PAVAN HOUSE : ఇద్దరికి అచ్చిరాని ఇంట్లో పవన్ క్యాంపాఫీస్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారిక నివాసంగా ఇరిగేషన్ గెస్ట్‌హౌస్ ఫైనల్ అయింది. విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న ఆ ఇంట్లో గతంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు.

Irrigation Guesthouse has been finalized as the official residence of Deputy CM Pawan Kalyan.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారిక నివాసంగా ఇరిగేషన్ గెస్ట్‌హౌస్ ఫైనల్ అయింది. విజయవాడ సూర్యారావుపేటలో ఉన్న ఆ ఇంట్లో గతంలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఆ తర్వాత మళ్ళీ గెలవలేదు. మరి పవన్ ఏరి కోరి ఆ బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్తున్నారన్న చర్చ జనసేన లీడర్లు, కార్యకర్తల్లో నడుస్తోంది.
ఏపీ విభజన తర్వాత విజయవాడలో ఇరిగేషన్ SE ఆఫీసు ఆవరణలో పులిచింతల ప్రాజెక్ట్ ఆఫీసు కోసం కట్టిన బిల్డింగ్స్ ని అప్పటి జలవనరుల శాఖ మంత్రి క్యాంపాఫీస్ గా మార్చారు. ఆ తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడకు షిప్ట్ అయ్యారు. దాంతో సీఎంకి బెజవాడలో క్యాంపు కార్యాలయం అవసరమైంది. దాంతో అప్పటి ఇరిగేషన్ మినిస్టర్ దేవినేని ఉమా ఉన్న క్యాంపాఫీస్ నే… సీఎం ఆఫీసుగా మార్చారు. ఆ వెంటనే అవసరమైన సౌకర్యాలు, అదనపు హంగులన్నీ ఏర్పాటు చేశారు. కొన్ని రోజుల తర్వాత చంద్రబాబు ఉండవల్లికి మకాం మార్చారు. ఆ తర్వాత దేవినేని ఉమా అక్కడ కంటిన్యూ అయ్యారు. మంత్రి నివాసంతో పాటు క్యాంపాఫీస్, పక్కనే ఇరిగేషన్ ఆఫీస్ కోసం భారీ బిల్డింగ్ కూడా కట్టారు. 2016లో విజయవాడ క్యాంపాఫీస్ నుంచి చంద్రబాబు వెళ్లిపోయాక… కొన్ని రోజులు ఏపీ హైకోర్టుని అక్కడే కొనసాగించారు. రాయపూడిలో హైకోర్టు బిల్డింగ్స్ పూర్తయ్యాక హైకోర్టు కూడా అక్కడకు షిప్ట్ అయింది. ఆ తర్వాత దాన్ని గవర్నర్ నివాసం కోసం ఎంపిక చేశారు.
రాజ్‌భవన్ వెనుక మంత్రి దేవినేని ఉమా ఎంతో ఇష్టంగా కట్టించుకున్న గెస్ట్‌హౌస్‌ను 2019లో ఆయన ఓడిపోవడంతో ఖాళీ చేశారు. ఇరిగేషన్ శాఖకు చెందిన ఆ బిల్డింగ్స్ లో అన్నిసౌకర్యాలు ఉన్నాయి. విశాలమైన కాన్ఫరెన్స్ హాల్స్, ఇతర సదుపాయాలు ఉన్నాయి. దేవినేని ఉమ వెళ్ళిపోయాక… వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఆ బిల్డింగ్ లోకి మారిపోయారు. ఇరిగేషన్ మినిస్ట్రీ అనిల్ చేతిలో ఉన్నా… ఆ శాఖకు చెందిన భవనాన్ని మాత్రం బొత్స ఆక్రమించేశారు. ఆయన ఎన్ని శాఖలు మారినా… ఐదేళ్ళ వరకూ అందులోనే ఉన్నారు. ఈ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో 5యేళ్ళు మకాం వేసిన దేవినేని ఉమా 2019లో ఓడిపోయారు. 2024లో టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో అసలు ఆయనకు పోటీ చేసే అవకాశమే రాలేదు. అలాగే 2019లో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బొత్స సత్యనారాయణ 2024లో ఓడిపోయారు. అంటే ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు మంత్రులకీ ఓటమి తప్పలేదు. మరి ఇప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు అదే ఇల్లు కేటాయిస్తున్నారు.
విజయవాడ సిటీ మధ్యలో కోర్టు కాంప్లెక్స్‌కు రాజ్‌భవన్‌కు మధ్యలో ఉండే ఈ ఇరిగేషన్ గెస్ట్ హౌస్‌లో గతంలో ఉన్న ఇద్దరు మంత్రులకు కలిసి రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే ఇంట్లో ఉంటే… ఆయన భవిష్యత్ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ కార్యక్రమాలతో పాటు భారీ సంఖ్యలో వచ్చే కార్యకర్తలు, లీడర్లతో సమావేశాలకు… అలాగే అధికార కార్యకలాపాలకు వీలు ఉంటుందని పవన్ కల్యాణ్ కి ఈ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ బిల్డింగ్ ని ప్రస్తుత ప్రభుత్వం ఎలాట్ చేసింది. గత మంత్రులకు ఎదురైన అనుభవాలతో పవన్ ఆ ఇంట్లోకి మారతారా ? లేదా అన్నది చూడాలి.