AP Alliance : ఉచితాలకు వ్యతిరేకం అనే బీజేపీ.. కూటమి హామీలతో ఇరుకున పడిందా..?
సూపర్ సిక్స్ అంటూ ఓ మినీ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకువచ్చిన చంద్రబాబు.. జనసేన (Janasena), బీజేపీతో కలిసిన తర్వాత పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణాల నుంచి, 50ఏళ్లకు పెన్షన్, మహిళలకు నెలకు నగదు..
మేనిఫెస్టోలో మార్పులు ఖాయమా?
సూపర్ సిక్స్ అంటూ ఓ మినీ మేనిఫెస్టోను జనాల్లోకి తీసుకువచ్చిన చంద్రబాబు.. జనసేన (Janasena), బీజేపీతో కలిసిన తర్వాత పూర్తి స్థాయి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఉచిత బస్సు ప్రయాణాల నుంచి, 50ఏళ్లకు పెన్షన్, మహిళలకు నెలకు నగదు.. ఇలా వరాల లిస్ట్.. ఆ మేనిఫెస్టోలో పెద్దగానే ఉంది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయ్. ఉచితాలతో జనాలను సోమరిపోతులను తయారుచేస్తోందని ఇన్నాళ్లు వైసీపీని తిట్టిన టీడీపీ.. ఇప్పుడు చేస్తుందేంటి.. ఈ పథకాలతో ఖజానా మీద మరింత ఆర్థిక భారం పడదా.. రాష్ట్రం దివాళా తీయదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇక వైసీపీ (YCP) అయితే ఓ అడుగు ముందుకేసి.. కూటమి ఓ ఆట ఆడుకుంటోంది. వైసీపీ పాలన బాగుందని.. మేనిఫెస్టో ద్వారా టీడీపీ (TDP) నే ఒప్పుకుందని కార్నర్ చేస్తోంది. ఈ రచ్చ అంతా ఎలా ఉన్నా.. ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పే బీజేపీ.. ఇప్పుడు కూటమిలో భాగం అయింది. దీంతో చెప్పేదొకటి.. చేసేదొకటి.. లక్ష్యం ఒకటి, నడిచే దారి ఒకటా అంటూ.. బీజేపీ (BJP) ని ఆడుకోవడం స్టార్ట్ చేశారు ఇప్పటికే చాలామంది. మరి దీన్ని కమలనాథులు ఎలా కవర్ చేస్తారు అనే చర్చ జరుగుతోంది. ఏపీలో పరిణామాలు.. దేశవ్యాప్తంగా మిగతా పార్టీలకు ఆయుధంగా మారే చాన్స్ ఉంటుంది. రాజకీయం కోసం ప్రాంతానికి ఓ నీతా అంటూ నిలదీసే ప్రమాదం ఉంటుంది.
దీంతో బీజేపీ ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఐతే మేనిఫెస్టోలో మోదీ ఫోటో లేదు.. పైగా ఆ కాపీని పట్టుకునేందుకు కూడా రిలీజ్ కార్యక్రమంలో బీజేపీ నేతలు ఆసక్తి చూపించలేదన్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయ్. దీంతో కమలం మనసులో మాట ఏంటి.. మేనిఫెస్టోలో మార్పులకు బీజేపీ పట్టుబట్టే అవకాశాలు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయిన పీయూష్ గోయల్.. ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. సూపర్ సిక్స్‌లో భారీ హామీలు ఉండడం.. ఉచితాలకు పెద్దపీట వేయడంతో.. ఇది కరెక్ట్ కాదు అని బీజేపీ పెద్దలు చెప్తున్న మాట. ఉమ్మడి మేనిఫెస్టోలో కేంద్రంలో బీజేపీ తీసుకువచ్చిన పథకాలను ఎక్కువగా చేర్చాలని పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి మరి.