YCP : ప్రత్యేక హోదానే..వైసీపీని బతికించబోతుందా ?

వైసీపీ (YCP) ని చిత్తు చిత్తుగా ఓడించి ఏపీలో అధికారం దక్కించుకోవడమే కాదు.. కేంద్రంలోనూ ఎన్డీఏ (NDA) సర్కార్‌లో కీ రోల్ ప్లే చేస్తోంది టీడీపీ (TDP) . కూటమిలో బీజేపీ (BJP) తర్వాత అత్యధిక ఎంపీలు కలిగిన పార్టీగా.. రెండో స్థానంలో ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 19, 2024 | 10:13 AMLast Updated on: Jun 19, 2024 | 10:13 AM

Is Special Status Going To Survive Ycp

 

 

వైసీపీ (YCP) ని చిత్తు చిత్తుగా ఓడించి ఏపీలో అధికారం దక్కించుకోవడమే కాదు.. కేంద్రంలోనూ ఎన్డీఏ (NDA) సర్కార్‌లో కీ రోల్ ప్లే చేస్తోంది టీడీపీ (TDP) . కూటమిలో బీజేపీ (BJP) తర్వాత అత్యధిక ఎంపీలు కలిగిన పార్టీగా.. రెండో స్థానంలో ఉంది. నిజానికి ఇది ఎప్పుడో కానీ దక్కని అవకాశం. కావాల్సిన నిధుల కోసం అయినా.. హామీల అమలు కోసం అయినా.. అటు బీజేపీని, ఇటు ఎన్డీఏ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయొచ్చు. అలాంటి పవర్‌ఫుల్ స్థానంలో టీడీపీ ఉంది. దీంతో ఇప్పుడు పాత డిమాండ్లే.. కొత్తగా తెరమీదకు వస్తున్నాయ్. రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు.. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఇదే సరైన సమయం అని.. చంద్రబాబు సర్కార్ ఆ దిశగా చర్యలు తీసుకోవాలని జనాలతో పాటు.. ఏపీలో మిగిలిన పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయ్. హోదా విషయంలో అసలు సంగతి ఏంటో తేల్చాలని.. కాంగ్రెస్‌ ఎన్నికల ముందు నుంచే డిమాండ్ చేస్తుండగా.. ఇప్పుడు వైసీపీ కూడా హోదా అంశాన్ని లేవనెత్తుతోంది.

ఇలా విపక్షాల నుంచి.. ముఖ్యంగా వైసీపీ నుంచి చంద్రబాబు (Chandrababu) సర్కార్‌ మీద ఒత్తిడి పెరుగుతోంది. చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయకముందే ప్రత్యేక హోదా డిమాండ్‌ చేయాలని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ చంద్రబాబుకు ఓ లేఖ రాయగా.. ఆ తర్వాత జగన్ కూడా ఇదే మాట ఇంకాస్త గట్టిగా ఎత్తుకున్నారు. విపక్షాల నుంచి ఎంత ఒత్తిడి పెరుగుతున్నా.. చంద్రబాబు హోదా విషయంలో సైలెంట్‌గా ఉండడంపై కొత్త చర్చ జరుగుతోంది. నిజానికి ఏపీ డిమాండ్లు, రావాల్సిన నిధులు, హోదా విషయంలో.. కేంద్రంలోని బీజేపీతో టీడీపీ, జనసేన ఒప్పందంతో ఉన్నాయని తెలుస్తోంది. స్పెషల్ స్టేటస్‌ గురించి.. ఎట్టి పరిస్థితుల్లో నోరు ఎత్తుకూడదని.. ఆ సబ్జెక్ట్‌ను సాధ్యమైనంత వరకు అటక మీదే ఉంచాలని టీడీపీ, జనసేన ఫిక్స్ అయినట్లు సమాచారం. ఐతే వైసీపీ మాత్రం హోదాను ఆయుధంగా మార్చుకోవాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఎక్కడ పోగొట్టుకున్నామో, దేనివల్ల పోగొట్టుకున్నామో.. అక్కడే వెతకాలని, దాన్నే వెతకాలని డిసైడ్ అయినట్లు కనిపిసతోంది. 2019లో ప్రత్యేక హోదా అంశంతో జగన్ ఎన్నికలకు వెళ్లారు. ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కేంద్రంలో తమ మద్దతుపై ఆధారపడే ప్రభుత్వం వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం అని చేతులు ఎత్తేశారు.

ఇప్పుడు మళ్లీ ఆ నినాదమే జీవం పోస్తుందని ఆశతో ఉన్నారు. అందుకే ప్రత్యేక హోదా అంశాన్ని మళ్లీ తెరమీదకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఆ మధ్య ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్‌.. ఎన్నికల ఓటమిపై నిరుత్సాహపడొద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఇలా చెబుతూనే ప్రత్యేక హోదాపై ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు హోదాపై జగన్ నోరు తెరవలేదు. 22మంది ఎంపీలున్నా.. పార్లమెంట్‌లో చర్చించింది లేదు. ఆందోళన చేసింది లేదు. ఐతే అధికారం కోల్పోగానే హోదాపై మళ్లీ రాజకీయాలు స్టార్ట్ చేశారు. టీడీపీ ప్రస్తుతం ఎన్డీయేలో కీలకంగా ఉందని.. ఇప్పటికైనా ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలని.. ఇప్పుడు సాధించకపోతే చారిత్రక తప్పిదం అవుతుందన్న జగన్‌.. సైకిల్ పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. ఇక రాబోయే రోజుల్లో ఇదే అంశాన్ని జగ్‌ రాజకీయ ఎజెండాగా మార్చుకోబోతున్నారు. బిజెపి నుంచి రహస్యంగా ఒత్తిడి వస్తే తప్ప… వైసీపీ ప్రత్యేక హోదా సబ్జెక్టును వదిలి పెట్టే అవకాశాలు లేకపోవచ్చు. హోదా అని ముగిసిన అధ్యాయం అని అందరూ డిసైడ్ అయిన వేళ.. ఆ నినాదం మూసివేతకు దగ్గరగా ఉన్న వైసీపీకి ప్రాణం పోస్తుందా.. జగన్‌ను జనం నమ్ముతారా.. రాబోయే ఐదేళ్లు ఏం జరగబోతుంది అంటే.. కాలమే సమాధానం చెప్పాలి మరి.