ప్రమాదం లో శ్రీశైలం ప్రాజెక్ట్ పాతికేళ్ల తరవాత కూలిపోక తప్పదా?

వర్షాకాలం వచ్చిందంటే చాలు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద దృశ్యాలు పర్యాటకులను కనువిందు చేస్తూ ఉంటాయి. 1984 నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ ను చూడటానికి లక్షలాది మంది పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 11, 2024 | 04:40 PMLast Updated on: Aug 11, 2024 | 4:40 PM

Is The Srisailam Project In Danger Collapsing After A Few Years

వర్షాకాలం వచ్చిందంటే చాలు శ్రీశైలం ప్రాజెక్ట్ వద్ద దృశ్యాలు పర్యాటకులను కనువిందు చేస్తూ ఉంటాయి. 1984 నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ ను చూడటానికి లక్షలాది మంది పర్యాటకులు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. శ్రీశైలం మల్లన్నను దర్శించుకునే ప్రతీ ఒక్కరు కూడా ప్రాజెక్ట్ వద్ద వరద పారుతున్న దృశ్యాలను చూసేందుకు వెళ్తూ ఉంటారు. ప్రాజెక్ట్ నిండుకుండలా ఉందనే వార్తలు వస్తే చాలు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం కూడా ఈ ప్రాజెక్ట్ మీద దృష్టి సారించి పర్యాటకులను ఆకట్టుకునే చర్యలు చేపట్టింది.

అలాంటి శ్రీశైలం ప్రాజెక్ట్ ఇంకో 25 ఏళ్ళ తర్వాత కనుమరుగు అయిపోతుంది అంటున్నారు నిపుణులు. ప్రాజెక్ట్ జీవిత కాలం తగ్గిపోతుందని, ఆ స్థానంలో మరో ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్తున్నారు. భారీ బహుళార్థసాధక ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు, నల్గొండ జిల్లాలతో పాటు చెన్నైకి తాగునీరు వెళ్తూ ఉంటుంది. శ్రీశైలం కుడి ప్రధాన కాలువ రాయలసీమకు ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. అలాగే భారీ ఎత్తున విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతోంది ఇక్కడి నుంచి. అలాంటి ప్రాజెక్ట్ జీవిత కాలం ఇంకో 25 ఏళ్ళు మాత్రమే అని అంచనా వేస్తున్నారు.

శ్రీశైలం ప్రాజెక్ట్ జలాశయం వద్ద ప్లంజ్ పూల్ గొయ్యి ఏర్పడింది. దీని లోతు దాదాపు 130 అడుగులు. దీని నష్టం అంచనా వేయడానికి దాదాపు 25 ఏళ్ళ నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిని పూడ్చడం కూడా సాధ్యం కాని పరిస్థితి ఏర్పడింది. శాస్త్రీయ పద్దతిలో మాత్రమే దాన్ని పూడ్చాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం ప్రాజెక్ట్ లైఫ్ టైం ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ లైఫ్ టైం తగ్గిపోవడానికి ప్లంజ్ పూల్ ప్రధాన కారణం అని అంటున్నారు నిపుణులు. దీనిపై జాతీయ స్థాయిలో అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసి వారి సహకారంతో చర్యలు చేపట్టాల్సి ఉన్నా… దీనిపై ముందు అడుగు పడలేదు.

ఈ పరిణామాలు అన్నీ కూడా ఈ ప్రాజెక్ట్ మనుగడను ప్రశ్నార్ధకంగా మార్చేశాయి. మరో 25 – 30 ఏళ్ళ వరకు ఇబ్బంది లేదని నిపుణులు అంటున్నా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అలాగే ఈ ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ 215 టీఎంసీలు అని చెప్తున్నా… కాని అది 180-185ల మించి ఉండదు అనేది నిపుణుల మాట. ఈ పూడిక చాలా వేగంగా పెరిగిపోతుందని… రాబోయే రోజుల్లో నీటి నిలువ సామర్ధ్యం 150 టీఎంసీలకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ స్థానంలో ఎగువన మరో ప్రాజెక్ట్ కట్టుకోవలసిన అవసరం ఉందని సూచిస్తున్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో చూడాలి.