AMARAVATI REAL BOOM : అమరావతికి రియల్ బూమ్.. హైదరాబాద్ లో ఢమాల్
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టడంతో అమరావతిలో రియల్ బూమ్ ఊహించని విధంగా పుంజుకుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రభుత్వం తిరిగి అధికారం చేపట్టడంతో అమరావతిలో రియల్ బూమ్ ఊహించని విధంగా పుంజుకుంది. ఏపీ కేపిటల్ గా అమరావతిని డెవలప్ చేస్తామని టీడీపీ (TDP) ప్రకటించడంతో… వారం రోజుల్లోనే భూముల రేట్లు వంద శాతం పెరిగాయి. అమరావతిలో రియల్ బూమ్ పెరిగిపోతుండటంతో హైదరాబాద్ లో డమాల్ అవుతుందని అంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10యేళ్ళయినా ఏపీకి ఇప్పటికీ రాజధాని లేదు. చంద్రబాబు హయాంలో అమరావతిని రాజధానిగా ప్రకటించినా… నిర్మాణాలు పూర్తి కాలేదు. వైసీపీ (YCP) వచ్చాక… జగన్ మూడు రాజధానుల పేరుతో ఐదేళ్ళూ జనాన్ని గందరగోళంలో పడేశారు. అమరావతిలో రాజధాని కోసం కేటాయించిన 29 గ్రామాల్లో రియల్ ఎస్టేట్.. జగన్ హయాంలో దారుణంగా పడిపోయింది. కేపిటల్ ఏరియాలో కట్టిన పెద్ద పెద్ద భవనాలు చుట్టూ పిచ్చిమొక్కలు మొలిచాయి. అదే టైమ్ లో హైదరాబాద్ లో అభివృద్ధి ఊపందుకుంది. అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలన్నీ ఇక్కడికి క్యూకట్టడంతో 2021 నుంచి 2024 మధ్యకాలంలో హైదరాబాద్ లో సగటున 45శాతం చొప్పున ప్రాపర్టీ విలువ పెరిగింది. సిటీకి వెస్ట్ సైడ్ లో ఆఫీస్ స్పేస్ బాగా ఉండటంతో అక్కడ 52శాతం భూముల విలువ పెరిగింది. హైదరాబాద్ లో గత మూడేళ్ళల్లో 2 లక్షలకు పైగా కొత్త ఇళ్ళు నిర్మించగా… వాటిల్లో లక్షన్నర దాకా అమ్ముడు పోయాయి.
ఇప్పుడు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఐటీ (IT), ఫార్మా, పారిశ్రామిక (Industrial) సంస్థలకు ఏపీలో ప్రియారిటీ ఇచ్చే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ లో మౌలిక వసతులు పెరగడం, వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడనుంది. పారిశ్రామికవేత్తల్ని ఆకట్టుకోడానికి చంద్రబాబు ప్రభుత్వం రాయితీలు కూడా ప్రకటించనున్నారు. దాంతో ఐటీ సంస్థలు భారీగా స్థాయిలో ఏపీకి క్యూ కడతాయన్న అంచనాలున్నాయి. ఈ పరిస్థితుల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అప్పుడు ఆటోమేటిగ్గా రియల్ ఎస్టేట్ బూమ్ కూడా తారా స్థాయికి చేరుతుందని అనరాక్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. ఏపీలో గత ఐదేళ్ళుగా ఉన్న అనిశ్చితి పరిస్థితులతో చాలా మంది ఏపీకి చెందిన పారిశ్రామికవేత్తలు కూడా హైదరాబాద్ కు వచ్చి పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు వాళ్ళంతా మళ్ళీ ఏపీలోని అమరావతి, విజయవాడ చుట్టుపక్కల ఏరియాలతో పాటు వైజాగ్ కు తరలిపోయే ఛాన్సుంది.
పారిశ్రామిక వేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే… ఆటోమేటిగ్గా హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కి డిమాండ్ తగ్గుతుంది. దీని ప్రభావం రియల్ ఎస్టేట్ పైనా కనిపిస్తుంది. చాలామంది రియల్టర్లు ఇప్పటికే అమరావతి పరిధిలోని 29 గ్రామాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ ని మళ్ళీ స్టార్ట్ చేశారు. దాంతో రేట్లు డబుల్ అయ్యాయి. ఐదేళ్ళ క్రితం ఆగిన సగం సగం కట్టిన ఇళ్ళ నిర్మాణాలను ఇప్పుడు పూర్తి చేయబోతున్నారు. అమరావతి ఏరియాలో నిన్న మొన్నటిదాకా గజం 3 వేల 5 వందల రూపాయలు ఉన్న భూమి ధర ఇప్పుడు 45వేల రూపాయలకు పైగా పలుకుతోంది. గుంటూరు, విజయవాడ నగరాల్లో రియల్ఎస్టేట్ బిజినెస్ పుంజుకుంది. ఈ నెల 1 వరకు డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు 35-40 లక్షల రూపాయల మధ్య ఉండగా.. ఇప్పుడు 50 లక్షలపైగా రేటు ఉన్నాయి.
ఇక, నిర్మాణంలో ఉన్న వాటిని హాట్ కేకుల్లా అమ్మేస్తున్నారు రియల్టర్లు. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలతో రియల్ బూమ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వారంలో ఇసుక విధానంపై బాబు సమీక్ష జరిపితే…మరిన్ని ఇళ్ళ నిర్మాణాలకు అవకాశం ఏర్పడుతుంది. గతంలో హైదరాబాద్ వైపు చూసిన వినియోగదారులు ఇప్పుడు విజయవాడ, గుంటూరు పరిసరాల్లోనే భూములు, ఫ్లాట్స్ కొంటున్నారు. అమరావతి ఎఫెక్ట్ తో హైదరాబాద్ లో పూర్తిగా ధరలు పడిపోకిపోయినా… రేట్లు మాత్రం బాగా తగ్గుతాయని అంటున్నారు.