PAVAN KALYAN : ఏపీ పొలిటికల్ మూవీలో… పవన్ కళ్యాణ్ రియల్ హీరో
పవన్ కళ్యాణ్ టెన్త్ ఫెయిల్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ కి పెద్దగా యాక్షన్ రాదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న పేరు చెప్పుకొని స్టార్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ కి మూడు పెళ్లిళ్లు. ముగ్గురు పెళ్ళాలు. పవన్ కళ్యాణ్ కి ఏ విషయం మీద అవగాహన లేదు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతాడో ఎవరికీ అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అతను అమ్ముడుపోయాడు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు.
పవన్ కళ్యాణ్ టెన్త్ ఫెయిల్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ కి పెద్దగా యాక్షన్ రాదు. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న పేరు చెప్పుకొని స్టార్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ కి మూడు పెళ్లిళ్లు. ముగ్గురు పెళ్ళాలు. పవన్ కళ్యాణ్ కి ఏ విషయం మీద అవగాహన లేదు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతాడో ఎవరికీ అర్థం కాదు. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అతను అమ్ముడుపోయాడు. పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు ఇష్టం లేని వాళ్ళు.. అతని వ్యతిరేకించే వాళ్ళు , అభిమానించే వాళ్ళు… ఎవరి ఇష్టమైనటువంటి వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్డీఏ సర్కార్ అంటూ ఏర్పడితే అది పవన్ కళ్యాణ్ బిక్ష మాత్రమే అని తెలుసా? పవన్ కళ్యాణ్ త్యాగం వల్లనే రేపు ఏపీలో ఎన్డీఏ సర్కార్ ఏర్పడుతుంది. పవన్ కళ్యాణ్ టిడిపిని మరోసారి బతికించాడు. చావుకి దగ్గరలో ఉన్న ఆ పార్టీకి ప్రాణం పోశాడు ఇది పచ్చి నిజం. పవన్ కళ్యాణ్ నిజమైన హీరో.. అసలులైన కథానాయకుడు అనే విషయాన్ని 2024 ఎన్నికల ఫలితాలు నిజం చేయబోతున్నాయి.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా, రాజకీయంగా కొందరికి నచ్చొచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తాను రాజకీయంగా నష్టపోతూ.. మరో పార్టీకి జీవం పోసాడు. అంతేకాదు రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చాడు. పార్టీ పెట్టే ప్రతివాడు తాను ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు షర్మిల, చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరి లక్ష్యం ముఖ్యమంత్రి కావడమే. పవన్ కళ్యాణ్ కూడా అందుకు అతీతుడేం కాదు ఆయన లక్ష్యం కూడా అదే. కానీ అంతకుమించిన టార్గెట్.. జగన్మోహన్ రెడ్డిని అధికారంలో నుంచి దించడం. అందుకోసం తన పార్టీని, తన లక్ష్యాన్ని ఫణంగా పెట్టాడు పవన్. పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ప్రయాణించడం ఆయన ఫ్యాన్స్ లో చాలామందికి ఇష్టం లేదు.
జనానికి చాలామందికి ఇష్టం లేదు. కానీ ఇవన్నీ పక్కన పెట్టాడు ఆయన. సింగిల్ టార్గెట్ గా వెళ్ళాడు. తన నిర్ణయం వలన టిడిపి బాగుపడుతుందని తెలుసు. ఆ పార్టీకే మేలు జరుగుతుందని విషయం తెలుసు. అయినా కూడా కర్తవ్యం ముందు… తనకు జరిగే లాభం తగ్గినా పరవాలేదు అనుకున్నాడు. కొన్నేళ్ల క్రితం ముఖ్యంగా 2019 ఎన్నికల తర్వాత కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ పై కత్తి కట్టింది. సోషల్ మీడియాలో, కొన్ని సాటిలైట్ ఛానల్లో కుట్రపూరితంగా పవన్ కళ్యాణ్ ను ఎన్ని రకాలుగా అవమానించాలో అన్ని రకాలుగా అవమానించారు. కత్తి మహేష్, శ్రీ రెడ్డి లాంటి వాళ్లను పవన్ పైకి ఉసిగొల్పారు. పవన్ నీ నానా యాగి చేశారు. ఇవన్నీ గుర్తున్నా కూడా కేవలం వైసీపీని అధికారం నుంచి దించాలి… తన శక్తి సామర్ధ్యాలు ఏంటో చూపించాలి అన్న సింగిల్ టార్గెట్ తో పవన్ టిడిపితో పొత్తు పెట్టుకున్నారు. నిజానికి కాపు సామాజిక వర్గం ..కమ్మ సామాజిక వర్గాన్ని ఆమోదించదు.
ఆ రెండు సామాజిక వర్గాల మధ్య ఆంధ్రప్రదేశ్ లో దశాబ్దాలుగా వైరం కొనసాగుతూనే ఉంది. అది రంగా హత్య తర్వాత ఇంకా ఎక్కువ పెరిగింది. ఇవన్నీ తెలిసి కూడా పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తుకు వెళ్లారు. సొంత సామాజిక వర్గం వాళ్లే పవన్ ను తిట్టి పోశారు. అమ్ముడు పోయావన్నారు. ఇక వైసిపి అయితే ఆయనకి ప్యాకేజీ స్టార్ అని టైటిల్ కూడా ఇచ్చింది. 2014, 2019 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్.. టిడిపి దగ్గర డబ్బు తిన్నాడని ఇప్పటికీ ప్రచారం జరుగుతూనే ఉంది. ఇన్ని అవమానాలు ఎదుర్కొని కూడా కేవలం జగన్మోహన్ రెడ్డిని పవర్ నుంచి దించాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో పని చేశాడు పవన్ కళ్యాణ్. మొదట 24 సీట్లకు ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎన్డీఏ కూటమి లెక్కల్లో మూడు సీట్లు పోయాయి. చివరికి 21 సీట్లకు జనసేన ను పరిమితం చేసుకున్నాడు.
సరైన అభ్యర్థుల దొరక్క టిడిపి నుంచి వచ్చిన వాళ్లకు జనసేనలో సీట్లు ఇచ్చాడు. అక్కడా అవమానమే. అయినా భరించాడు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అంటూ ఎన్నికలకు ముందే లోకేష్ లాంటి వాళ్లు ప్రకటించి అవమానించినా సహించాడు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో సగానికి పైగా రాష్ట్రం మొత్తం చుట్టి వచ్చాడు. తన 21 సీట్లలోనే ప్రచారం చేసుకోలేదు. టిడిపి, బిజెపి పోటీ చేస్తున్న స్థానాల్లోనూ ప్రచారం చేశాడు. అన్నిటికన్నా పవన్ కళ్యాణ్ చేసిన గొప్ప కసరత్తు బిజెపిని ఒప్పించి టిడిపిని తిరిగి ఎన్డీఏలోకి చేర్చుకునేటట్లు చేయడం. ఆ విషయంలో కమ్మ సామాజిక వర్గం, టిడిపి.. పవన్ కళ్యాణ్ కి ఎప్పటికీ రుణపడి ఉంటాయి.
2019లో చంద్రబాబు చేసిన ఓవరాక్షన్ కి, అతి ప్రేలాపనకి నిజానికి టిడిపిని ఎన్డీఏలో చేర్చుకోకూడదు. కేవలం పవన్ కళ్యాణ్ కృషివల్లే తిరిగి టిడిపి… ఎన్డీఏ లో కొచ్చి రాజకీయంగా రక్షణ పొందింది. లేకపోతే ఆ పార్టీ పూర్తిగా మట్టిలో కలిసిపోయింది. పవన్ ఇన్ని త్యాగాలు చేసింది కేవలం జగన్ అనే వ్యక్తిని రాజకీయంగా అడ్డుకోవడానికి మాత్రమే. కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని వైసీపీ నేతలు సోషల్ మీడియాలోనూ, సొంత ఛానల్లోనూ నానా యాగీ చేశారు. తన పార్టీ నేతలు, సొంత చెల్లెలు కుటుంబ వ్యవహారాలు అన్ని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ నిత్యం మూడు పెళ్లిళ్లు అంటూ అల్లరి చేస్తూనే ఉన్నారు. రాంగోపాల్ వర్మ లాంటి వాళ్లు పవన్ కళ్యాణ్ ని వెక్కిరిస్తూ చిల్లర సినిమాలు తీశారు.
జగన్ ఏకైక లక్ష్యం పవన్ కళ్యాణ్.. చంద్రబాబు కలవకూడదు. వాళ్ళిద్దరూ కలిస్తే తనకు రాజకీయంగా ముప్పు. అందుకే ఒక్క సీటు కూడా లేని పవన్ కళ్యాణ్ ని నిత్యం తిడుతూ ఉండేవాడు జగన్. పవన్ ని టిడిపి తో కలవకుండా అల్టిమేట్ మైండ్ గేమ్ ప్లే చేసింది వైసిపి. ఈ దెబ్బకి మరొకరైతే కచ్చితంగా రాజకీయాల నుంచి పారిపోయేవాడు. కానీ పవన్ అన్నిటినీ ఓపిగ్గా సహిస్తూ… తన టార్గెట్ దిశగా ప్రయాణం చేశారు. ఈ ఎన్నికల్లో కనీసం 125 నియోజకవర్గాల్లో జనసేన, పవన్ కళ్యాణ్ ప్రభావం చూపించగలిగాడు. అతన్ని తిట్టుకున్నా… శాపనార్ధాలు పెట్టుకున్నా… చివరికి కాపుల్లో ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ వెంటే నడిచారు. ఈసారి ఎన్డీఏకి అది పెద్ద అడ్వాంటేజ్. అంతేకాదు పవన్ కళ్యాణ్ ని నిత్యం తిట్టిపోసిన కాపు వైసీపీ నేతలకు ఈసారి భారీగా గుణపాఠం నేర్పించబోతున్నారు జనం.
ఈ ఎన్నికల్లో టిడిపి గెలవకపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు కచ్చితంగా ఆ పార్టీ అంతర్దానం అయిపోతుంది. చంద్రబాబు వృద్ధాప్యం… లోకేష్ చేతకానితనం ఆ పార్టీని కునారిల్లిపోయేటట్లు చేసింది. ఈ ఎన్నికల్లో టిడిపి గెలిస్తేనే తిరిగి బతికి బట్ట కడుతుంది. అది కేవలం పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే జరిగింది. గోదావరి జిల్లాలో కానీ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ నెల్లూరు ప్రకాశం, చిత్తూరు జిల్లాలోనూ జనసేన పవన్ కళ్యాణ్ ప్రభావం బాగా పని చేసింది. ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 5వేల నుంచి పదివేల ఓట్లు పవన్ కళ్యాణ్ వల్ల ఎన్డీఏ పార్టీలకు వచ్చాయి. ఇవే గెలుపు ఓటములను నిర్ణయించాయి. పవన్ వ్యూహం జనసేన, బిజెపి కంటే టిడిపికే ఎక్కువ ఉపయోగపడింది.
టిడిపి, కమ్మ సామాజిక వర్గంలో చాలామంది పవన్ కళ్యాణ్ తన అవసరానికే వచ్చి కలిసాడని, కూటమి కట్టాడని, అతనికి సొంతంగా పార్టీ నడిపే శక్తి లేదు కనుక టిడిపి తో పొత్తు పెట్టుకున్నాడని, ఇలా రకరకాలుగా చౌకబారు మాటలు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు. అలా పొత్తు పెట్టుకోవాల్సి వస్తే… పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వైపే వెళ్లేవాడు కదా. లేదా కేవలం బిజెపితో మాత్రమే కలిసి పోటీ చేసేవాడు కదా. కానీ ఓటు చీలిపోకూడదు, ఎన్నికల్లో రెండే వర్గాలు ఉండాలి అనే బలమైన లక్ష్యంతో పవన్ తాను తగ్గి… అందరినీ గెలిపించాడు. ఇప్పుడు టిడిపితో పొత్తు పెట్టుకుని తన రాజకీయ భవిష్యత్తును కూడా గందర గోళంలో పెట్టుకున్నాడు పవన్. రేపు జనసేన భవిష్యత్తు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. అయినా కూడా తక్షణ కర్తవ్యం జగన్ని గద్దె దించడం అనే లక్ష్యానికి కట్టుబడ్డాడు పవన్. తాను ముఖ్యమంత్రి కాలేడు, డిప్యూటీ సీఎం వచ్చినా తీసుకోడు. అసలు తాను ముఖ్యమంత్రి ఎప్పటికి అవుతాడో తెలియదు.
పవన్ కళ్యాణ్ నీ ఓ పిచ్చోడు, రాజకీయ వ్యూహం లేనోడు, వ్యవస్థ లేని వాడు అని రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు జనం. ఈ వాదనలు అన్నింటిరనీ పక్కన పెట్టాడు పవన్ కళ్యాణ్. గొప్ప చదువుకున్నవాడు కాకపోవచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ వ్యూహకర్త కాకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి లాంటి బలగం ఉన్న నాయకుడు కాకపోవచ్చు కానీ ఒక లక్ష్యాన్ని ఎంచుకొని దాన్నే నమ్ముకుని లాభనష్టాలను అంచనా వేసుకోకుండా పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో ఏర్పడడానికి కారణమవుతోంది. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక టిడిపి పవన్ కళ్యాణ్ తో ఎలా వ్యవహరిస్తుందో అందరికీ డౌటే. ఎప్పటిలాగే చంద్రబాబు వాడుకొని వదిలేసే తన స్టైల్ ఆఫ్ స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ మీద ప్రయోగించినా ఆశ్చర్యం లేదు. కానీ ఈరోజుకి టిడిపిని, బిజెపిని ఏపీలో బతికించిన ఘనత మాత్రం పవన్ కళ్యాణ్ ది. అతని ఫ్యాన్స్ అతన్ని దేవుడిగా సంబోధిస్తారు. అది నిజమో అబద్దమో కానీ టిడిపి పాలిట మాత్రం పవన్ కళ్యాణ్ నిజంగా దేవుడు. ఏపీ పొలిటికల్ మల్టీస్టారర్ సినిమాలో పవన్ కళ్యాణ్ అసలైన హీరో. విజేత సినిమాలో హీరో చిరంజీవి తన కిడ్నీ అమ్మి ఫ్యామిలీని బతికించినట్లుగా, తన పార్టీని, వ్యక్తిత్వాన్ని ఫణంగా గా పెట్టి ఏపీలో ఎన్డీఏ సర్కార్ ని తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్.