటీ

ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాత మనవరాళ్ళలో గెలిచేదెవరు? ఓటమిలో టీడీపీ (TDP) హ్యాట్రిక్ కొడుతుందా? ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి? సెంటిమెంట్ వర్కౌట్‌ అవుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీకి అభ్యర్థికి సహకరించారా ?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 29, 2024 | 12:35 PMLast Updated on: May 29, 2024 | 12:35 PM

Grandfather And Granddaughter Compete In The Same Family In Sai Prattipadu

 

 

ప్రత్తిపాడు నియోజకవర్గంలో తాత మనవరాళ్ళలో గెలిచేదెవరు? ఓటమిలో టీడీపీ (TDP) హ్యాట్రిక్ కొడుతుందా? ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయి? సెంటిమెంట్ వర్కౌట్‌ అవుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీకి అభ్యర్థికి సహకరించారా ? రెండు పార్టీల నేతలు…ప్రత్యర్థి పార్టీల నేతలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకున్నారా ? ఇంతకీ ప్రత్తిపాడులో నెగ్గేదెవరు?

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఫైట్‌ ఆసక్తికరంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు బరిలో నిలవడంతో ఎవరు గెలుస్తారు ? ఎంత మెజార్టీ వస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది. వైసీపీ (YCP) నుంచి మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, టిడిపి తరపున వరుపుల సత్యప్రభ పోటీ చేస్తున్నారు. ఇద్దరు వరుసకి తాత మనవరాలు అవుతారు. సుబ్బారావు (Subbareddy) గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. సత్యప్రభ భర్త రాజా మరణంతో రాజకీయాల్లోకి వచ్చి తొలిసారి పోటీ చేస్తున్నారు. అయితే వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్‌ని పక్కన పెట్టి… సుబ్బారావుకి అవకాశం ఇచ్చింది. సుబ్బారావు 2014లో వైసీపీ తరఫున ప్రత్తిపాడు నుంచి గెలిచారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీకి జైకొట్టారు.

ఆ తర్వాత ఫ్యాన్‌ కిందకి చేరారు.
2014లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ గెలిచిన నాలుగు సీట్లలో ప్రత్తిపాడు ఒకటి. వైసీపీ ఆవిర్భవించిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ప్రత్తిపాడు ఓటర్లు ఫ్యాన్ పార్టీని ఆదరించారు. టిడిపి వరుసగా రెండుసార్లు ఈ నియోజకవర్గంలో ఓడిపోయింది. గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన మెజారిటీ కేవలం 4 వేల 666 ఓట్లు. జనసేన అభ్యర్థికి వచ్చిన ఓట్లు 6 వేల 907. ఇందులో మరో ట్విస్ట్ ఏంటంటే జనసేన తరపున పోటీ చేసిన వరుపుల తమ్మయ్యబాబు కూడా ఇదే ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 17 వేల 267 ఓట్లు ఉంటే… లక్షా 74 వేల 788 ఓట్లు పోలయ్యాయి. గత మూడు ఎన్నికల్లోనూ పోలింగ్‌ శాతం పెద్దగా పెరగలేదు. 2014లో 79.94 శాతం, 2019లో 80.92 శాతం, 2024లో 80.45 శాతం పోలింగ్ నమోదైంది.

సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రసాద్‌ను పక్కన పెట్టడంతో…ఆయన పార్టీకి పూర్తిగా దూరం జరిగారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావాలని…ప్రత్తిపాడులో గెలవకూడదనే స్లోగన్ ఎంచుకున్నారు. తన అనుచరులు, మద్దతుదారులకు సైకిల్‌ కోసం పని చేయాలని ఇన్ డైరెక్ట్ మెసేజ్ ఇచ్చారు. ఎక్కడా పార్టీ కార్యక్రమాల్లో, ప్రచారంలో పాల్గొనలేదు. ఆయన రాకపోతే తమకే ప్లస్ అవుతుందని…నెగిటివ్ మొత్తం పర్వత ప్రసాద్‌తోనే పోతుందని సుబ్బారావు వర్గం క్లారిటీ ఇచ్చింది. మరోవైపు వైసీపీ తరఫున అన్నీ తానై వ్యవహరించారు ఎమ్మెల్సీ అనంత బాబు. సుబ్బారావు, అనంతబాబు…వరుసకి మామా అల్లుడు అవుతారు. అనంతబాబు తమకు ప్లస్ అవుతాడని వైసీపీ భావిస్తుంటే, గతంలో ఆయనపై ఉన్న కేసులు వల్ల… అది తమకు ప్లస్ అవుతుందని సైకిల్‌ పార్టీ లెక్కలు వేస్తోంది.

మరోవైపు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం…ఇదే నియోజకవర్గం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. ప్రత్తిపాడు నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. ఎన్నికల ముందు ఆయన వైసీపీలో చేరారు. అనంతబాబు జోక్యం ఇక్కడ అవసరం లేదని…నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా చేయాలో తనకు తెలుసంటూ వైసీపీ అభ్యర్థి వరుపుల సుబ్బారావుకి ముద్రగడ క్లారిటీ ఇచ్చారు. అనంతబాబుకీ ముద్రగడకు పెద్దగా సఖ్యత లేదు. కానీ సుబ్బారావు నుంచి ఆశించిన రియాక్షన్ లేకపోవడంతో నియోజకవర్గ రాజకీయాలపై పెద్దగా ఫోకస్ చేయలేదు ముద్రగడ పద్మనాభం. వరుపుల రాజా మరణం తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని టిడిపి భావిస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ వర్గం… తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తే ఆ పార్టీకి మైనస్ అనే చర్చ జరుగుతోంది.

మరోవైపు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అమలాపురం అబ్జర్వర్‌గా ఉన్న ముదునూరి మురళీకృష్ణంరాజు…ఇదే నియోజకవర్గం చెందిన వ్యక్తి. ప్రత్తిపాడులో ఆయన…వైసీపీకి పనిచేయాలని చెప్పారని తెలుగు తమ్ముళ్లు ఆందోళన కూడా చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబుతో లోపాయికారి ఒప్పందం చేసుకుని పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని నిరసన తెలిపారు. వెంటనే ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్లు కూడా వచ్చాయి. టీడీపీలో గ్రూప్ రాజకీయాలు తమకు కలిసి వస్తాయనీ… తమ పార్టీ కోసం పని చేస్తామంటే ఎందుకు వద్దంటామని వైసిపి నుంచి రిప్లై ఇచ్చింది. మొత్తానికి ప్రత్తిపాడులో తాతా మనవరాళ్ళ మధ్య ఆసక్తికర పోరు నడిచిందన్న ప్రచారం జరుగుతోంది. తాత గెలిచి మూడోసారి అసెంబ్లీలోకి అడుగు పెడతారో, మనవరాలు గెలిచి ఫస్ట్ టైమ్ అసెంబ్లీకి వెళ్తారో… తెలియాలంటే వారం రోజులు ఆగాల్సిందే. రెండు వర్గాలు మాత్రం ఎవరు లెక్కలు వారు వేసుకుంటూ… గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. ఎవరి ఈక్వేషన్స్ ఏ మేరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.