Janasena : జనసేనలోకి పెరిగిన వలసలు.. పవన్ 60సీట్లు డిమాండ్ చేస్తారా ?
గత కొన్ని రోజులుగా జనసేనలోకి వలసలు పెరిగాయి. వైసీపీని వీడే నేతలతో పాటు సినిమా నటులు కూడా పవన్ పార్టీకే జై కొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Assembly Elections) ముందు పార్టీకి గ్లాస్ గుర్తు ఎలాట్ చేయడం, వలస నేతలు పెరుగుతుండటం జనసైనికుల్లో కొత్త జోష్ నింపుతోంది.

Increased migration into Janasena.. Will Pawan demand 60 seats?
గత కొన్ని రోజులుగా జనసేనలోకి వలసలు పెరిగాయి. వైసీపీని వీడే నేతలతో పాటు సినిమా నటులు కూడా పవన్ పార్టీకే జై కొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల (AP Assembly Elections) ముందు పార్టీకి గ్లాస్ గుర్తు ఎలాట్ చేయడం, వలస నేతలు పెరుగుతుండటం జనసైనికుల్లో కొత్త జోష్ నింపుతోంది. ఈనెలాఖరులోపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) తో పాటు మరో సీనియర్ నేత కొణతాల రామకృష్ణ కూడా చేరుతుండటం ఆ పార్టీకి ప్లస్ గా మారుతోంది. అందుకే కూటమిలో భాగంగా పవన్ కల్యాణ్ 60 సీట్లకు పైగా డిమాండ్ చేస్తారన్న టాక్ ఏపీలో నడుస్తోంది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి అధికార పార్టీ వైసీపీని ఓడించడానికి టీడీపీ-జనసేన (TDP-JanaSena) కూటమిగా ఏర్పడ్డాయి. రేపో, మాపో బీజేపీ కూడా జత కలుస్తుందని అంటున్నారు. అయితే టీడీపీ-జనసేనలో ఇంకా సీట్ల సర్దుబాటు కాలేదు. కానీ ఈ టైమ్ లో జనసేనకు ఊహించని విధంగా క్రేజ్ పెరిగింది. పార్టీలోకి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ (Johnny Master) , థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కమెడియన్ పృథ్వీ (Prithvi Raj)… పవన్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఇంకా మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ కూడా ఈనెల 27న జనసేనలో చేరుతున్నారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈనెల 30న పవన్ పార్టీలోకి వస్తున్నారు. ఇంకా వైసీపీ సిట్టింగ్ ఎంపీ బాలశౌరి, గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా గ్లాసు పార్టీకే జై కొడుతున్నారు.
జనసేనలో భారీగా చేరుతున్న ఈ నేతల్లో చాలా మంది వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections) టిక్కెట్లను ఆశిస్తున్నారు. టీడీపీ (TDP) లో అయితే లీడర్లు ఎక్కువగా ఉండటంతో అక్కడ వర్కవుట్ కాదని డిసైడ్ అయ్యారు. అయితే జనసేనకు గతంలో అంతగా బలం లేదు. దాంతో ఆ పార్టీకి 15, 20 సీట్లు ఇస్తే చాలని టీడీపీ భావించింది. ఈ విషయంలో పవన్ కల్యాణ్ కూడా రాజీ పడే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. జనసేన క్రమ క్రమంగా పుంజుకుంటోంది. ఒకప్పుడు ఎన్నికల్లో అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితులు ఉంటే… రాబోయే రోజుల్లో జనసేనలోనూ టిక్కెట్ల కోసం కుస్తీ పోటీలు కూడా జరిగే ఛాన్సుంది. అందుకే టీడీపీ కంటే ఇక్కడైతేనే టిక్కెట్ కన్ఫమ్ అన్న నమ్మకం లీడర్లలో కనిపిస్తోంది. జనసేనలోకి వలసలు టీడీపీకి ఇబ్బందిగా మారుతున్నాయి. టీడీపీ ఆశిస్తున్న స్థానాలను కూడా జనసేన డిమాండ్ చేసే ఛాన్సుంది. ఇప్పటికే తిరుపతి సీటు విషయంలో రెండు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవిని గెలిపించిన సీటు కూడా తిరుపతి కావడంతో జనసేన నాయకులు దాన్ని సైకిల్ పార్టీకి ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ బలిజ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువే. వీళ్ళే గెలుపు ఓటములను డిసైడ్ చేస్తారు. బలిజలంతా జనసేన పక్షం ఉండటంతో … తమ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయమంటున్నారు.
జనసేనలో (JanaSena)కి ఊహించని విధంగా వలసలు పెరుతుండటం… బడా నేతలే వస్తుండటంతో ఆ పార్టీ వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని జనసేన నాయకులు కోరుకుంటున్నారు. అందుకే కూటమి పొత్తులో భాగంగా 63 సీట్లను గ్లాసు పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బీజేపీ కూడా ఈ కూటమితో కలిస్తే… తెలుగుదేశం పోటీ చేసే సీట్ల సంఖ్య ఇంకా తగ్గే అవకాశముంది. అందుకు చంద్రబాబు ఒప్పుకుంటారా లేదా అని డౌట్ ఉంది.