GVL Narasimha Rao : జీవిఎల్ నరసింహారావు ఓవర్ యాక్షన్.. తట్టుకోలేకపోతున్న విశాఖ జనం

బీజేపీ ఎంపీ (BJP MP) జీవీఎల్ నర్సింహారావు (GVL Narsimha Rao) కి సెల్ఫ్ ప్రమోషన్ పిచ్చి పీక్స్‌కు చేరింది. బీజేపీ పాలసీకి భిన్నంగా పార్టీ కంటే వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారాయన. అవసరానికి మించి హడావిడి చేసి... విపక్షం కంటే స్వపక్షానికే ఎక్కువగా టార్గెట్‌ అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2024 | 03:20 PMLast Updated on: Jan 27, 2024 | 3:20 PM

Gvl Narasimha Rao Over Action People Of Visakha Who Cant Stand It

బీజేపీ ఎంపీ (BJP MP) జీవీఎల్ నర్సింహారావు (GVL Narsimha Rao) కి సెల్ఫ్ ప్రమోషన్ పిచ్చి పీక్స్‌కు చేరింది. బీజేపీ పాలసీకి భిన్నంగా పార్టీ కంటే వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే పనిలో బిజీగా ఉన్నారాయన. అవసరానికి మించి హడావిడి చేసి… విపక్షం కంటే స్వపక్షానికే ఎక్కువగా టార్గెట్‌ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వ (Central Government) సంస్థల నిధులతో సొంత సోకులు చేసుకుంటున్నారన్న ఆరోపణలు జీవీఎల్ ను ఇరకాటంలో పెట్టాయి.

జీవీఎల్‌ నరసింహారావు… బీజేపీ రాజ్యసభ సభ్యుడు (BJP Rajya Sabha) కేరాఫ్ ఉత్తర ప్రదేశ్. కానీ… ఆయన పొలిటికల్‌ అడుగులు మాత్రం విశాఖ తీరంలోనే పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి ఎంపీగా పోటీచేయాలనేది జీవీఎల్ బలమైన కోరిక.. అందుకే స్టీల్ సిటీలో స్థిరనివాసంతో పాటు క్యాంప్ ఆఫీస్‌ తెరిచారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా వుండే సెటిలర్స్ ఓట్లపై ఫోకస్ పెంచిన జీవీఎల్… ఆ దిశగా కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారట. సామాజిక వర్గాల వారీగా సమావేశాలు పెట్టడం, తూర్పు కాపులు సహా ఐదు ఉత్తరాంధ్ర కులాల బీసీ రిజర్వేషన్ల కోసం ప్రయత్నాలు… ఇలా పరపతి పెంచుకునే పనిలో ఉన్నారు ఎంపీ. అంత వరకు బాగానే ఉన్నా… జీవీఎల్ కి ఈమద్య పబ్లిసిటీ యావ మరీ ఎక్కువైందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడటంతో ప్రతి సందర్భాన్ని పండుగలా చేయడానికి యత్నిస్తున్నారు.

విశాఖ ప్రజలకు సంప్రదాయ సంక్రాంతిని పరిచయం చేసే పేరుతో నాలుగు రోజులు మెగా ఈవెంట్ నిర్వహించారు. తన సొంత డబ్బుతో ఏం చేసుకున్నా ఫర్లేదు గానీ… కేంద్ర ప్రభుత్వ సంస్థల నిధులతో సొంత ప్రచారం ఎలా చేసుకుంటారంటూ ఆయన మీద విమర్శలు మొదలయ్యాయి. ప్రచారంలో తన ఫొటోలు తప్ప ఇంకెవరివీ ఉపయోగించలేదు. దీనికి దాదాపు 5 కోట్ల వరకు ఖర్చయ్యాయని అంచనా. ఈ నిధులన్నీ ఎస్‌బీఐ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సమకూర్చాయి. కార్పొరేట్‌ సోషల్ రెస్పానిసిబిలిటీ కోసం వాడాల్సిన నిధులను… ఓ ఎంపీ వ్యక్తిగత ప్రమోషన్ కోసం కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక లేటెస్ట్ గా రిపబ్లిక్‌ డే సందర్భంగా వైబ్రెంట్‌ వైజాగ్‌ పేరుతో బీచ్‌ రోడ్డులో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులు జరిగే ఈ కార్యక్రమాలకు కూడా భారీగానే నిధులు ఖర్చు చేస్తున్నట్టు తెలిసింది. వాస్తవానికి విశాఖ బీజేపీలో ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు నిర్వహిస్తున్నారు కాబట్టి పార్టీ తరఫున చేస్తున్నారా అంటే ..అదీ లేదు. జీవీఎల్‌ టీమ్‌ అని చెబుతున్నా… నిధులు మాత్రం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తీసుకుంటున్నారనే విమర్శలు పెరిగిపోతున్నాయి. జీవీఎల్‌ బ్రాండింగ్ కోసం జరుగుతున్న ప్రయత్నాలపై సొంత పార్టీలోనే పెదవి విరుపులు కనిపిస్తున్నాయి.

ఏపీలో బీజేపీకి అంతో ఇంతో ఓట్ బ్యాంక్ ఉన్నది విశాఖ పార్లమెంట్ సీటులోనే. దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ రంగ సంస్థల సొమ్ముతో తన పొలిటికల్‌ పునాదుల్ని పటిష్టం చేసుకోవడానికి జీవీఎల్‌ చేస్తున్న ప్రయత్నాలు పార్టీ నాయకులు చాలామందికి నచ్చడం లేదట. అధిష్ఠానం అనుమతితోనే విశాఖ వచ్చానని ఆయన చెప్పడం, ఢిల్లీ పెద్దలు కూడా సహకరించాలని సూచించడంతో అయిష్టంగానే కార్యక్రమాలకు హాజరవుతున్నారట స్థానిక నాయకులు. ఇక్కడి నుంచే పార్టీలో అంతర్గత విభేదాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. విశాఖ ఎంపీ సీటుపై జీవీఎల్ కర్చీఫ్ వేసుకున్నా… పార్టీలో చాలా మంది ముఖ్యులు ఇక్కడ నుంచి పోటీకి ఆసక్తిగా వున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి ఈ సీటు కీలకం.

గతంలో ఆమె ఇక్కడ నుంచి గెలిచారు. అలాగే.. టీడీపీ నుంచి బీజేపీకి వెళ్లి రాజ్యసభ సభ్యులుగా ఉన్న నేతలు కూడా ఈసారి వైజాగ్ రేస్‌లో ఉన్నట్టు తెలిసింది. ఈ దిశగా ఎవరికి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందో తెలియకపోయినా… ఇప్పుడొక కొత్త ఈక్వేషన్ పార్టీలో చర్చకు, అంతర్గత ఎత్తుగడలకు కారణమవుతోంది. అదే బీసీ నాయకత్వానికి ఛాన్స్ అనే వైసీపీ ఆలోచన. విశాఖ ఎంపీ అభ్యర్థిగా బలమైన రాజకీయ కుటుంబం నుంచి బొత్స ఝాన్సీ పేరును ప్రకటించింది వైసీపీ. రెండు సార్లు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన అనుభవం, తూర్పుకాపు కావడం వీటన్నింటి కంటే ఉత్తరాంధ్ర స్థానికత ఆమెకు కలిసొచ్చే అంశాలు. దీంతో టీడీపీ కూడా బీసీ కార్డు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.

యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పేరు పరిశీలనలో ఉందట. సరిగ్గా ఇక్కడి నుంచే బీజేపీలో సీటు పోటీ… కొత్త యాంగిల్ తీసుకున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ఆసక్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. స్థానికుడు, బీసీ, అన్నిటినీ మించి పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి టీమ్ మెంబర్ కావడం… ఇలా అనేక అంశాలు తనకు అనుకూలంగా ఉన్నట్టు భావిస్తున్నారట మాధవ్. జీవీఎల్ నిర్వహిస్తున్న సంబరాలు, వ్యక్తిగత కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారాయన. మరి జీవీఎల్‌ హంగామా ఎన్నికల నాటికి ఆయనకే ఉపయోగపడుతుందా? లేక మరో నేతకా అన్నది చూడాలి.