AP Politics : జగన్ ఫర్నిచర్ దొంగ.. టీడీపీ – వైసీపీ కొత్త వార్

ఏపీలో రాజకీయం కుర్చీలు బల్లలు చుట్టూ తిరుగుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య ఫర్నిచర్ వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 16, 2024 | 12:30 PMLast Updated on: Jun 16, 2024 | 12:30 PM

Jagan Is A Furniture Thief Tdp Ycp New War

ఏపీలో రాజకీయం కుర్చీలు బల్లలు చుట్టూ తిరుగుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య ఫర్నిచర్ వార్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తోంది. సీఎం క్యాంపాఫీసుని… జగన్ పార్టీ ఆఫీసుగా మార్చేశారని, అందులో సర్కార్ ఫర్నిచర్ ని వాడేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. ఈ ఆరోపణల్ని ఖండించిన వైసీపీ…. ఫర్నిచర్ కు డబ్బులెంతో చెప్పండి… ఇచ్చిపడేస్తామని కౌంటర్లు ఇస్తోంది.

తెలుగుదేశం, వైసీపీ మధ్య ఫర్నిచర్ వార్ ముదురుతోంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్వీట్ వార్ సాగుతోంది. సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో ప్రభుత్వ ఖర్చుతో… జగన్ ఫర్నిచర్ ను సెటప్ చేసుకున్నారన్న టీడీపీ నేతలు… ప్రభుత్వం మారినా… అదే క్యాంప్ ఆఫీసు సెటప్ ను పార్టీ అవసరాలకు వాడుకోవడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఫర్నిచర్ తిరిగిచ్చేయ్యాల్సింది పోయి….పార్టీ సమావేశాలకు వాడుతున్నారని విమర్శించారు. మంత్రులు అచ్చెన్నాయుడు, లోకేష్‌ కూడా…. నాడు, నేడు ఫోటోలను షేర్ చేశారు.

జగన్ క్యాంపాఫీసుకు ఐదేళ్ళల్లో 45 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్టు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో ఏసీలు, ఆలయాల సెట్టింగ్స్, టేబుళ్ళు, ఇతర ఫర్నిచర్ కు, సోఫాలు, కుర్చీలు, ఇతరత్రా సామాగ్రికి, వీడియో, టెలీ కాన్ఫరెన్స్ లకు, కిటికీలు, తలుపులకు ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి… రాజవైభోగాలు అనుభవించారని టీడీపీ ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి భద్రత పేరుతో ఎంత ఖర్చుపెట్టినా… ఎవరూ అడిగే వాళ్ళు ఉండరనీ… జగన్ తన ఇంట్లో ప్రజల సొమ్ముతో సోకులు అమర్చుకున్నాడని ఆరోపిస్తున్నారు. 2019, 2020లో జగన్ ఇంటి కోసం R &B శాఖ 28 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. అవేవీ బయటకు రాకుండా జీవోలను దాచేశారన్నది ఆరోపణ. జగన్ అధికారం కోల్పోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇప్పుడు ఓ సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్, పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్ క్వాలిఫేషన్స్ యాక్ట్ 1953 ప్రకారం జగన్ తన ఇంట్లో ప్రభుత్వ ఖర్చుతో సమకూర్చుకున్న అన్ని చరాస్తులను ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

అప్పుడు కోడెలపై 2 లక్షల రూపాయల ఫర్నిచర్ దొంగతనం కేసు పెట్టినప్పుడు. ఇప్పుడు జగన్ పై కోట్ల రూపాయల చోరీ కేసు ఎందుకు పెట్టకూడదని కోడెల శివరాం ప్రశ్నించారు. అయితే, టీడీపీ ఆరోపణలను వైసీపీ ఖండించింది. నిస్సిగ్గుగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. సీఎం హోదాలో ఎవరున్నా… క్యాంప్ కార్యాలయంలో తగిన ఏర్పాట్లు చేసుకోవడం సర్వసాధారణం. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపాఫీసులో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే ఇచ్చామని అంటోంది. టైమ్ ఇస్తే… ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు చేసిన ఫర్నిచర్ కు విలువ కట్టి… ఎంత తిరిగి చెల్లించాలో చెబితే…అంతా చెల్లిస్తామని అధికారులకు చెప్పామని స్పష్టం చేసింది వైసీపీ. మరోవైపు సీఎం హోదాలో జగన్ క్యాంప్ ఆఫీస్ కోసం ఎంత ఖర్చు పెట్టామనే అంశంపై నాటి జీవోలను అధికారులు వెలికితీస్తున్నారు. ఒక్క ఫెన్సింగ్ కోసమే 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని గుర్తించారు. నిబంధనలను అతిక్రమించారని తేలితే నోటీసులిచ్చే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.